Share News

అనారోగ్యంతో గురుకుల విద్యార్థి మృతి

ABN , Publish Date - Feb 26 , 2024 | 12:38 AM

కొయ్యూరు, ఫిబ్రవరి 25: అనారోగ్యానికి గురైన కొయ్యూరు గురుకుల పాఠశాల విద్యార్థి కేజీహెచ్‌లో చికిత్స పొందుతూ ఆదివారం తెల్లవారుజామున మృతి చెందాడు. దీనికి సంబంధించి పాఠశాల ప్రిన్సిపాల్‌ మోహన్‌ తెలిపిన వివరాలు ఇలా వున్నాయి. అనకాపల్లి జిల్లా గొలుగొండ మండలం పాతమల్లంపేట శివారు చంద్రయ్యపాలేనికి చెందిన గోరా ప్రవీణ్‌కుమార్‌(16) కొయ్యూరు గురుకుల పాఠశాలలో పదో తరగతి చదువుతున్నాడు.

అనారోగ్యంతో గురుకుల విద్యార్థి మృతి
ప్రవీణ్‌కుమార్‌ (ఫైల్‌ ఫొటో)

కొయ్యూరు, ఫిబ్రవరి 25: అనారోగ్యానికి గురైన కొయ్యూరు గురుకుల పాఠశాల విద్యార్థి కేజీహెచ్‌లో చికిత్స పొందుతూ ఆదివారం తెల్లవారుజామున మృతి చెందాడు. దీనికి సంబంధించి పాఠశాల ప్రిన్సిపాల్‌ మోహన్‌ తెలిపిన వివరాలు ఇలా వున్నాయి. అనకాపల్లి జిల్లా గొలుగొండ మండలం పాతమల్లంపేట శివారు చంద్రయ్యపాలేనికి చెందిన గోరా ప్రవీణ్‌కుమార్‌(16) కొయ్యూరు గురుకుల పాఠశాలలో పదో తరగతి చదువుతున్నాడు. అతని తల్లిదండ్రులు రాజబాబు, దేవి.. ప్రవీణ్‌కుమార్‌ చిన్నతనంలోనే మనస్పర్ధలతో విడిపోయారు. అప్పటికి అవివాహితురాలిగా ఉన్న పిన్ని స్వప్నకుమారి.. ప్రవీణ్‌ను పెంచి పెద్ద చేసి విద్యాబుద్ధులు నేర్పిస్తున్నది. ప్రవీణ్‌పై ఉన్న అభిమానంతో పెళ్లి కూడా చేసుకోలేదు. కాగా గత నెల 16వ తేదీన ప్రవీణ్‌కుమార్‌ జ్వరం బారిన పడడంతో పాఠశాల సిబ్బంది రాజేంద్రపాలెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించి వైద్య సేవలు అందించారు. సాయంత్రానికి జ్వరం తగ్గడంతో తిరిగి పాఠశాలకు తీసుకువచ్చారు. మళ్లీ 17వ తేదీ ఉదయం తీవ్రంగా జ్వరం రావడంతో మరోమారు పీహెచ్‌సీకి తరలించారు. వైద్య సేవలు అందించినా జ్వరం అదుపులోకి రాకపోవడంతో వైద్యాధికారిణి మనోజ్ఞ సూచనతో నర్సీపట్నం ఏరియా ఆస్పత్రికి రిఫర్‌ చేశారు. అక్కడ వైద్యులు పరీక్షించి అప్పటికే పేట్‌లెట్ల కౌంట్‌ తగ్గిపోవడాన్ని గుర్తించి విశాఖపట్నం కేజీహెచ్‌కి రిఫర్‌ చేశారు. దీంతో ప్రిన్సిపాల్‌ ఈ విషయాన్ని ఐటీడీఏ పీవో అభిషేక్‌కు తెలిపి పాఠశాల ఉపాధ్యాయుడు, హెల్త్‌ అసిస్టెంట్‌ను ఆ విద్యార్థితో పాటు కేజీహెచ్‌కి తరలించారు. అప్పటి నుంచి అక్కడ వైద్య సేవలు పొందుతూ ఆ విద్యార్థి ఆదివారం తెల్లవారుజామున మృతి చెందినట్టు ప్రిన్సిపాల్‌ మోహన్‌ తెలిపారు. ఈ విషయం తెలిసి ఆ విద్యార్థి పిన్ని కన్నీరు మున్నీరుగా విలపించింది.

Updated Date - Feb 26 , 2024 | 12:38 AM