భారత్ హ్యాట్రిక్
ABN , Publish Date - Feb 06 , 2024 | 01:14 AM
అద్వితీయమైన ఆటతీరుతో భారత్ జట్టు తనకు కలిసొచ్చే పిచ్‌పై మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది.
విశాఖలో మరో విజయం
వరుసగా మూడో టెస్ట్‌లోనూ విజయం
కలిసొచ్చిన పిచ్‌పై కదంతొక్కిన ఇండియా
ఇంగ్లండ్‌పై 106 పరుగులతో విక్టరీ
రాణించిన బుమ్రా, అశ్విన్... చెరో 3 వికెట్లు
ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ జస్‌ప్రిత్ బుమ్రా
ఉత్తమ బ్యాట్స్‌మెన్‌గా జైస్వాల్, గిల్
విశాఖపట్నం (స్పోర్ట్సు), ఫిబ్రవరి 5:
అద్వితీయమైన ఆటతీరుతో భారత్ జట్టు తనకు కలిసొచ్చే పిచ్‌పై మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. ఏసీఏ-వీడీసీఏ స్టేడియంలో ఇంగ్లండ్‌తో జరిగిన రెండో టెస్ట్‌లో 106 పరుగులతో విజయం సాధించింది. దీంతో ఇప్పటివరకూ ఇక్కడ జరిగిన మూడు (ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్‌తో) టెస్ట్ మ్యాచ్‌లలో విజయం సాధించినట్టయ్యింది.
కుప్పకూలిన ఇంగ్లండ్ బ్యాటింగ్
పిచ్‌పై పగుళ్లు ఏర్పడి నాలుగో రోజు స్పిన్నర్లకు అనుకూలించేలా మారినా కెప్టెన్ రోహిత్‌శర్మ ఫాస్ట్ బౌలర్లు బుమ్రా, అక్షర్ పటేల్‌లతోనే బౌలింగ్ ప్రారంభించాడు. ఓవర్‌నైట్ స్కోరు 67/1తో ఆట ప్రారంభించిన ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్ జాక్ క్రాలీ, రెహన్ అహ్మద్ జట్టు స్కోరును వందకు చేర్చారు. ఆ సమయంలో రెహన్ అహ్మద్‌ను (23)ను అక్షరపటేల్ అద్భుతమైన బంతితో ఎల్బీడబ్ల్యు చేశాడు. రెహన్ స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన పోప్...కొద్దిసేపు బ్యాట్ ఝుళిపించాడు. బుమ్రా స్థానంలో బౌలింగ్‌కు వచ్చిన అశ్విన్...పోప్‌ను అవుట్ చేశాడు. పోప్ స్థానంలో వచ్చిన రూట్ కూడా అశ్విన్ బౌలింగ్‌లోనే అక్షరపటేల్ క్యాచ్ పట్టడంతో వెను తిరిగాడు. వ్యక్తిగత 61 పరుగుల వద్ద స్టంపౌట్ నుంచి తప్పించుకున్న జాక్ క్రాలీ (73)ని కులదీప్ యాదవ్ ఎల్‌బీడబ్ల్యుగా అవుట్ చేశాడు. కొద్దిసేపటికే జానీ బెరస్టోవ్‌ను (26) బుమ్రా ఎల్‌బీడబ్ల్యుగా పెవెలియన్‌కు పంపడంతో లంచ్ సమయానికి ఇంగ్లండ్ 194 పరుగులకు ఆరు వికెట్లు కోల్పోయింది. లంచ్ తర్వాత కెప్టెన్ బెన్ స్ర్టోక్ (11) అనూహ్యంగా రనౌట్ అయ్యాడు. ఆ తరువాత బెన్ ఫోక్స్ (36), టామ్ హార్డ్‌లీ (36) కలిసి ఎనిమిదో వికెట్‌కు 50 పరుగులు జోడించి భారత్ బౌలర్లకు సహన పరీక్ష పెట్టారు. బెన్ ఫోక్స్‌ను బుమ్రా అవుట్ చేయగా, ఫోక్స్ స్థానంలో వచ్చిన షోయబ్ బషీర్ (0) కొద్దిసేపటికే ముకేష్‌కుమార్ బౌలింగ్‌లో కీపర్ భరత్‌కు క్యాచ్ పట్టడంతో అవుటయ్యాడు. చివరిగా టామ్ హార్డ్‌లీని బుమ్రా క్లీన్ బౌల్డ్ చేయడంతో ఇంగ్లంగ్ రెండో ఇన్నింగ్స్ 292 పరుగుల వద్ద ముగిసి ఓటమి చెందింది.
ఇంగ్లండ్ బ్యాటింగ్‌ను చుట్టేసిన బుమ్రా, అశ్విన్
ఫాస్ట్ బౌలర్ బుమ్రా, స్పిన్ మాంత్రికుడు అశ్విన్‌లు టీ విరామ సమయానికి ముందే ఇంగ్లండ్ బ్యాటింగ్‌ను చుట్టేశారు. తొలి ఇన్నింగ్స్‌లో ఆరు వికెట్లు తీసిన బుమ్రా...రెండో ఇన్నింగ్స్‌లో కూడా పదునైన బంతులతో మూడు వికెట్లు పడగొట్డాడు. తొలి ఇన్నింగ్స్‌లో వికెట్ తీయలేకపోయినా అశ్విన్...రెండో ఇన్నింగ్స్‌లో మూడు కీలక వికెట్లు పడగొట్టి టెస్టు కెరీర్‌లో 499 వికెట్ల మైలురాయిని చేరుకున్నాడు.
కరతాళ ధ్వనులతో ప్రేక్షకులు
హైదరాబాద్‌లో జరిగిన తొలి టెస్టులో ఓటమి చెందిన భారత్...ఇక్కడ జరిగిన రెండో టెస్టులో ఒకరోజు మిగిలి ఉండగానే అద్భుతమైన గెలుపుతో ప్రతీకారం తీర్చుకుని సిరీస్‌ను సమం చేసింది. చివరి వికెట్‌గా టామ్ హార్డ్‌లీని బుమ్రా క్లీన్ బౌల్డ్ చేసిన వెంటనే స్టేడియం హోరెత్తింది. ప్రేక్షకులు స్టాండ్స్‌లో నిలబడి భారత్ ఆటగాళ్లు డెస్సింగ్ రూమ్‌కు వెళ్లేంత వరకూ చప్పట్లతో అభినందనలు తెలిపారు.
ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌గా బుమ్రా
రెండు ఇన్నింగ్స్‌లో తొమ్మిది వికెట్లు పడగొట్టి భారత్ జట్టు విజయంలో కీలకపాత్ర వహించిన బుమ్రా ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌గా నిలిచాడు. తొలి ఇన్నింగ్స్‌లో డబుల్ సెంచరీ (209) చేసిన యశశ్వి జైస్వాల్, రెండో ఇన్నింగ్స్‌లో సెంచరీ (104) చేసిన శుభమన్ గిల్ ఉత్తమ బ్యాట్స్‌మెన్ అవార్డు అందుకున్నారు.