హైవేపై దారిదోపిడీలు!
ABN , Publish Date - Jun 15 , 2024 | 12:53 AM
నగరంలో ఈ తరహా ఘటనలు పెరిగిపోతున్నాయి.
నగరంలో ఆకతాయిల హల్‌చల్
ఒంటరిగా నడిచివెళ్లేవారు, ద్విచక్ర వాహనదారులను అటకాయించి సెల్‌ఫోన్‌లు, జేబులో ఉండే నగదును దోచుకుంటున్న వైనం
అక్కయ్యపాలెం జంక్షన్ నుంచి కంచరపాలెం వరకూ వరుస ఘటనలు
హైవే పెట్రోలింగ్ ఏర్పాటుచేస్తేనే దోపిడీలకు అడ్డుకట్ట
పోలీసులు దృష్టిసారించాలంటున్న నగర వాసులు
(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)
ఒక ప్రైవేటు కార్యాలయంలో పనిచేస్తున్న ఉద్యోగి కొద్దిరోజుల కిందట అర్ధరాత్రి దాటిన తర్వాత తన విధులు ముగించుకుని ఎన్‌ఏడీ జంక్షన్ ప్రాంతంలో గల ఇంటికి వెళ్లేందుకు ఆటో కోసం తాటిచెట్లపాలెం జంక్షన్ వైపు నడిచివెళుతుండగా జాతీయ రహదారిపై బైక్‌పై వచ్చిన ఇద్దరు వ్యక్తులు అటంకించారు. చేతిలోని సెల్‌ఫోన్‌తోపాటు జేబులో నగదు లాక్కోబోయారు. ఎదురు తిరగడంతో రాళ్లతో దాడి చేశారు.
అక్కయ్యపాలెంలో గల ఒక ప్రైవేటు సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగి గురువారం అర్ధరాత్రి సమయంలో విధులు ముగించుకుని మధురవాడలోని తన ఇంటికి వెళ్లేందుకు ద్విచక్ర వాహనంపై బయలుదేరారు. జాతీయ రహదారిపై పోర్టు స్టేడియం వద్దకు వెళ్లేసరికి ఫోన్ రావడంతో బైక్‌ను రోడ్డు పక్కన ఆపారు. అదే సమయంలో వెనుక నుంచి బైక్‌పై వచ్చిన ముగ్గురు యువకులు...ఆయన చేతిలోని సెల్‌ఫోన్ లాక్కొనేందుకు యత్నించారు. ఆయన వెంటనే అప్రమత్తమై గట్టిగా అరవడంతో అక్కడి నుంచి పరారయ్యారు.
నగరంలో ఈ తరహా ఘటనలు పెరిగిపోతున్నాయి. శివారు ప్రాంతాలతోపాటు నగర నడిబొడ్డున జాతీయ రహదారిపైనే ఇలాంటి ఘటనలు తరచూ చోటుచేసుకోవడం సర్వత్రా ఆందోళన కలిగిస్తోంది. నగరంలో కొంతమంది ఆకతాయిలు గ్రూపులుగా ఏర్పడి అర్ధరాత్రి సమయంలో దారిదోపిడీలకు పాల్పడుతున్నారు. ఇందుకోసం ప్రధానంగా పెందుర్తి-ఆనందపురం జాతీయ రహదారిపైనా, అలాగే ఆనందపురం నుంచి కొమ్మాది జంక్షన్ వరకూ, నగర పరిధిలో అక్కయ్యపాలెం జంక్షన్ నుంచి కంచరపాలెం జంక్షన్ మధ్య ప్రాంతాలను ఎంచుకుంటున్నారు. పెందుర్తి పోలీస్ స్టేషన్ పరిధిలో కొంతమంది యువకులు అర్ధరాత్రి వేళ లారీలను ఆపి డ్రైవర్, క్లీనర్లను కొట్టి వారి వద్ద నుంచి సెల్‌ఫోన్‌లు, నగదు లాక్కొన్న సంఘటనలు పలుమార్లు జరిగాయి. ఈ విధంగా జాతీయ రహదారిపై లారీలను ఆపి దారిదోపీడీలకు పాల్పడుతున్న ముఠాను పోలీసులు కొన్నాళ్ల కిందట అరెస్టు చేసిన విషయం తెలిసిందే. నగర పరిధిలో విషయానికి వస్తే అక్కయ్యపాలెం జంక్షన్ నుంచి కంచరపాలెం జంక్షన్ వరకూ జాతీయ రహదారికి ఇరువైపులా పలుచోట్ల గుబురుగా చెట్లు ఉన్నాయి. రాత్రివేళ ఆయా చెట్ల వద్ద చీకటిగా ఉంటుంది. అలాంటిచోట్ల కొంతమంది దొంగలు, ఆకతాయిలు దారికాసి అర్ధరాత్రి సమయంలో ఒంటరిగా వెళ్లేవారిని అడ్డుకుని, ఎదురు తిరిగితే దాడి చేసి మరీ వారి వద్ద నుంచి సెల్‌ఫోన్‌లు, నగదు, విలువైన వస్తువులు వంటివి గుంజుకుపోతున్నారు. ఈ తరహా సంఘటనలు తరచూ జరుగుతున్నందున పోలీసులు సీరియస్‌గా దృష్టిసారించాల్సిన అవసరం ఉందని నగరవాసులు అభిప్రాయపడుతున్నారు. నగర నడిబొడ్డున జాతీయ రహదారిపైనే భద్రత లేకపోతే ఎలాగని ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ఇప్పటికైనా పోలీసులు ఆయా ప్రాంతాలను కవర్ చేసేలా రాత్రిపూట జాతీయ రహదారిపై పెట్రోలింగ్ నిర్వహించాలని కోరుతున్నారు.