Share News

మహా మేతగాళ్లు

ABN , Publish Date - Nov 28 , 2024 | 01:34 AM

మహా విశాఖ నగర పాలక సంస్థ (జీవీఎంసీ)లోని పలు విభాగాల్లో అవినీతి పెచ్చుమీరుతోంది. అక్రమార్జనే పరమావధిగా కొంతమంది అధికారులు తమ కిందిస్థాయి సిబ్బంది సహకారంతో అందినకాడికి దోచుకుంటున్నారు. టౌన్‌ప్లానింగ్‌, రెవెన్యూ, ఇంజనీరింగ్‌ విభాగాల్లో అవినీతి మరింత ఎక్కువగా ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారనే అభియోగంపై జోన్‌-2 కమిషనర్‌ సింహాచలాన్ని ఏసీబీ అధికారులు అరెస్టు చేయగా, అక్రమ నిర్మాణానికి సహకరించారనే ఉద్దేశంతో సుజాతానగర్‌ వార్డు ప్లానింగ్‌ సెక్రటరీని కమిషనర్‌ సస్పెండ్‌ చేశారు. ఈ రెండు ఉదంతాలతో జీవీఎంసీలో అవినీతిపై మరోసారి చర్చ మొదలైంది.

మహా మేతగాళ్లు

జీవీఎంసీలో విశృంఖలంగా అవినీతి

టౌన్‌ప్లానింగ్‌, రెవెన్యూ, ఇంజనీరింగ్‌ విభాగాల్లో మరీ అధికం

కొందరు అధికారులు, కిందిస్థాయి సిబ్బందిపై తరచూ ఆరోపణలు

ఆదాయానికి మించిన ఆస్తులు కూడగట్టి

ఏసీబీకి చిక్కిన జోన్‌-2 కమిషనర్‌ సింహాచలం

అక్రమ నిర్మాణానికి కొమ్ముకాసి సస్పెన్షన్‌కు గురైన టౌన్‌ ప్లానింగ్‌ సెక్రటరీ

కమిషనర్‌ గట్టిగా దృష్టిసారిస్తే మరింతమంది అక్రమార్కులు గుట్టురట్టు

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

మహా విశాఖ నగర పాలక సంస్థ (జీవీఎంసీ)లోని పలు విభాగాల్లో అవినీతి పెచ్చుమీరుతోంది. అక్రమార్జనే పరమావధిగా కొంతమంది అధికారులు తమ కిందిస్థాయి సిబ్బంది సహకారంతో అందినకాడికి దోచుకుంటున్నారు. టౌన్‌ప్లానింగ్‌, రెవెన్యూ, ఇంజనీరింగ్‌ విభాగాల్లో అవినీతి మరింత ఎక్కువగా ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారనే అభియోగంపై జోన్‌-2 కమిషనర్‌ సింహాచలాన్ని ఏసీబీ అధికారులు అరెస్టు చేయగా, అక్రమ నిర్మాణానికి సహకరించారనే ఉద్దేశంతో సుజాతానగర్‌ వార్డు ప్లానింగ్‌ సెక్రటరీని కమిషనర్‌ సస్పెండ్‌ చేశారు. ఈ రెండు ఉదంతాలతో జీవీఎంసీలో అవినీతిపై మరోసారి చర్చ మొదలైంది.

జీవీఎంసీలో మిగిలిన విభాగాలతో పోల్చితే టౌన్‌ప్లానింగ్‌, ఇంజనీరింగ్‌, రెవెన్యూ విభాగాల్లో పనిచేసే వారికి కాసులవర్షం కురుస్తుందనే అభిప్రాయం ఉంది. టౌన్‌ప్లానింగ్‌ అధికారులు/సిబ్బంది విషయానికి వస్తే...భవన నిర్మాణం జరిగితే చాలు ఏదో ఒక లోపాన్ని పట్టుకుని నిర్మాణదారులను బెదిరించి డబ్బులు గుంజేస్తారనే విమర్శలు ఉన్నాయి. జీవీఎంసీ పరిధిలో ఎవరైనా ఇల్లు లేదా అపార్టుమెంట్‌ నిర్మాణం చేపట్టాలంటే ముందుగా ఆ స్థలానికి సంబంధించిన అన్ని డాక్యుమెంట్లు సక్రమంగా ఉండడంతోపాటు ఆ స్థలానికి పన్ను బకాయిలు ఉండకుండా చూసుకోవాలి. అలా ఉన్నప్పుడే జీవీఎంసీ గుర్తింపు కలిగిన లైసెన్స్‌డ్‌ టెక్నికల్‌ పర్సన్‌ (ఎల్‌టీపీ) ద్వారా సంబంధిత సచివాలయానికి ఆన్‌లైన్‌లో ప్లాన్‌ దరఖాస్తును పంపించాలి. అక్కడ వార్డు ప్లానింగ్‌ అండ్‌ రెగ్యులేటరింగ్‌ సెక్రటరీ దరఖాస్తుకు సంబంధించిన పత్రాలన్నీ సరిగా ఉన్నాయో లేదో అనేది జీవీఎంసీ రెవెన్యూ విభాగం ఇచ్చిన ప్రత్యేక వెబ్‌సైట్‌లో పరిశీలించాలి. రిమార్కులు రాసి సంబంధిత వార్డు బిల్డింగ్‌ ఇన్‌స్పెక్టర్‌కు, అక్కడి నుంచి టీపీఓకి పంపిస్తారు. నిర్మించాలనుకునే భవన విస్తీర్ణం బట్టి ఆ దరఖాస్తును ఏసీపీ, డీసీపీ, సిటీప్లానర్‌, చీఫ్‌ సిటీప్లానర్‌, కమిషనర్‌ స్థాయికి వెళుతుంది. అయితే ప్లాన్‌ దరఖాస్తు వార్డు ప్లానింగ్‌ సెక్రటరీకి లాగిన్‌కు వెళ్లగానే వసూళ్ల వేట మొదలైపోతుంది. కొంతమంది నిజాయితీగానే పనిచేస్తున్నా...మరికొందరు మాత్రం బిల్డర్లు, ఎల్‌టీపీలతో ముందుగానే అవగాహన ఏర్పరచుచుకుని తమ జేబులు నింపుకుంటున్నారు. ఇంకొందరైతే కార్పొరేటర్లతో మిలాఖత్‌ అయిపోయి వారు చెప్పినట్టు నిర్ణయాలు తీసుకుంటున్నారు. కార్పొరేటర్‌ వద్దంటే ఆ ప్లాన్‌ దరఖాస్తును పెండింగ్‌లో పెట్టడమో, ఏదో కారణం చూపించి తిరస్కరించడమో చేస్తున్నారు. కార్పొరేటర్‌ నుంచి గ్రీన్‌సిగ్నల్‌ వస్తే మాత్రం తమ వాటా తీసుకుని పైస్థాయి అధికారికి దరఖాస్తును పంపుతున్నారు. వార్డు సచివాలయ వ్యవస్థ వచ్చిన తర్వాత బిల్డింగ్‌ ప్లాన్‌ల జారీలో అవినీతి పెరిగిపోవడంతోపాటు అక్రమ నిర్మాణాలు కూడా పెరిగిపోయాయని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వ్యక్తిగత నివాసానికి ప్లాన్‌ తీసుకుని ఇరుకురోడ్లలో అపార్టుమెంట్‌లు నిర్మిస్తుండడం, షాపింగ్‌ కాంప్లెక్స్‌లు నిర్మించేయడం, ప్రభుత్వ భూమికి తప్పుడు పత్రాలు సృష్టించి అడ్డదారిలో ప్లాన్‌ పొందడం వంటివి కళ్లముందే జరుగుతున్నా వార్డు ప్లానింగ్‌ సెక్రటరీల అటు వైపు కన్నెత్తి చూడరు. ఫిర్యాదులు అందినా చర్యలు లేకుండా కాపాడుతున్నారు. తాజాగా జోన్‌-8 పరిధిలోని సుజాతనగర్‌లో జీ+2 నిర్మాణానికి ప్లాన్‌ తీసుకుని అదనంగా మరో మూడు అంతస్థులు నిర్మించేసినా చర్యలు తీసుకోకపోగా, అందుకు పరోక్షంగా సహకరించారనే అభియోగంపై ప్లానింగ్‌ సెక్రటరీని కమిషనర్‌ సంపత్‌కుమార్‌ సస్పెండ్‌ చేశారు. ప్రతి వార్డులో కమిషనర్‌ తనిఖీలు చేస్తే మరెంతోమంది ప్లానింగ్‌ సెక్రటరీలు, టౌన్‌ప్లానింగ్‌లోని దిగువస్థాయి ఉద్యోగులు సస్పెన్షన్‌కు గురికావడం ఖాయమని టౌన్‌ప్లానింగ్‌ అధికారులే అభిప్రాయపడుతుండడం విశేషం.

ఇంజనీరింగ్‌ విభాగంలో కూడా కొంతమంది అధికారులు ఏళ్ల తరబడి తిష్ఠ వేసుకుని అవినీతికి పాల్పడుతున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జీవీఎంసీ పరిధిలో ఏటా రూ.వెయ్యి కోట్లకుపైగా విలువైన అభివృద్ధి పనులు (సీసీ రోడ్లు, తారురోడ్లు నిర్మాణం, డ్రెయిన్లు రిపేరు, ఫుట్‌పాత్‌ల మరమ్మతులు, రంగులు వేయడం, నీటి సరఫరా పైప్‌లైన్‌ల ఏర్పాటు, మరమ్మతులు, నిర్వహణ వంటి పనులు) జరుగుతూనే ఉంటాయి. ఆయా పనులకు అంచనాలు తయారు చేయడంతో మొదలయ్యే అవినీతి టెండర్లు పిలవడం, పనులు పూర్తిచేసిన తర్వాత రికార్డింగ్‌, బిల్లులు చెల్లింపు వరకూ కొనసాగుతోంది. ఒక పనికి వాస్తవంగా రూ.లక్ష ఖర్చు అయితే ఇంజనీరింగ్‌ అధికారులు మాత్రం రెట్టింపు మొత్తానికి ప్రతిపాదనలు తయారుచేస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. ఆయా పనులను అస్మదీయులైన కాంట్రాక్టర్లకు దక్కేలా చేస్తుంటారు. ఒకవేళ వేరేవారు ఎవరైనా పనులు దక్కించుకుంటే ముప్పుతిప్పలు పెట్టి నష్టం వచ్చేలా చేస్తారు. నీటి సరఫరా విభాగంలో పనిచేస్తున్న కంప్యూటర్‌ ఆపరేటర్లు, అవుట్‌సోర్సింగ్‌ వర్క్‌ ఇన్‌స్పెక్టర్లు భారీగా అవినీతికి పాల్పడడం ద్వారా రూ.కోట్లు సంపాదించారని ఇంజనీరింగ్‌ విభాగంలో ప్రచారం జరుగుతోంది. వర్క్‌ ఇన్‌స్పెక్టర్లు, కంప్యూటర్‌ ఆపరేటర్ల పరిస్థితే అలా ఉంటే ఏఈలు, డీఈలు, ఈఈలుగా పనిచేస్తున్నవారి పరిస్థితి ఎలా ఉంటుందనేది ఉహించుకోవాల్సిందే మరి.

జీవీఎంసీలో మరో కీలక విభాగంగా చెప్పుకునే రెవెన్యూలో కూడా భారీగానే అవినీతి జరుగుతోందనే ఆరోపణలు ఉన్నాయి. ప్రభుత్వ భూములను ఆక్రమించుకున్న వారికి రెవెన్యూ ఇన్‌స్పెక్టర్లు, వార్డు సచివాలయాల్లో అడ్మిన్‌లు అడ్డదారిలో అసెస్‌మెంట్‌లు జారీచేసి జేబులు నింపుకుంటున్నారనే అభిప్రాయం సర్వతా వ్యక్తమవుతోంది. గతంలో జోన్‌-8 పరిధిలో ఒక రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌ డిజిటల్‌ కీని ఉపయోగించి అక్కడ పనిచేసే వార్డు సచివాలయ అడ్మిన్‌ (డిజిటల్‌ అసిస్టెంట్‌) అడ్డగోలుగా 400 వరకూ తప్పుడు అసెస్‌మెంట్‌లు జారీ చేసేశారు. ఈ విషయం వెలుగులోకి రావడంతో సంబంధిత ఆర్‌ఐతోపాటు వార్డు సచివాలయ అడ్మిన్‌ను అప్పటి కమిషనర్‌ సృజన సస్పెండ్‌ చేశారు. అదే సమయంలో జోన్‌-5 పరిధిలో కూడా పెద్దఎత్తున అక్రమ అసెస్‌మెంట్‌లను జారీచేసినట్టు వెలుగులోకి వచ్చింది. ఆ సమయంలో అక్కడ జోనల్‌ కమిషనర్‌గా తాజాగా ఏసీబీకి పట్టుబడిన జోన్‌-2 కమిషనర్‌గా పొందూరు సింహాచలం పనిచేస్తున్నారు. అపార్టుమెంట్‌లు, వాణిజ్య భవనాలు నిర్మించే సమయంలో మూడేళ్లకు సంబంధించిన ఖాళీ స్థలం పన్ను చెల్లించాల్సి ఉంటుంది. అలా చెల్లించకపోతే ప్లాన్‌ జారీకాదు. అలాంటప్పుడు నిర్మాణదారులు, బిల్డర్లు రెవెన్యూ విభాగంలోని సిబ్బందిని ప్రసన్నం చేసుకుని అక్కడ చాలాకాలంగా షెడ్డు ఉన్నట్టు చూపించి ఒక డోర్‌ నంబర్‌ కేటాయించి ఆస్తి పన్ను విధించేస్తున్నారు. దీనివల్ల రూ.లక్షల్లో కట్టాల్సిన వీఎల్‌టీ భారం కేవలం రూ.వందల్లోకి తగ్గిపోతోంది. అలాంటి సందర్భంలో రెవెన్యూ సిబ్బంది భారీగా గుంజుతున్నారు. ఇలాంటి వాటిపై జీవీఎంసీ కమిషనర్‌ పి.సంపత్‌కుమార్‌ లోతుగా దృష్టిసారిస్తే అక్రమార్కులకు అడ్డుకట్టపడుతుంది.

Updated Date - Nov 28 , 2024 | 01:34 AM