జీవీఎంసీ కమిషనర్‌గా సంపత్‌కుమార్
ABN , Publish Date - Jul 21 , 2024 | 12:51 AM
జీవీఎంసీ కమిషనర్‌గా పి.సంపత్‌కుమార్‌ను నియమిస్తూ ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీచేసింది.
విశాఖపట్నం, జూలై 20 (ఆంధ్రజ్యోతి):
జీవీఎంసీ కమిషనర్‌గా పి.సంపత్‌కుమార్‌ను నియమిస్తూ ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీచేసింది. జీవీఎంసీ కమిషనర్‌గా పనిచేసిన సాయికాంత్‌వర్మకు ఇటీవల టిడ్కో ఎండీగా బదిలీ చేసిన విషయం తెలిసిందే. ఆ పోస్టులో ఇప్పటివరకూ ఎవరినీ నియమించలేదు. ఇన్‌చార్జి కమిషనర్‌గా జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీంధిర ప్రసాద్‌కు బాధ్యతలు అప్పగించారు. అయితే శనివారం రాష్ట్రవ్యాపంగా 61 మంది ఐఏఎస్‌లను బదిలీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం ఎన్.టి.ఆర్.జిల్లా జాయింట్ కలెక్టర్‌గా పనిచేస్తున్న పి.సంపత్‌కుమార్‌ను జీవీఎంసీ కమిషనర్‌గా నియమించింది. 2016 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన సంపత్‌కుమార్ గతంలో స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ ఎండీగా, మాజీ హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప ఓఎస్‌డీగా పనిచేశారు.
వీఎంఆర్‌డీఏ కమిషనర్‌గా విశ్వనాథన్
విశాఖపట్నం, జూలై 20 (ఆంధ్రజ్యోతి):
జీవీఎంసీ అడిషనల్ కమిషనర్‌గా పనిచేస్తున్న కె.విశ్వనాథన్‌ను వీఎంఆర్‌డీఏ మెట్రోపాలిటన్ కమిషనర్‌గా నియమిస్తూ శనివారం రాత్రి ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. జిల్లా జాయింట్ కలెక్టర్‌గా పనిచేసిన విశ్వనాథన్‌ను గత వైసీపీ ప్రభుత్వం జీవీఎంసీ అడిషనల్ కమిషనర్‌గా నియమించింది. ఇదిలావుండగా వీఎంఆర్‌డీఏ కమిషనర్ పోస్టు గత రెండేళ్లుగా ఖాళీగా ఉంది. అప్పటి కలెక్టర్ ఎ.మల్లికార్జునకు అదనపు బాధ్యతలు అప్పగించారు. ఆయన వెళ్లిపోయిన తరువాత జాయింట్ కమిషనర్‌గా ఉన్న రవీంద్రకు పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు. ఇప్పుడు విశ్వనాథన్‌ను పూర్తిస్థాయిలో కమిషనర్‌గా నియమించారు.
జీసీసీ ఎండీగా కల్పనాకుమారి
విశాఖపట్నం, జూలై 20 (ఆంధ్రజ్యోతి):
విశాఖ కేంద్రంగా ఉన్న గిరిజన సహకార సంస్థ (జీసీసీ) మేనేజింగ్ డైరెక్టర్‌గా కల్పనాకుమారిని ప్రభుత్వం నియమించింది. ప్రస్తుతం ఉన్న ఎండీ సురే్‌షకుమార్‌ను బదిలీ చేస్తూ శనివారం ఉత్తర్వులు జారీచేసింది. 2019 బ్యాచ్‌కు చెందిన కల్పనాకుమారి 2021లో విశాఖపట్నం జిల్లా జాయింట్ కలెక్టర్-2 (హౌసింగ్)గా పనిచేశారు. జిల్లాల విభజన తరువాత అనకాపల్లి జిల్లా జాయింట్ కలెక్టర్‌గా నియమితులయ్యారు. అనంతరం పార్వతీపురం మన్యం జిల్లా సీతంపేట ఐటీడీఏ ప్రాజెక్టు అధికారిణిగా వెళ్లిన ఆమెను కొద్దికాలం క్రితం ప్రభుత్వం బదిలీ చేసింది. ప్రస్తుతం పోస్టింగ్ కోసం ఎదురుచూస్తున్న కల్పనకుమారిని జీసీసీ ఎండీగా నియమించింది. ఆమె భర్త మయూర్ అశోక్ విశాఖ జిల్లా జాయింట్ కలెక్టర్‌గా పనిచేస్తున్నారు.