Share News

గ్రేటర్‌లో కలకలం

ABN , Publish Date - Feb 29 , 2024 | 01:41 AM

గ్రేటర్‌ విశాఖపట్నం మునిసిపల్‌ కార్పొరేషన్‌ (జీవీఎంసీ) ప్రధాన కార్యాలయం వద్ద బుధవారం రాత్రి వార్డు సచివాలయ ఉద్యోగి ఒకరు చేతిమణికట్టును బ్లేడ్‌తో కోసుకుని ఆత్మహత్యాయత్నం చేయడం కలకలం రేపింది. కమిషనర్‌ సీఎం సాయికాంత్‌వర్మ తన పట్ల నిరంకుశంగా వ్యవహరిస్తూ పది నెలలుగా సస్పెన్షన్‌లో ఉంచి ఉద్యోగం నుంచి తొలగించాలని యత్నిస్తున్నందునే ఆత్మహత్య చేసుకోవాలనుకున్నట్టు సదరు ఉద్యోగి కావటి శివ ఆదిమూర్తి ఆరోపించారు. ఈ ఘటనకు సంబంధించి ఆయన కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి.

గ్రేటర్‌లో కలకలం
జీవీఎంసీ ప్రధాన కార్యాలయం వద్ద ఆత్మహత్యాయత్నం చేసిన శివఆదిమూర్తి

జీవీఎంసీ ప్రధాన కార్యాలయం ఎదుట

వార్డు సచివాలయ ఉద్యోగి ఆత్మహత్యాయత్నం

దళితుడినైన తన పట్ల కమిషనర్‌ నిరంకుశంగా వ్యవహరిస్తున్నార ని ఆరోపణ

ఎడమచేతి మణికట్టు వద్ద బ్లేడ్‌తో కోసుకోవడంతో తీవ్ర రక్తస్రావం

అంబులెన్స్‌లో కేజీహెచ్‌కు తరలింపు

విశాఖపట్నం, ఫిబ్రవరి 28 (ఆంధ్రజ్యోతి):

గ్రేటర్‌ విశాఖపట్నం మునిసిపల్‌ కార్పొరేషన్‌ (జీవీఎంసీ) ప్రధాన కార్యాలయం వద్ద బుధవారం రాత్రి వార్డు సచివాలయ ఉద్యోగి ఒకరు చేతిమణికట్టును బ్లేడ్‌తో కోసుకుని ఆత్మహత్యాయత్నం చేయడం కలకలం రేపింది. కమిషనర్‌ సీఎం సాయికాంత్‌వర్మ తన పట్ల నిరంకుశంగా వ్యవహరిస్తూ పది నెలలుగా సస్పెన్షన్‌లో ఉంచి ఉద్యోగం నుంచి తొలగించాలని యత్నిస్తున్నందునే ఆత్మహత్య చేసుకోవాలనుకున్నట్టు సదరు ఉద్యోగి కావటి శివ ఆదిమూర్తి ఆరోపించారు. ఈ ఘటనకు సంబంధించి ఆయన కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి. జీవీఎంసీ 45వ వార్డు పరిధిలోని 253 సచివాలయంలో శివ ఆదిమూర్తి వార్డు శానిటేషన్‌, ఎన్విరాన్‌మెంట్‌ సెక్రటరీగా పనిచేసేవారు. వార్డు శానిటేషన్‌ సెక్రటరీగా ఉద్యోగంలో చేరిన తమతో మురుగునీటి కాలువల్లో పూడికలు తీయిస్తున్నారంటూ ఆందోళన చేయడంతో మూడేళ్ల కిందట ఆయన్ను సస్పెండ్‌ చేశారు. తర్వాత సస్పెన్షన్‌ ఎత్తేయడంతో తిరిగి ఉద్యోగంలోకి చేరారు. యూజర్‌ చార్జీలు వసూలు కోసం శానిటేషన్‌ సెక్రటరీలపై ఒత్తిడి పెంచుతున్నారని, దీన్ని తాము తట్టుకోలేకపోతున్నామంటూ శానిటేషన్‌ సెక్రటరీలంతా పది నెలల కిందట జీవీఎంసీ కమిషనర్‌ కార్యాలయాన్ని చుట్టుముట్టారు. ఆ సమయంలో శివ ఆదిమూర్తిని కమిషనర్‌ సీఎంసాయికాంత్‌వర్మ సస్పెండ్‌ చేశారు. తర్వాత సస్పెన్షన్‌ ఎత్తివేయాలని కమిషనర్‌తోపాటు సీడీఎంఏ, వార్డు సచివాలయం శాఖ డైరెక్టర్‌ను కలిసినప్పటికీ ఫలితం లేకపోగా, ఆయన్ను ఉద్యోగం నుంచి శాశ్వతంగా తొలగించేందుకు అధికారులు చర్యలు ప్రారంభించారు. దీనిపై కమిషనర్‌ను కలిసేందుకు పలుమార్లు యత్నించినా సాధ్యంకాలేదు. ఈ నేపథ్యంలో బుధవారం సాయంత్రం కమిషనర్‌ను కలిసి తనకు న్యాయం చేయాలని కోరాలని, లేనిపక్షంలో అక్కడే ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. రాత్రి ఏడున్నర గంటల సమయంలో రెండు బ్లేడ్‌లు జేబులో పెట్టుకుని జీవీఎంసీ కమిషనర్‌ను కలిసేందుకు వెళ్లారు. అప్పటికే కమిషనర్‌తోపాటు ఇతర అధికారులు కూడా వెళ్లిపోవడంతో పోర్టికో వద్దకు వెళ్లి నేలపై పడుకుని తాను వెంట తీసుకువెళ్లిన బ్లేడ్‌తో ఎడమచేతి మణికట్టు కోసుకున్నారు. విషయం దూరం నుంచి గమనించిన సెక్యూరిటీ సిబ్బంది పరుగున వచ్చి ‘ఏం చేస్తున్నావంటూ’ శివ ఆదిమూర్తిని ప్రశ్నించగా తన ఆవేదన వెళ్లగక్కుతూ దళితుడినైన తన పట్ల కమిషనర్‌ సాయికాంత్‌వర్మ నిరంకుశంగా వ్యహరిస్తుండడం వల్లే తాను ఆత్మహత్య చేసుకుంటున్నానని గట్టిగా అరవడం ప్రారంభించారు. ఆయన్ను సెక్యూరిటీ సిబ్బంది అవుట్‌గేట్‌ వద్దకు తీసుకువెళ్లగా అక్కడ రోడ్డుపై పడుకుండిపోయారు. దీంతో కొంతమంది వచ్చి శివ ఆదిమూర్తికి వీడియో తీస్తూ ఆత్మహత్యకు కారణాలు ఏమిటని అడగడం ప్రారంభించారు. కొందరు 108కి ఫోన్‌ చేయడంతో అంబులెన్స్‌ వచ్చి కేజీహెచ్‌కు తీసుకువెళ్లింది. అక్కడ వైద్యులు చికిత్స చేసి డిశ్చార్జి చేశారు.

Updated Date - Feb 29 , 2024 | 01:41 AM