Share News

అద్దె కార్యకర్తలు

ABN , Publish Date - Apr 25 , 2024 | 01:37 AM

నగరంలో పనుల్లేక ఇబ్బంది పడుతున్న నిరుపేదలు, దినసరి కూలీలు ఎన్నికల పుణ్యమా అని నాలుగు మెతుకులు తినగలుగుతున్నారు.

అద్దె కార్యకర్తలు

రాజకీయ కూలీలకు డిమాండ్‌

రోడ్‌షోలు, సభలు, ప్రచారం, ర్యాలీలు...

కార్యక్రమం ఏదైనా జెండాలు మోసేది ఎక్కువగా వారే

ఇప్పటివరకూ రూ.300 చొప్పున ఇస్తున్న నేతలు

ఒకటి, రెండు నియోజక వర్గాల్లో రూ.వెయ్యి...

ఇప్పుడు తమకూ అంతే మొత్తం ఇవ్వాలని డిమాండ్‌

మరో గత్యంతరం లేక రూ.500 చొప్పున ఇవ్వడానికి పలువురు అభ్యర్థుల సమ్మతి

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

నగరంలో పనుల్లేక ఇబ్బంది పడుతున్న నిరుపేదలు, దినసరి కూలీలు ఎన్నికల పుణ్యమా అని నాలుగు మెతుకులు తినగలుగుతున్నారు. రాజకీయ పార్టీల ర్యాలీలు, ఊరేగింపులకు స్వచ్ఛందంగా వచ్చేవారు చాలా తక్కువగా ఉంటారు. దీంతో డబ్బులిచ్చి జనాలను తెచ్చుకోవాల్సిన పరిస్థితి నేతలకు ఏర్పడింది. అయితే పోలింగ్‌ సమీపిస్తుండడంతో రాజకీయ కూలీలకు డిమాండ్‌ పెరిగింది. ఇప్పటివరకూ భోజనం పెట్టి ఒక మనిషికి రూ.300 చొప్పున ఇవ్వగా, ఇప్పుడు తమ కూలీ రేటు పెంచితేగానీ రాలేమని అంటుండడంతో నేతలు తలలు పట్టుకుంటున్నారు.

పోలింగ్‌కు మరో 18 రోజులే గడువు ఉంది. ప్రధాన పార్టీల అభ్యర్థులంతా నామినేషన్‌ దాఖలు కార్యక్రమాన్ని తమ బల ప్రదర్శనకు ఉపయోగించుకుంటున్నారు. మరోవైపు తమ తమ పార్టీల పెద్దల సభలు, రోడ్‌షోలు జరుగుతుండడంతో వాటికి కూడా జనాలను తరలించాల్సిన పరిస్థితి. ఇంకొకవైపు ప్రతీరోజూ వార్డుల్లో నిర్వహించే ప్రచారం/సభలకు కూడా జనాలు అవసరం. కానీ రాజకీయ పార్టీల కార్యక్రమాలకు జనాలు స్వచ్ఛందంగా వచ్చే పరిస్థితి లేకపోవడంతో డబ్బులిచ్చి జనాలను తెచ్చుకోవలసిన పరిస్థితి ఏర్పడింది. వార్డు స్థాయిలో తమ పార్టీ నేతల ద్వారా స్థానికంగా ఉండే కాలనీలు, భవన నిర్మాణ కూలీలు ఎక్కువగా ఉండే ప్రాంతాలకు వెళ్లి జనాలను తెచ్చుకుంటున్నారు. ఒక గంటపాటు జెండా పట్టుకుని నిలబడడమో, సభకు హాజరై కూర్చుని వెళ్లిపోవడమో అయితే మనిషికి రూ.200 ఇచ్చేలా ఒప్పందం చేసుకుంటున్నారు. అదే ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు లేదంటే మధ్యాహ్నం నుంచి రాత్రి వరకూ ఉండాల్సి వచ్చినా, ర్యాలీలో తిరగాల్సి వచ్చినా రూ.500 ఇస్తున్నారు. కొన్ని నియోజకవర్గాల్లో అయితే అధికార పార్టీకి చెందిన అభ్యర్థులు ఇలాంటి వారికి ఏకంగా రూ.వెయ్యి వరకూ ఇస్తున్నారు. ఒకేసారి అందరికీ అద్దె కార్యకర్తల అవసరం రావడంతో ప్రచారంలో పాల్గొనే కూలీలకు డిమాండ్‌ పెరిగిపోయింది. కాసేపు కూర్చొని వచ్చేయడం లేదంటే జెండా పట్టుకుని రెండు, మూడు గంటలు నినాదాలు చేయడం చేస్తే రూ.300 నుంచి రూ.500 వరకూ వస్తుండడంతో రాజకీయ కూలీలు కూడా అలాంటి కార్యక్రమాలకు ఆసక్తి చూపుతున్నారు. ఏ పార్టీవాళ్లు పిలిస్తే ఆపార్టీ జెండా పట్టుకుని నినాదాలు చేస్తున్నారు. జనాలను సమీకరించే బాధ్యతను పార్టీ ముఖ్య నేతలు కాకుండా వార్డు స్థాయిలోని చోటా నేతలు, కార్పొరేటర్లకు అప్పగిస్తున్నారు. వార్డు నుంచి ఎంతమందిని తీసుకురావాలని చెబితే అంతమందిని నేతలు తీసుకువెళుతున్నారు. ఇదిలావుండగా నామినేషన్ల ఘట్టం ప్రారంభమైన తర్వాత రాజకీయ కూలీలకు డిమాండ్‌ విపరీతంగా పెరిగిపోయింది. ఒకవైపు ముఖ్య నేతలు ఎన్నికల ప్రచారానికి, మరోవైపు నామినేషన్‌ ర్యాలీ/ఊరేగింపులో పాల్గొనేందుకు జనాలను సమీకరించాల్సిన పరిస్థితి. దీంతో ఒకే సమయంలో వేర్వేరు కార్యక్రమాలు ఉండడంతో రాజకీయ కూలీలు ఎటు వెళ్లాలో తేల్చుకోలేని పరిస్థితిలో పడ్డారు. అయితే ఈ పరిస్థితిని కూలీలు కొందరు తమకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటివరకూ ఇస్తున్న రూ.300 అయితే తాము రాలేమని, ఎండలు తీవ్రంగా ఉండడంతో ఇబ్బందిపడాల్సి వస్తోందని, తమకు ఫలానా నియోజకవర్గంలో ఇస్తున్నట్టుగా రూ.వెయ్యి ఇస్తేనే వస్తామంటూ స్పష్టంచేస్తున్నారు. ఒకేసారి అంత మొత్తం పెంచేయడంతో వార్డు స్థాయి నేతలు, కార్పొరేటర్లు విషయాన్ని తమ నేతలకు వివరిస్తున్నారు. ఎన్నికల ఖర్చు పెరిగిపోయిందనే బాధలో ఉన్న తమకు మరింత భారం పెరిగిపోతోందంటూ లబోదిబోమంటున్నారు. అయినప్పటికీ జన సమీకరణలో వెనుకబడితే ఓటింగ్‌పై ప్రభావం చూపుతుందనే భయంతో వారు అడిగినంత కాకుండా రూ.500 ఇచ్చేందుకు సమ్మతిస్తున్నారు. ఏదిఏమైనా ఎన్నికలు రాజకీయ పార్టీల నేతల తలరాతను ఎలా మార్చుతాయోగానీ, పనుల్లేక ఇబ్బందిపడుతున్న కూలీలకు మాత్రం ఉపాధి కల్పించాయనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.

Updated Date - Apr 25 , 2024 | 01:37 AM