Share News

హై అలర్ట్‌

ABN , Publish Date - Jun 04 , 2024 | 01:43 AM

ఓట్ల లెక్కింపు సందర్భంగా ఘర్షణలు జరిగే అవకాశం ఉందన్న నిఘా వర్గాల హెచ్చరికలతో నగరంలో హై అలర్ట్‌ ప్రకటించారు. మంగళవారం నగరంపై డ్రోన్లతో నిఘా పెడుతున్నట్టు సీపీ రవిశంకర్‌ అయ్యన్నార్‌ వెల్లడించారు. కౌంటింగ్‌ కేంద్రంతోపాటు నగరంలో భద్రతాపరంగా తీసుకుంటున్న చర్యలను ‘ఆంధ్రజ్యోతి ప్రతినిధి’కి ఆయన వివరించారు. ఓట్ల లెక్కింపు జరిగే ఏయూ ఇంజనీరింగ్‌ కాలేజీ ప్రాంగణంతోపాటు నగరవ్యాప్తంగా 3,500 మంది సిబ్బందితో బందోబస్తు ఏర్పాటుచేశామన్నారు. ఇతర జిల్లాల నుంచి ఒక ఐపీఎస్‌ అధికారి, పలువురు నాన్‌కేడర్‌ ఎస్పీలు, అదనపు ఎస్పీ స్థాయి అధికారులు, 300 మంది సీఐ, ఎస్‌ఐ, కానిస్టేబుళ్ల స్థాయి సిబ్బందితోపాటు, ఐదు ప్లటూన్ల ఏపీఎస్పీ బలగాలు, రెండు ప్లటూన్ల సీఆర్‌పీఎఫ్‌ బలగాలు నగరానికి చేరుకున్నాయన్నారు.

హై అలర్ట్‌

నగరంలో డ్రోన్లతో నిఘా

ఓట్ల లెక్కింపు నేపథ్యంలో 3,500 మందితో బందోబస్తు

133 సున్నిత ప్రాంతాల్లో ప్రత్యేక భద్రత

ప్రధాన పార్టీల అభ్యర్థులకు బాక్స్‌ టైప్‌ సెక్యూరిటీ

సోషల్‌ మీడియాలో రెచ్చగొట్టే పోస్ట్‌లు పెడితే రౌడీషీట్‌

గ్రూప్‌ అడ్మిన్లపై ఐటీ యాక్ట్‌ కింద కేసు

ఫలితాలు అనంతరం ర్యాలీలు నిషేధం

సీపీ రవిశంకర్‌ అయ్యన్నార్‌

విశాఖపట్నం, జూన్‌ 3 (ఆంధ్రజ్యోతి):

ఓట్ల లెక్కింపు సందర్భంగా ఘర్షణలు జరిగే అవకాశం ఉందన్న నిఘా వర్గాల హెచ్చరికలతో నగరంలో హై అలర్ట్‌ ప్రకటించారు. మంగళవారం నగరంపై డ్రోన్లతో నిఘా పెడుతున్నట్టు సీపీ రవిశంకర్‌ అయ్యన్నార్‌ వెల్లడించారు. కౌంటింగ్‌ కేంద్రంతోపాటు నగరంలో భద్రతాపరంగా తీసుకుంటున్న చర్యలను ‘ఆంధ్రజ్యోతి ప్రతినిధి’కి ఆయన వివరించారు. ఓట్ల లెక్కింపు జరిగే ఏయూ ఇంజనీరింగ్‌ కాలేజీ ప్రాంగణంతోపాటు నగరవ్యాప్తంగా 3,500 మంది సిబ్బందితో బందోబస్తు ఏర్పాటుచేశామన్నారు. ఇతర జిల్లాల నుంచి ఒక ఐపీఎస్‌ అధికారి, పలువురు నాన్‌కేడర్‌ ఎస్పీలు, అదనపు ఎస్పీ స్థాయి అధికారులు, 300 మంది సీఐ, ఎస్‌ఐ, కానిస్టేబుళ్ల స్థాయి సిబ్బందితోపాటు, ఐదు ప్లటూన్ల ఏపీఎస్పీ బలగాలు, రెండు ప్లటూన్ల సీఆర్‌పీఎఫ్‌ బలగాలు నగరానికి చేరుకున్నాయన్నారు. కౌంటింగ్‌ సమయంలో, ఫలితాలు వెల్లడైన తర్వాత అల్లర్లు జరిగేందుకు అవకాశం ఉన్న 133 ప్రాంతాలను గుర్తించామన్నారు. ఆయా ప్రాంతాల్లో మొబైల్‌ పెట్రోలింగ్‌ పార్టీతోపాటు పది మంది సిబ్బందితో పికెట్‌లను ఏర్పాటుచేశామన్నారు. సిబ్బందికి బాడీ వార్న్‌ కెమెరాలను అందజేసి, ఆయా ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటుచేసి కమాండ్‌ కంట్రోల్‌రూమ్‌ నుంచి పర్యవేక్షిస్తామన్నారు. అల్లర్లకు పాల్పడేందుకు అవకాశం ఉందని గుర్తించిన 230 మందితోపాటు 650 మంది యాక్టివ్‌ రౌడీషీటర్లను బైండోవర్‌ చేశామన్నారు. కంట్రోల్‌ రూమ్‌లో అదనపు ఎస్పీ స్థాయి అధికారి ఆధ్వర్యంలో ప్రత్యేకంగా సిబ్బందిని ఏర్పాటుచేసి నగరంలో ఏ ప్రాంతంలో ఏం జరుగుతుందనేది ఎప్పటికప్పుడు పర్యవేక్షించేలా ఏర్పాట్లు చేశామన్నారు. ఎక్కడైనా అల్లర్లు జరిగినా, అనుమానాస్పద వ్యక్తులు కనిపించినా, గుంపులుగా తిరుగుతున్నాసరే డయల్‌ 100, 112 నంబర్లకు ఫోన్‌ చేసి సమాచారం ఇస్తే మూడు నిమిషాల వ్యవధిలో సిబ్బంది అక్కడకు చేరుకునేలా ఏర్పాట్లు చేశామన్నారు. ప్రతి నియోజక వర్గానికి ఒక డ్రోన్‌ను కేటాయించామని, వాటిని సిబ్బంది ఎగరవేస్తూ వీధులు, కూడళ్లలో జనసంచారం ఎలా ఉందనే దానిపై నిఘా పెడతారన్నారు. నగరంలో 144 సెక్షన్‌తోపాటు ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లో ఉన్నందున ర్యాలీలు, విజయోత్సవ సంబరాలు, సమావేశాలు నిర్వహించడానికి వీల్లేదన్నారు. ఓట్ల లెక్కింపునకు వెళ్లే సమయంలోనూ, పూర్తయిన తర్వాత తిరిగి ఇంటికివెళ్లే సమయంలో ప్రధాన పార్టీల అభ్యర్థులు, ముప్పు ఉందని గుర్తించిన అభ్యర్థులకు బాక్స్‌ తరహా సెక్యూరిటీ కల్పిస్తామని సీపీ చెప్పారు. అలాగే నగర పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో పోటీలో నిలిచిన 44 మంది అభ్యర్థుల ఇళ్ల వద్ద కూడా ముందుజాగ్రత్తగా బందోబస్తు ఏర్పాటుచేశామన్నారు. ప్రజలను రెచ్చగొట్టేలా సోషల్‌ మీడియాలో పోస్టులు పెడితే వారిపై కేసులు పెట్టి రౌడీషీట్‌ తెరుస్తామని సీపీ హెచ్చరించారు. ఆయా గ్రూపుల అడ్మిన్లను కూడా బాధ్యులను చేసి ఐటీ యాక్ట్‌ 66ఏ కింద కేసులు నమోదుచేస్తామన్నారు. ఎన్నికల కోడ్‌ ఉల్లంఘనల కేసుల్లో చిక్కుకుంటే వారికి భవిష్యత్తులో పాస్‌పోర్ట్‌ పొందే అవకాశం కోల్పోవాల్సి ఉంటుందన్నారు.

Updated Date - Jun 04 , 2024 | 01:43 AM