టోల్‌గేటుపై దాగుడుమూతలు
ABN , Publish Date - Jun 27 , 2024 | 01:06 AM
అగనంపూడి టోల్‌గేటు వద్ద బుధవారం వసూలు ఆగాయి.

ఎన్‌హెచ్‌ఏఐ అధికారులకు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు ఫోన్
ఆనందపురం-అనకాపల్లి జాతీయ రహదారి నిర్మాణం పూర్తయినందున అగనంపూడిలో టోల్‌గేటు ఎత్తివేయాలని విజ్ఞప్తి
బుధవారం నిలిచిన వసూళ్లు
కానరాని సిబ్బంది
ఉన్నతాధికారులతో మాట్లాడుతున్నామంటున్న ఎన్‌హెచ్‌ఐ ప్రాజెక్టు డైరెక్టర్
అగనంపూడి, జూన్ 26:
అగనంపూడి టోల్‌గేటు వద్ద బుధవారం వసూలు ఆగాయి. అయితే ఇంకా నిలిపివేసినట్టేనని స్థానికులు భావిస్తుండగా, అలాంటిదేమీ లేదని నేషనల్ హైవే అథారిటీ అధికారులు అంటున్నారు. ఈ విషయమై ఉన్నతాధికారులతో చర్చిస్తున్నాంటున్నారు.
నగర పాలక సంస్థ పరిధిలో టోల్‌గేటు ఉండరాదన్న నిబంధనను తుంగలో తొక్కి గత కొన్నేళ్లుగా వాహనాల నుంచి ఫీజు వసూలు చేస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. దీనిపై ఈ ప్రాంతవాసులు చాలాకాలంగా ఆందోళనలు చేస్తున్నారు. 2019లో ఎమ్మెల్యేగా ఉన్న పల్లా శ్రీనివాసరావు...గాజువాక బార్ అసోసియేషన్ సాయంతో హైకోర్టులో న్యాయం పోరాటం చేసి టోల్‌గేటును ఎత్తివేయించారు. ఆ తరువాత మూడు నెలల వ్యవధిలోనే వైసీపీ అధికారంలోకి రావడంతో ఎన్‌హెచ్‌ఏఐ అధికారులు మళ్లీ టోల్‌గేటును ఏర్పాటుచేశారు. గత ఐదేళ్లుగా వాహనాల నుంచి ఫీజు వసూలు చేస్తున్నారు. దీంతో తాము అధికారంలోకి వస్తే టోల్‌గేటు తొలగిస్తామని ఇటీవల ఎన్నికల ముందు పల్లా శ్రీనివాసరావు హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో కూటమి కార్యకర్తలు కొందరు మంగళవారం రాత్రి టోల్‌గేటు వద్ద ఆందోళన చేపట్టారు. స్టాపర్లు తొలగించి వాహనాల నుంచి ఫీజులు వసూలు చేయకుండా అడ్డుకున్నారు. అనంతరం ఎన్‌హెచ్‌ఏఐ అధికారులతో ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు ఫోన్‌లో మాట్లాడారు. అనకాపల్లి-ఆనందపురం జాతీయ రహదారి నిర్మాణం పూర్తయ్యాక ఇక్కడ టోల్‌గేటును తొలగిస్తామని చెప్పారని, అయినా ఇంకా వసూళ్లు కొనసాగించడ మేమిటని ప్రశ్నించారు. టోల్‌గేటు వద్ద వసూళ్లకు ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించబోమన్నారు. ఈ విషయంలో శాంతిభద్రతల సమస్య తలెత్తితే అందుకు హైవే అధికారులు బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. దీంతో మంగళవారం రాత్రి నుంచి టోల్‌ఫీజుల వసూళ్లు నిలిచిపోయాయి. బుధవారం సిబ్బంది కూడా రాకపోవడంతో టోల్‌బూత్‌లు ఖాళీగా దర్శనమిచ్చాయి. టోల్‌ఫీజుల వసూలు నిలిపివేయడంతో వాహన చోదకులు ఆనందం వ్యక్తంచేశారు.
డ్యామేజీని సరిచేస్తున్నాం: ఎన్‌హెచ్‌ఐ పీడీ
ఈ విషయమై నేషనల్ హైవే అథారిటీ ప్రాజెక్టు డైరెక్టర్ ప్రభాత్ రంజన్‌ను వివరణ కోరగా...అగనంపూడి టోల్ గేట్ కొంత దెబ్బతిందన్నారు. ఆ డ్యామేజీని సరిదిద్దే పనిని చేపట్టినట్టు వెల్లడించారు. టోల్‌గేట్ నిర్వహణపై ఉన్నతాధికారులతో చర్చిస్తున్నామని, ఏం చేయాలో నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు.