Share News

మహా నిర్లక్ష్యం

ABN , Publish Date - Dec 18 , 2024 | 01:05 AM

నగర నడిబొడ్డున ఉన్న డైమండ్‌ పార్కు ప్రాంతంలో గజం రూ.లక్షల్లో ఉంటుంది.

మహా నిర్లక్ష్యం

  • ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి రూ.16 కోట్ల విలువైన స్థలం

  • డైమండ్‌ పార్క్‌ సమీపంలో 818 గజాలు

  • ఓపెన్‌స్పేస్‌గా నగర పాలక సంస్థ రికార్డుల్లో నమోదు

  • ఆ స్థలం తనదంటూ ప్రైవేటు వ్యక్తి వాదన

  • హైకోర్టులో జీవీఎంసీకి, ప్రైవేటు వ్యక్తికి మధ్య కేసులు పెండింగ్‌

  • ఈలోగా వివాదంలో ఉన్న స్థలం చుట్టూ ప్రహరీ గోడ కూల్చేసి చదునుచేసిన ప్రైవేటు వ్యక్తి

  • అధికారులు అడ్డుకోకపోవడంపై అనుమానాలు

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

నగర నడిబొడ్డున ఉన్న డైమండ్‌ పార్కు ప్రాంతంలో గజం రూ.లక్షల్లో ఉంటుంది. అలాంటి చోట 818 గజాలు జీవీఎంసీ ఓపెన్‌ స్పేస్‌ కింద ఉంది. అయితే ఆ స్థలం తనదంటూ ఒక వ్యక్తి కొంతకాలంగా జీవీఎంసీపై న్యాయపోరాటం చేస్తున్నారు. అందులో భవన నిర్మాణానికి గతంలో ఒకసారి దరఖాస్తు చేస్తే అధికారులు తిరస్కరించారు. అయితే వివాదం తేలేంత వరకూ ఆగకుండా ఆ స్థలానికి ఉన్న ప్రహరీ గోడ కూల్చేసి, చదును చేసేశారు. ఆ స్థలంలో భవన నిర్మాణానికి మరోమారు దరఖాస్తు చేయడంతో మాజీ కార్పొరేటర్‌ భర్త జీవీఎంసీ అధికారులకు ఫిర్యాదు చేశారు.

జీవీఎంసీ జోన్‌-3 పరిధి 27వ వార్డులో సంగం-శరత్‌ థియేటర్‌, కోణార్క్‌ లాడ్జి వెనుక 818 గజాల స్థలం ఉంది. 1950లో వైజాగ్‌పటం కో-ఆపరేటివ్‌ హౌస్‌ బిల్డింగ్‌ సొసైటీ పేరుతో వేసిన లేఅవుట్‌లో ఆ స్థలాన్ని ఓపెన్‌స్పేస్‌ కింద జీవీఎంసీ (అప్పటి ముసిసిపాలిటీ)కి అప్పగించారు. దీనిని జీవీఎంసీ ప్రజా ప్రయోజనాల కోసం మాత్రమే వినియోగించాల్సి ఉంటుంది. జీవీఎంసీ ఎలాంటి నిర్మాణాలు చేపట్టకపోవడంతో ఇప్పటికీ ఆ స్థలం ఖాళీగానే ఉండిపోయింది. ఇదిలావుంటే ఆ స్థలాన్ని సొసైటీ నుంచి కొనుగోలు చేశానంటూ ఒకరు అందులో భవన నిర్మాణం కోసం కొన్నాళ్ల కిందట జీవీఎంసీకి దరఖాస్తు చేశారు. దీనిపై మాజీ కార్పొరేటర్‌ భర్త కళ్లేపల్లి వెంకట సీతారామరాజు అది ఓపెన్‌స్పేస్‌ అని అందులో ప్లాన్‌ ఇవ్వకూడదంటూ జీవీఎంసీకి ఫిర్యాదు చేశారు. దీంతో అధికారులు ప్లాన్‌ దరఖాస్తును తిరస్కరించారు. దాంతో సదరు వ్యక్తి హైకోర్టులో కేసు వేయగా...జీవీఎంసీ అధికారులు కూడా అది ఓపెన్‌స్పేస్‌ స్థలమని పేర్కొంటూ మరో పిటిషన్‌ దాఖలు చేశారు. దీంతో రెండు కేసులు హైకోర్టులో ప్రస్తుతం పెండింగ్‌లో ఉన్నాయి. ఇదిలావుండగా రెండు నెలల కిందట అదే వ్యక్తి ఆ స్థలంలో భవన నిర్మాణం కోసం మరోమారు జీవీఎంసీకి దరఖాస్తు చేశారు. అక్కడితో ఆగకుండా ఆ స్థలానికి ఉన్న ప్రహరీ గోడను కూల్చేసి, చెత్తచెదారాలను తొలగించేసి, చదును చేశారు. స్థలాన్ని తన ఆధీనంలోకి తీసుకున్నారు. కేసు కోర్టులో ఉండగా స్థలంలోకి ప్రవేశించడం, అక్కడ ప్రహరీని ధ్వంసం చేయడం, కంటెయినర్‌ను ఏర్పాటుచేయడాన్ని దీనిపై జీవీఎంసీ అధికారులు అడ్డుకోవాల్సిందిపోయి...తమకేమీ పట్టనట్టు వ్యవహరించడం అనుమానాలకు తావిస్తోంది. ఈ నేపథ్యంలో ఓపెన్‌ స్పేస్‌లో భవన నిర్మాణం కోసం ప్రైవేటు వ్యక్తి మరోసారి ప్లాన్‌కు దరఖాస్తు చేశారని, దీనిపై చర్యలు తీసుకోవాలంటూ మాజీ కార్పొరేటర్‌ భర్త సీతారామరాజు ఇటీవల మరోసారి జీవీఎంసీ అధికారులకు ఫిర్యాదు చేశారు.

రూ.16 కోట్లు విలువైన స్థలం అన్యాక్రాంతం

జీవీఎంసీ అధికారుల తీరుతో రూ.16 కోట్లు విలువైన స్థలం అన్యాక్రాంతమైపోతుందని ఫిర్యాదుదారుడు జీవీఎంసీ అధికారుల వద్ద ఆవేదన వ్యక్తంచేశారు. నగరంలో డైమండ్‌ పార్కు ఏరియా అంటేనే పూర్తిగా వాణిజ్య ప్రాంతంగా గుర్తింపు ఉంది. అన్నిరకాల దుకాణాలు, షాపింగ్‌కాంప్లెక్స్‌లు, ఎలక్ర్టికల్‌ షోరూమ్‌లు ఉండడంతో అక్కడ భూమికి చాలా డిమాండ్‌ ఉంది. గజం ధర రూ.రెండు లక్షల వరకూ పలుకుంది. అలాంటిచోట 818 గజాలు స్థలాన్ని పరిరక్షించడంలో జీవీఎంసీ అధికారులు ఎందుచేతనో ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ విషయం టౌన్‌ప్లానింగ్‌ విభాగంలోని ఒక అధికారి వద్ద ప్రస్తావించగా, ఆ స్థలం లేఅవుట్‌లోని ఓపెన్‌స్పేస్‌గానే తమ రికార్డులో ఉందని, కానీ ప్రైవేటు వ్యక్తి మాత్రం తాను సొసైటీ నుంచి కొనుగోలుచేశామని, దానికి సంబంధించిన పత్రాలన్నీ ఉన్నాయంటూ వాదిస్తున్నారన్నారు. జీవీఎంసీకి కూడా ఆ స్థలం ఓపెన్‌స్పేస్‌గానే పేర్కొంటూ కోర్టులో కేసు వేసిందన్నారు. దీనిపై హైకోర్టులో రెండు కేసులు పెండింగ్‌లో ఉండడంతో అక్కడ నుంచి స్పష్టత వస్తేనేగానీ ప్లాన్‌ జారీ చేయలేమంటూ దరఖాస్తును తిరస్కరించామన్నారు.

Updated Date - Dec 18 , 2024 | 01:05 AM