Share News

భారీ వర్షం

ABN , Publish Date - Jun 07 , 2024 | 12:35 AM

ఏజెన్సీలో నైరుతి ప్రభావం కొనసాగుతున్నది. ఏజెన్సీ వ్యాప్తంగా గురువారం ఉరుములు, పిడుగులతో కూడిన భారీ వర్షం కురిసింది.

భారీ వర్షం
పాడేరు- అరకులోయ జాతీయ రహదారిపై భారీ వర్షం

పాడేరు మండలం సంగోడిలో పిడుగుపాటుకు గిరిజనుడు మృతి

జీకే వీధి మండలంలో దుక్కిటెద్దు..

పాడేరు, జూన్‌ 6:(ఆంధ్రజ్యోతి): ఏజెన్సీలో నైరుతి ప్రభావం కొనసాగుతున్నది. ఏజెన్సీ వ్యాప్తంగా గురువారం ఉరుములు, పిడుగులతో కూడిన భారీ వర్షం కురిసింది. పాడేరు మండలం సంగోడి గ్రామ సమీపంలో పిడుగుపాటుకు మాసాడ మల్లేశ్వరరావు(42)అనే గిరిజనుడు మృతి చెందారు. గ్రామానికి సమీపంలో పశువులను మేపుతుండగా ఈ ఘటన చోటు చేసుకుందని స్థానికులు తెలిపారు. ఏజెన్సీ వ్యాప్తంగా ఉదయం నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు సాధారణ వాతావరణం కొనసాగి ఎండ కాసింది. కానీ ఆ తరువాత నుంచి ఆకాశం మేఘావృతమైంది. ఒక్కసారిగా ఉరుములు, పిడుగులతో కూడిన భారీ వర్షం మొదలైంది. సమారు రెండు గంటల పాటు వర్షం కొనసాగింది. పాడేరుతో పాటు ఏజెన్సీ వ్యాప్తంగా భారీ వర్షం కురిసింది. రోడ్లన్నీ జలయమం కాగా, పంట పొలాల్లో వర్షపు నీరు భారీగా చేరింది. కాగా జీకే వీధి మండలంలోని కొత్తబంద గ్రామంలో పిడుగుపాటుకు ఓ దుక్కిటెద్దు మృతి చెందింది.

కొయ్యూరులో..

కొయ్యూరు: మండల వ్యాప్తంగా గురువారం మధ్యాహ్నం భారీ వర్షం కురిసింది. ఉదయం నుంచి ఒక మోస్తరుగా ఎండ కాసి అనంతరం వాతావరణంలో మార్పు చోటు చేసుకుంది దీంతో మధ్యాహ్నం రెండు గంటల సమయంలో ఉరుములు, మెరుపులతో భారీ వర్షం కురిసింది. సుమారు గంటన్నర పాటు కురిసిన వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. కొన్ని చోట్ల వడగళ్లు పడ్డాయి. ఈ వర్షం వరినారు మళ్ల తయారీకి ఉపకరిస్తుందని రైతులు చెబుతున్నారు.

Updated Date - Jun 07 , 2024 | 12:35 AM