Share News

హైస్కూళ్ల ప్లస్‌ అట్టర్‌ ఫ్లాప్‌

ABN , Publish Date - Apr 14 , 2024 | 01:09 AM

బాలికల కోసం ప్రత్యేకంగా రెండేళ్ల క్రితం వైసీపీ ప్రభుత్వం ప్రారంభించిన ‘హైస్కూలు ప్లస్‌’ విధానం ఆచరణలో విఫలమైంది.

హైస్కూళ్ల ప్లస్‌ అట్టర్‌ ఫ్లాప్‌

ఫలితాలు ఘోరం

ఇంటర్మీడియట్‌ పరీక్షలకు 278 మంది హాజరు

కేవలం 47 మంది మాత్రమే పాస్‌

ఇంటర్‌, పాఠశాల విద్యాశాఖ మధ్య సమన్వయలోపమే కారణం

హెచ్‌ఎంలు, పీజీటీల మధ్య ఆధిపత్య పోరు

సవ్యంగా సాగని బోధన

వచ్చే ఏడాది మరో మూడుచోట్ల హైస్కూలు ప్లస్‌ ప్రారంభానికి సిద్ధమైన ప్రభుత్వం

విశాఖపట్నం, ఏప్రిల్‌ 13 (ఆంధ్రజ్యోతి):

బాలికల కోసం ప్రత్యేకంగా రెండేళ్ల క్రితం వైసీపీ ప్రభుత్వం ప్రారంభించిన ‘హైస్కూలు ప్లస్‌’ విధానం ఆచరణలో విఫలమైంది. నగరంలోని ఆరుచోట్ల గల హైస్కూల్‌ ప్లస్‌ నుంచి ఈ ఏడాది ఇంటర్మీడియట్‌ ప్రథమ, ద్వితీయ సంవత్సరాలు కలిపి 278 మంది పరీక్షలు రాయగా కేవలం 47 మంది మాత్రమే ఉత్తీర్ణత సాధించారు. హైస్కూలు ప్లస్‌ల నిర్వహణ, పర్యవేక్షణలో పాఠశాల, ఇంటర్మీడియట్‌ విద్యా శాఖ మధ్య సమన్వయం కుదరకపోవడం, ఆయా ఉన్నత పాఠశాలల్లో ప్రధానోపాధ్యాయులు, పీజీటీ టీచర్ల మధ్య ఆధిపత్య పోరు వంటి అనేక అంశాలు ఇంటర్‌ చదువుకునే బాలికలకు శాపంగా మారాయి.

జిల్లాలోని ఆరు జడ్పీ, మునిసిపల్‌ ఉన్నత పాఠశాలలు...సీతమ్మధార నెహ్రూ మునిసిపల్‌ ఉన్నత పాఠశాల, మల్కాపురం జీవీఎంసీ ఉన్నత పాఠశాల, గంగవరం, గాజువాక, గోపాలపట్నం, రాంపురం జడ్పీ ఉన్నత పాఠశాలల్లో 2022-23 విద్యా సంవత్సరం నుంచి బాలికల కోసం హైస్కూలు ప్లస్‌ ప్రారంభించారు. రాంపురంలో 2023-24 సంవత్సరం నుంచి తరగతులు ప్రారంభించారు. గత ఏడాది ఆరుచోట్ల కలిపి 174 మంది బాలికలు పరీక్షలు రాయగా కేవలం ఏడుగురే ఉత్తీర్ణత సాధించారు. చదువులు సక్రమంగా సాగడం లేదని భావించిన 54 మంది బాలికలు టీసీలు తీసుకుని మరొకచోటకు వెళ్లిపోగా, మిగిలిన 120 మంది ప్రస్తుత విద్యా సంవత్సరంలో రెండో ఏడాది తరగతులకు హాజరయ్యారు. ప్రథమ ఏడాదిలో ఎక్కువమంది బాలికలు చేరే విధంగా ఆయా ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఎంఈవో, డీఈవోలు చొరవ చూపడంతో మొత్తం 173 మంది చేరారు. తొలి ఏడాది ఆయా ఉన్నత పాఠశాలల్లో పీజీ అర్హత ఉన్న టీచర్లకు తరగతుల నిర్వహణ బాధ్యత అప్పగించిన విద్యా శాఖ, ప్రస్తుత ఏడాదిలో మాత్రం స్కూలు అసిస్టెంట్లుగా పనిచేసిన సీనియర్లను పోస్టు గ్రాడ్యుయేట్‌ టీచర్లు (పీజీటీ)గా డిప్యూటేషన్‌పై నియమించింది. ప్రతి టీచరుకు బేసిక్‌ ఆధారంగా వచ్చే ఒక ఇంక్రిమెంటు ప్రతి నెలా ఇవ్వాలని విద్యా శాఖ నిర్ణయించింది. ఈ మేరకు ఉమ్మడి జిల్లాలో 71 మంది సీనియర్లు పీజీటీలుగా ఆరు హైస్కూలు ప్లస్‌లలో నియమితులయ్యారు. అనకాపల్లి, అల్లూరి జిల్లాల్లో పనిచేసిన పలువురు టీచర్లు నగరంలో పనిచేయవచ్చునని హైస్కూలు ప్లస్‌లలో చేరిపోయారు తప్ప అంత సీరియస్‌గా తరగతుల బోధనలో మమేకం కాలేదన్న ఆరోపణలున్నాయి.

అన్ని అడ్డంకులే..

ఉన్నత పాఠశాలల్లో నాలుగు గదులు హైస్కూలు ప్లస్‌కు కేటాయించారు. పూర్తిగా ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడి అజమాయిషీలో పీజీటీలు పనిచేయాలి. అయితే హెచ్‌ఎం, పీజీటీల మధ్య ఆఽధిపత్య పోరు సాగింది. దీనిపై విద్యాశాఖ దృష్టిసారించలేదు. హైస్కూలు ప్లస్‌లో ఇంటర్‌ తరగతులు ప్రవేశపెట్టినా అక్కడ పీజీటీలు మొత్తం పాఠశాల విద్యా శాఖ అజమాయిషీలో పనిచేస్తున్నారు. పాఠశాలలు కూడా పాఠశాల విద్య, మునిసిపల్‌ పరిపాలన శాఖకు చెందినవి. అయితే ఇంటర్‌ తరగతులకు సంబంధించి సిలబస్‌, పరీక్షలు మాత్రం ఇంటర్‌ బోర్డు, ఇంటర్‌ విద్యాశాఖ నిర్వహిస్తోంది. మొత్తం ఇంటర్‌ బోర్డు, పాఠశాల విద్యాశాఖ మధ్య సమన్వయం లేకపోవడం బోధనపై తీవ్ర ప్రభావం చూపింది. ఇంకా ఆరు హైస్కూలు ప్లస్‌లలో ఎంపీసీ, బైపీసీ విద్యార్థినులకు ఇంటర్‌ స్థాయిలో ప్రయోగశాలలు లేవు. సీనియర్‌ ఇంటర్‌ చదివే బాలికలు సమీపంలోని జూనియర్‌ కళాశాలలకు వెళ్లి అక్కడ లెక్చరర్లకు నామమాత్రం రుసుం చెల్లించి లేబొరేటరీల్లో ప్రయోగాలు చేశారు. కాగా పీజీటీలుగా 2023 జూన్‌లో చేరిన 71 మందికి ఇంటర్‌ విద్యా బోధనను అనుగుణంగా పునశ్చరణ తరగతులు నిర్వహించలేదు. ఈ విషయంలో ఇంటర్‌ విద్యా శాఖ చొరవ తీసుకోలేదు. ఇదిలావుండగా గత ఏడాది జూన్‌లో చేరిన పీజీటీలకు ఇప్పటివరకూ అదనపు ఇంక్రిమెంట్లు అందలేదు. ప్రతినెలా సగటున ఒక పీజీటీకి జీతానికి అదనంగా రూ.3 వేలు అందాలి. కానీ పరీక్ష ఫలితాలు వచ్చినా పీజీటీలకు ఇంక్రిమెంట్లు అందలేదు. శుక్రవారం విడుదల చేసిన ఫలితాల్లో పరీక్ష తప్పిన బాలికలు మళ్లీ సప్లమెంటరీ పరీక్షలకు సిద్ధం చేయడానికి స్పెషల్‌ తరగతులు నిర్వహించాలని విద్యా శాఖ తాజాగా ఆదేశించింది.

వచ్చే విద్యా సంవత్సరంలో మూడుచోట్ల హైస్కూలు ప్లస్‌

ఈ ఏడాది జూన్‌ నుంచి ప్రారంభం కానున్న విద్యా సంవత్సరంలో జిల్లాలో కొత్తగా మరో మూడు ఉన్నత పాఠశాలల్లో హైస్కూలు ప్లస్‌లు ప్రారంభించనున్నారు. పద్మనాభం మండలం రెడ్డిపల్లి అగ్రహారం, గోపాలపట్నం మండలం హెచ్‌సీ వెంకటాపురం జడ్పీ ఉన్నత పాఠశాలలు, నగరంలోని కురుపాం మార్కెట్‌ సమీపాన గల ఎంవీడీఎం ఉన్నత పాఠశాలలో బాలికల కోసం ఇంటర్‌ ప్రథమ ఏడాది తరగతులు ప్రారంభిస్తారు. ఈ మూడు ఉన్నత పాఠశాలల్లో చదువుకునే బాలికలకు అక్కడే ఇంటర్‌లో ప్రవేశాలు కల్పించేలా తల్లిదండ్రులను నచ్చజెప్పాలని హెచ్‌ఎంలకు విద్యా శాఖ ఆదేశించింది.

నిరాశాజనకంగా ఫలితాలు

గత విద్యా సంవత్సరం ఇంటర్మీడియట్‌ ప్రథమ ఏడాది విద్యార్థులు మొత్తం 173 మంది ఉండగా వారిలో 167 మంది పరీక్షలు రాయగా 25 మంది (20.32 శాతం), సెకండ్‌ ఇయర్‌లో మొత్తం 120కి 111 మంది పరీక్షలు రాయగా 22 మంది (21.21 శాతం) ఉత్తీర్ణత సాధించారు. ప్రథమ ఏడాది గంగవరంలో కేవలం ఎనిమిది మంది బాలికలే ఉండగా వారంతా పరీక్షలు రాయగా ఐదుగురు ఉత్తీర్ణత సాధించారు. గాజువాకలో 51 మందికి కేవలం ఐదుగురు, రాంపురంలో 20 మందికి ఒకరు, మల్కాపురంలో ఎనిమిది మందికి ఒకరు, సీతమ్మధారంలో 26 మందికి నలుగురు, గోపాలపట్నంలో 54 మందికి తొమ్మిది మంది పాసయ్యారు. ద్వితీయ సంవత్సరం...గాజువాకలో 43 మంది పరీక్షలు రాయగా తొమ్మిది మంది, గంగవరంలో 15 మందికి ఇద్దరు, మల్కాపురంలో 12 మందికి ముగ్గురు, సీతమ్మధారలో 14 మందికి ఐదుగురు, గోపాలపట్నంలో 27 మందికి ముగ్గురు మాత్రమే పాసయ్యారు.

Updated Date - Apr 14 , 2024 | 01:09 AM