అర్ధాకలితో నిర్మాణ రంగ కార్మికులు
ABN , Publish Date - Apr 02 , 2024 | 01:25 AM
‘మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే భవన నిర్మాణ రంగంలో పనిచేసే కార్మికులకు అండగా ఉంటుంది.
వైసీపీ ప్రభుత్వం అధికారంలో వచ్చిన తరువాత ఇసుక కొరత
ఉత్తరాంధ్రలోని మూడు ఉమ్మడి జిల్లాల నుంచి పనుల కోసం లక్షన్నర మంది వరకూ విశాఖ రాక
నెలకు కనీసం వారం రోజులు కూడా పనులు దొరకని పరిస్థితి
స్వగ్రామాలకు వెళ్లిపోయిన వేలాది మంది...
మరోవైపు సంక్షేమ బోర్డు రద్దు
అందులోని నిధులు మళ్లింపు
కార్మికులకు అందని సాయం
గతంలో ప్రమాదవశాత్తూ ఎవరైనా చనిపోతే రూ.5 లక్షలు, సాధారణ మరణమైతే రూ.2 లక్షలు సాయం
వివాహాలకు, చదువులకు కూడా ఆర్థిక సహాయం
ఇప్పుడు ఆ పరిస్థితే లేదని వాపోతున్న కార్మికులు
తమ బాగోగులు పట్టించుకునే వారికే వచ్చే ఎన్నికల్లో మద్దతు ఇస్తామంటూ ప్రకటనలు
విశాఖపట్నం, ఏప్రిల్ 1 (ఆంధ్రజ్యోతి):
‘మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే భవన నిర్మాణ రంగంలో పనిచేసే కార్మికులకు అండగా ఉంటుంది. ప్రమాదవశాత్తూ ఏమైనా జరిగితే కుటుంబాలను ఆదుకునే బాధ్యతను తీసుకుంటుంది’
...ఇదీ ప్రతిపక్షంలో ఉండగా వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ఇచ్చిన హామీ.
పాదయాత్ర సమయంలో తనను భవన నిర్మాణ రంగ కార్మికులు కలిసినప్పుడల్లా ఆయన ఇదే మాట చెప్పేవారు. కానీ, అధికారంలోకి వచ్చిన తరువాత ఇచ్చిన హామీని విస్మరించారు. మేలు చేయకపోగా తీవ్ర ఇబ్బందులకు గురిచేసే నిర్ణయాలు తీసుకున్నారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత భవన నిర్మాణ రంగ కార్మికులు పలు రకాల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఇసుక కొరత ఏర్పడి నిర్మాణ రంగ కార్మికులకు పనులు లేకుండా పోయాయి. 2019 నుంచి 2022 వరకూ నెలలో కనీసం వారం రోజులు కూడా పనులు దొరకని పరిస్థితిని కార్మికులు ఎదుర్కొన్నారు. ఈ మధ్యలోనే కరోనా రావడం, ఆ తరువాత పనులు నిలిచిపోవడం వంటి కారణాలతో భవన నిర్మాణ రంగంలో వందలాది మంది కార్మికులు అర్ధాకలితో గడపాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఉత్తరాంధ్రలోని అనేక ప్రాంతాల నుంచి నగరానికి వలస వచ్చిన కార్మికుల్లో ఎంతోమంది ఇక్కడ పనుల్లేక సొంత గ్రామాలకు తిరిగి వెళ్లి వ్యవసాయ కూలీలుగా జీవనం సాగిస్తున్నారు. ఇప్పటికీ ఇక్కడ పరిస్థితులు సర్దుకోకపోవడంతో చాలామంది గ్రామాల్లోనే ఉండిపోయారు.
సంక్షేమ బోర్డు రద్దుతో ఇబ్బందులు
భవన నిర్మాణ రంగంలో పనిచేసే కార్మికుల సంక్షేమ కోసం గతంలో సంక్షేమ బోర్డును ఏర్పాటుచేశారు. పది లక్షల రూపాయల కంటే ఎక్కువ వ్యయంతో నిర్మించే భవనాల నుంచి వసూలుచేసే ఒక శాతం సెస్ ఈ సంక్షేమ నిధికి వెళుతుంది. వైసీపీ సర్కారు అధికారంలోకి వచ్చేంత వరకు ఈ సంక్షేమ బోర్డులో సుమారు రూ.1,600 కోట్లు ఉంది. రూ.110 చెల్లించి సభ్యత్వం తీసుకున్న కార్మికులకు సంక్షే బోర్డు నుంచి ఆర్థిక సహాయాన్ని చేస్తుండేవారు. ప్రమాదవశాత్తూ చనిపోతే రూ.5 లక్షలు, సాధారణ మరణం అయితే రూ.2 లక్షలు, వివాహాలు, చదువులకు, ఇతర అవసరాలకు ఆర్థిక సహాయాన్ని సంక్షేమ బోర్డులోని నిధులు నుంచి చేస్తుండేవారు. అయితే, వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొద్దిరోజుల్లోనే ఈ సంక్షేమ బోర్డును రద్దు చేయడంతోపాటు అందులోని నిధులను ఇతర శాఖలకు బదలాయించింది. దీనిపై కార్మికుల పోరాటం సాగించినా ఫలితం లేకుండా పోయింది. పెళ్లిళ్లు, ప్రమాదాలు, ఇతర అవసరాల కోసం సాయం కావాలంటూ వందలాది మంది చేసుకున్న దరఖాస్తులను పక్కనపడేసింది. అలాగే, ఈ బోర్డులోని నిధులు నుంచి వేసవి కాలంలో భవన నిర్మాణ రంగ కార్మికులు పనిచేసే ప్రాంతాల్లో చలివేంద్రాలు ఏర్పాటుచేయాలి. ఇతర రాష్ట్రాల్లో భవన నిర్మాణ రంగ కార్మికులకు పెన్షన్ అందిస్తున్నారు. ఇక్కడ అటువంటి పరిస్థితి లేదు.
వేలాది మంది భవన నిర్మాణ కార్మికులు
ఉమ్మడి విశాఖ జిల్లాలో భవన నిర్మాణ రంగ కార్మికులు సుమారు 1.5 లక్షల మంది ఉంటారు. నగర పరిధిలోనే లక్ష మంది ఉంటారు. వీరంతా ఉమ్మడి ఉత్తరాంధ్ర జిల్లాల్లోని అనేక ప్రాంతాల నుంచి వలస వచ్చారు. ఎక్కువగా ఇసుకతోట,మద్దిలపాలెం, వెంకోజీపాలెం, ఆరిలోవ, సీతంపేట, ఎన్‌ఏడీ, గోపాలపట్నం తదితర ప్రాంతాల్లో నివాసం ఉంటున్నారు. భవన నిర్మాణ రంగంలో పనిచేసే వారిలో తాపీ మేస్ర్తీ, మట్టి కార్మికుడు, రాడ్ బెండింగ్, పరంజీ మేస్ర్తీ, ప్లంబర్, కార్పెంటర్, మార్బుల్స్, తదితర పనులు చేసే వాళ్లు ఉంటారు. వీరికి రోజువారీ మహిళలకు రూ.400 నుంచి 600, పురుషులకు రూ.600 నుంచి రూ.800 వరకు చెల్లిస్తుంటారు. అయితే, ప్రస్తుతం నెలలో పది రోజులు పని దొరకడం కూడా కష్టంగా ఉంటోందని చెబుతున్నారు.
ఐదేళ్లలో ఒక్కసారి కూడా మా గురించి ఆలోచించలేదు
- కోటా సత్తిబాబు, తాపీమేస్ర్తి, అల్లిపురం
గతంలో ఎన్నడూ లేని విధంగా భవన నిర్మాణ రంగంలో పనిచేసే కార్మికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చేసేందుకు పనులు కూడా దొరకడం లేదు. ఇసుక కొరతతో పనులు లేక ఎంతోమంది సొంత ఊళ్లకు వెళ్లిపోయారు. ఆశించిన స్థాయిలో నిర్మాణాలు జరగకపోవడంతో పనులకు వెతుక్కోవాల్సిన దుస్థితి ఏర్పడింది. కార్మికులకు అండగా ఉండాల్సిన ప్రభుత్వం ఆ దిశగా ఆలోచన చేయలేదు. ఐదేళ్లలో ఒక్కసారి కూడా కార్మికుల గురించి ఈ ప్రభుత్వం పట్టించుకోలేదు. భవన నిర్మాణ రంగ కార్మికులకు అండగా ఉండే ప్రభుత్వాలకే కార్మికులు మద్దతు ఉంటుంది.
కార్మిక బోర్డును తక్షణమే పునరుద్ధరించాలి
- పడాల రమణ, భవన నిర్మాణ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి (ఏఐటీయూసీ)
వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే భవన నిర్మాణ కార్మికుల పొట్టకొట్టింది. ఇసుక కొరతతో పనుల్లేకుండా చేసింది. భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డును రద్దు చేసింది. అందులో ఉన్న కోట్లాది రూపాయల నిధులను దారి మళ్లించింది. వేలాది మంది కార్మికులకు అన్యాయం చేసింది. ప్రమాదవశాత్తూ ఒక కార్మికుడు చనిపోతే వారికి అర్ధరూపాయి సాయం కూడా అందడం లేదు. ఎంతోమంది కార్మికులు పనుల్లేక ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు. పిల్లల చదువులు, పెళ్లిళ్లు, వైద్య సహాయం కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. వారికి సంక్షేమ బోర్డు నుంచి సహాయం అందకుండా చేసింది ఈ ప్రభుత్వం. కొత్త ప్రభుత్వాలు భవన నిర్మాణ కార్మికులను ఆదుకోవాలి. సంక్షేమ బోర్డును పునరుద్ధరించాలి. కార్మికుల గురించి ఆలోచన చేసే ప్రభుత్వాల పక్షానే కార్మికులు ఉంటారు.