...అంతా ఆయనే చేశారు
ABN , Publish Date - Jun 07 , 2024 | 01:17 AM
ఐదేళ్లలో ప్రజలకు ఎన్నో సంక్షేమ పథకాలు అందించాం. డీబీటీ పేరుతో నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమ చేశాం.

జగన్ వ్యవహారశైలే కొంపముంచింది
ఓటమిపై అంతరంగిక సంభాషణల్లో వైసీపీ అభ్యర్థులు, నేతల విశ్లేషణ
వార్డు/గ్రామ సచివాలయాలు, వలంటీర్ల పేరుతో ఎమ్మెల్యేలు, పార్టీ నేతలకు ప్రజలతో సంబంధాలు లేకుండా చేశారు
ఐదేళ్లలో ఎలాంటి ఉద్యోగాలు భర్తీ చేయకపోవడంతో యువత, నిరుద్యోగుల్లో ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత
క్రమబద్ధీకరణకు సవాలక్ష ఆంక్షలతో సచివాలయ ఉద్యోగుల్లోనూ అసంతృప్తి
ప్రభుత్వమే మద్యం దుకాణాలను నిర్వహించడం
పార్టీ ఓటమికి మరో కారణం
నాసిరకం మద్యం తాగినవారు అనారోగ్యం పాలవ్వడంతో వారి కుటుంబ సభ్యుల్లో వైసీపీపై ఆగ్రహం
బటన్ నొక్కితే చాలు...అదే పరిపాలన అనుకున్నారు
ఐదేళ్లలో సీఎంగా ప్రజల్లో తిరగకపోవడం, ప్రజా ప్రతినిధులకు కలిసే అవకాశం ఇవ్వకపోవడం,
ఏకపక్ష నిర్ణయాలు, ఒంటెత్తు పోకడలే దారుణ పరాజయానికి కారణం
ఎన్నికల్లో ఎంత డబ్బు పెట్టినా ఉపయోగం లేకుండా పోయిందని సన్నిహితుల వద్ద ఆక్రోశం
(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)
‘‘ఐదేళ్లలో ప్రజలకు ఎన్నో సంక్షేమ పథకాలు అందించాం. డీబీటీ పేరుతో నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమ చేశాం. వార్డు సచివాలయాల ద్వారా ప్రజలకు ప్రభుత్వ సేవలను చేరువచేశాం. వార్డు వలంటీర్ల ద్వారా ఇంటింటికీ ప్రభుత్వ పథకాలను చేరవేశాం. ఇంతకంటే ఇంకేం చేయాలి. ప్రజలంతా మాకే ఓటేస్తారు. మా గెలుపు ఖాయం. మళ్లీ అధికారాన్ని నిలబెట్టుకుంటాం’’...అంటూ బీరాలు పలికిన వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు, నేతలు మంగళవారం వెలువడిన ఫలితాలను చూసి కంగుతిన్నారు. ఘోర పరాజయానికి గల కారణాలను తమ సన్నిహితులతో పంచుకుంటున్నారు.
గడచిన (2019) ఎన్నికల్లో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి జిల్లాలో 11 ఎమ్మెల్యే స్థానాలను గెలుచుకుంది. నగరంలోని తూర్పు, దక్షిణ, ఉత్తర, పశ్చిమ నియోజక వర్గాల్లో టీడీపీ అభ్యర్థులు గెలిచినప్పటికీ కొద్దిరోజులకే దక్షిణ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్‌కుమార్ వైసీపీ పంచన చేరిపోయారు. అయితే ఈసారి జరిగిన ఎన్నికల్లో ఏజెన్సీ పరిధిలోని అరకులోయ, పాడేరు మినహా మిగిలిన 13 నియోజకవర్గాల్లో కూటమి (తెలుగుదేశం, జనసేన, బీజేపీ) అభ్యర్థులు ఘన విజయం సాధించారు. వైసీపీ అభ్యర్థులు భారీ తేడాతో ఓటమి పాలయ్యారు. అందుకు గల కారణాలను వారు ఇప్పుడు విశ్లేషించుకుంటున్నారు. తాజా ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల కంటే దీటుగా డబ్బులు ఖర్చుపెట్టినా ఘోరంగా ఓటమి పాలవ్వడం ఆశ్చర్యంగా ఉందని కొందరు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ఈ పరిస్థితికి సీఎం వై.ఎస్.జగన్మోహన్‌రెడ్డి వ్యవహారశైలే కారణమని ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పటి నుంచే వార్డు వలంటీర్లు, వార్డు/గ్రామ సచివాలయాల పేరుతో ఎమ్మెల్యేలు, పార్టీ నేతలకు ప్రజలతో సంబంధాలు లేకుండా చేశారని విమర్శిస్తున్నారు. సంక్షేమ పథకాలకు లబ్ధిదారుల ఎంపిక నుంచి, వారికి వాటిని అందజేసే బాధ్యత వరకూ అంతా వలంటీర్లు, సచివాలయ సిబ్బందికి అప్పగించడంతో ఎమ్మెల్యేలు, నియోజకవర్గ సమన్వయకర్తలుగా ఉన్న తాము నామమాత్రంగా మారిపోయామని వాపోతున్నారు.
అలాగే గత ఐదేళ్లలో గ్రామ/వార్డు సచివాలయ ఉద్యోగాలు తప్పితే ఎలాంటి ఉద్యోగాలు భర్తీ చేయకపోవడం, ఒక్కసారి కూడా డీఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వకపోవడం, చివర్లో హడావుడిగా విడుదల చేసినప్పటికీ ఆచరణలో పెట్టకపోవడం వల్ల యువత, నిరుద్యోగుల్లో ప్రభుత్వం పట్ల వ్యతిరేకత నెలకొందని అభ్యర్థులు, నేతలు అభిప్రాయపడుతున్నారు. ఇక గ్రామ/వార్డు సచివాలయ ఉద్యోగులను క్రమబద్ధీకరించే విషయంలో సవాలక్ష ఆంక్షలు పెట్టడంతో వారిలో కూడా ఉద్యోగం కల్పించారనే కృతజ్ఞత పోయి, అసంతృప్తి పేరుకు పోయిందని పేర్కొంటున్నారు.
కొంపముంచిన మద్యం వ్యాపారం
తమ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మద్యం పాలసీని మార్చడం కూడా తాజా ఎన్నికల్లో ఓటమికి కారణంగా కొందరు అభ్యర్థులు, నేతలు విశ్లేషిస్తున్నారు. గతంలో ఉన్న ప్రైవేటు మద్యం దుకాణాలను తొలగించి, ప్రభుత్వమే మద్యం దుకాణాలను నిర్వహించడం కూడా పార్టీ ఓటమికి దారితీసిందంటున్నారు. తమ పార్టీ నేతలే కొన్ని మద్యం డిస్టిలరీలను లీజుకు తీసుకుని అక్కడ తయారయ్యే నాసిరకం మద్యాన్ని దుకాణాల్లో విక్రయించడం మొదలెట్టారని, కూలీలు, దిగువ మధ్య తరగతి ప్రజలు ఆ మద్యం తాగి అనారోగ్యం పాలవ్వడంతో వారి కుటుంబ సభ్యుల్లో ప్రభుత్వం పట్ల వ్యతిరేకత ఏర్పడిందని అభిప్రాయపడుతున్నారు. మరోవైపు మద్యం ధరలను విపరీతంగా పెంచేయడం, కావాల్సిన బ్రాండ్లు అందుబాటులో లేకుండా చేయడంతో మందుబాబులు కూడా ప్రభుత్వంపై ఆగ్రహంతో ఉన్నారన్నారు. అమ్మఒడి, చేయూత, ఆసరా వంటి పథకాల విషయంలో ప్రభుత్వంపై ప్రజల్లో సానుకూలత ఉన్నప్పటికీ, నాసిరకం మద్యం సేవించి సాయంత్రం ఇంటికి చేరుకునే యజమానిని చూసి ఆ ఇంట్లోని సభ్యులంతా జగన్‌కు వ్యతిరేకంగా మారారని విశ్లేషిస్తున్నారు. సంపూర్ణ మద్య నిషేధం అమలు చేస్తామని చెప్పి మాట తప్పడం కూడా ప్రజల్లో జగన్ విశ్వసనీయతను దెబ్బతీసిందని నాయకులు అంటున్నారు. ప్రభుత్వ పనితీరుపై వివిధ వర్గాల ప్రజలు ఏమనుకుంటున్నారు...ఇంకా ఏం కోరుకుంటున్నారు?, ఎలాంటి పథకాలు, అభివృద్ధి పనులు చేయాలో నిత్యం ప్రజల్లో తిరిగే నాయకులతో కాకుండా దొడ్డిదారిన ప్యాలెస్‌లో చేరి భజన చేసేవారితో చర్చించడం, వారి సలహాలను తీసుకోవడం జగన్‌తోపాటు తమను కూడా నట్టేట ముంచేసిందని లబోదిబోమంటున్నారు. అదేవిధంగా ఐదేళ్లలో సీఎంగా ప్రజల్లో తిరగకపోవడం, ప్రజా ప్రతినిధులకు కలిసే అవకాశం ఇవ్వకపోవడం, జగన్ ఏకపక్ష నిర్ణయాలు, ఒంటెత్తు పోకడలే 151 సీట్ల నుంచి 11 సీట్లకు పరిమితం కావడానికి కారణమంటున్నారు. ఎంతసేపూ బటన్ నొక్కితేచాలు...అదే పరిపాలన అనుకునే భావనలో సీఎం జగన్ ఉండిపోయారని, అదే దారుణంగా దెబ్బతీసిందంటున్నారు.
వలంటీర్లతోనే భారీ నష్టం
ఆ వ్యవస్థ వల్ల ప్రజలకు, నాయకులకు మధ్య సంబంధాల్లేకుండా పోయాయి
పనిచేసిన కార్యకర్తలకు గుర్తింపు దక్కలేదు
ఎమ్మెల్యేలకు సీఎం అపాయింట్‌మెంట్ దొరికేది కాదు
ఓటమిపై గొంతు విప్పుతున్న వైసీపీ నేతలు
(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)
వైసీపీ నాయకులు ఘోరమైన ఓటమిని జీర్ణించుకోలేకపోతున్నారు. రూ.2.5 లక్షల కోట్ల విలువైన సంక్షేమ పథకాలు అందుకున్న కోట్లాది మంది అక్కచెల్లెళ్లు, అవ్వతాతల ఓట్లు ఏమైపోయాయో?...అని ఆ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యానించగా...విశాఖ నాయకులు మాత్రం ఈ ఓటమికి అనేక కారణాలు ఉన్నాయని మనసులో మాట బయట పెడుతున్నారు. ఏనాడూ తమ అభిప్రాయాలు తెలుసుకోలేదని, క్షేత్రస్థాయిలో జరుగుతున్నది చెప్పడానికి యత్నిస్తే...కనీసం కలిసే అవకాశం కూడా సీఎం కోటరీ ఇవ్వలేదని ఎమ్మెల్యే స్థాయి నాయకులే ఆరోపిస్తున్నారు. ఓడిపోయిన నేతలు ఒక్కొక్కరు మీడియా ముందుకువస్తున్నారు. విశాఖ ఉత్తర నియోజకవర్గంలో రెండుసార్లు పోటీ చేసిన ఓడిపోయిన కేకే రాజు నిన్నగాక మొన్న విలేకరుల సమావేశం ఏర్పాటుచేసి...వలంటీర్ల వ్యవస్థే వైసీపీ కొంప ముంచిందని ఆరోపించారు. దాని వల్ల కార్యకర్తలకు గుర్తింపు లేకుండా పోయిందని విమర్శించారు. నాయకులకు, ప్రజలకు మధ్య వారధిగా ఉండే కార్యకర్తల స్థానంలో వలంటీర్లు రావడం వల్ల జనం ఏ అవసరం వచ్చినా వారి దగ్గరకే వెళ్లారని, దాంతో నాయకులతో సంబంధాలు బలపడలేదన్నారు.
మంత్రి గుడివాడ అమర్‌నాథ్ విశాఖలో గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ వలంటీర్ల వ్యవస్థ వల్ల పార్టీ కార్యకర్తలకు తీవ్రమైన అన్యాయం జరిగిందన్నారు. పార్టీకి పునాదుల్లాంటి కార్యకర్తలు ఈ ఎన్నికల్లో మనస్ఫూర్తిగా పనిచేయలేకపోయారన్నారు. అన్నింటికీ వలంటీర్ల వ్యవస్థపై ఆధారపడడం, వారికే అత్యధిక ప్రాధాన్యం ఇవ్వడం వల్ల ఎంతో నష్టం జరిగిందన్నారు. మూడు రాజధానుల అంశం ప్రస్తావిస్తూ, విశాఖను పరిపాలనా రాజధానిగా చేస్తామని, ఈ ఎన్నికల్లో ప్రజలు ఇచ్చే తీర్పు దానికి రిఫరెండంగా తీసుకుంటామని చెప్పామన్నారు. ప్రజలు దీనిని హర్షించలేదని అర్థమైందని పరోక్షంగా అంగీకరించారు. ఇది కూడా పార్టీకి పెద్ద నష్టమే కలిగించినదన్నట్టుగా మాట్లాడారు.
చోడవరం నుంచి పోటీ చేసి ఓడిపోయిన కరణం ధర్మశ్రీ చోడవరంలో గురువారం మాట్లాడుతూ వలంటీర్ల వ్యవస్థ వల్ల పార్టీకి ఎటువంటి ప్రయోజనం కలగలేదని అసంతృప్తి వ్యక్తంచేశారు. వారు పింఛన్లు పంపిణీకి ఉపయోగపడ్డారు తప్పితే ఇంకేమి చేశారని ప్రశ్నించారు. పార్టీని ఒక ప్రైవేటు కంపెనీలా ఐ ప్యాక్ బృందంతో నడిపించారని, అదే కొంప ముంచిందన్నారు. తప్పులు జరుగుతున్నాయని చెబితే కొందరు నాయకులు తనను టార్గెట్ చేశారని, క్షేత్రస్థాయిలో జరుగుతున్నది పార్టీ అధినేతకు చెబుదామనుకుంటే సీఎం పేషీ కోటరీ అనుమతి ఇవ్వలేదని ఆరోపించారు. పార్టీలో ఎవరిని కదిలించినా ఈ తరహా ఆవేదనే వ్యక్తమవుతోంది. ఇది జగన్మోహన్‌రెడ్డి చేజేతులా చేసుకున్నదేనని, ఇందులో ఎవరినీ తప్పు పట్టడానికి లేదని అంటున్నారు.