Share News

నరేంద్రపురంలో గ్రావెల్‌ దోపిడీ

ABN , Publish Date - Mar 26 , 2024 | 12:51 AM

మండలంలోని మల్లవరం పంచాయతీ నరేంద్రపురం వద్ద ఆదివారం రాత్రి వైసీపీ నాయకుల అండతో జోరుగా గ్రావెల్‌ తవ్వకాలు జరిగాయి. ఎక్స్‌కవేటర్‌, ట్రాక్టర్ల శబ్దాలు విని స్థానిక యువకులు రావడంతో గ్రావెల్‌ తవ్వకాలు ఆపేసి అక్కడి నుంచి జారుకున్నారు.

నరేంద్రపురంలో గ్రావెల్‌ దోపిడీ
నరేంద్రపురం వద్ద గ్రావెల్‌ తవ్విన ప్రదేశం

అర్ధరాత్రి ఎక్స్‌కవేటర్‌తో తవ్వకాలు, ట్రాక్టర్లతో తరలింపు

దర్జాగా అమ్ముకుంటున్న వైసీపీ నాయకులు

అచ్యుతాపురం, మార్చి 25: మండలంలోని మల్లవరం పంచాయతీ నరేంద్రపురం వద్ద ఆదివారం రాత్రి వైసీపీ నాయకుల అండతో జోరుగా గ్రావెల్‌ తవ్వకాలు జరిగాయి. ఎక్స్‌కవేటర్‌, ట్రాక్టర్ల శబ్దాలు విని స్థానిక యువకులు రావడంతో గ్రావెల్‌ తవ్వకాలు ఆపేసి అక్కడి నుంచి జారుకున్నారు. అప్పటికే సుమారు 50 ట్రాక్టర్ల గ్రావెల్‌ను తరలించారు. వివరాల్లోకి వెళితే.. నరేంద్రపురం కొండ ప్రాంతంలో ఉండడంతో ఇక్కడ గ్రావెల్‌ పుష్కలంగా వుంది. స్థానిక వైసీపీ నాయకులు కొంతమంది అడపాదడపా గ్రావెల్‌ తవ్వి, రవాణా చేస్తున్నారు. ఇదే తరహాలో ఆదివారం అర్ధరాత్రి దాటిన తరువాత ఎక్సకవేటర్‌తో గ్రావెల్‌ తవ్వకాలు చేపట్టారు. గ్రావెల్‌ తరలించడానికి నాలుగు ట్రాక్టర్లను ఏర్పాటు చేసుకున్నారు. తెల్లవారుజామున శబ్దాలు విని నరేంద్రపురం యువకులు కొండప్రాంతానికి వెళ్లారు. వీరిని చూసి గ్రావెల్‌ తవ్వకం ఆపివేసి వాహనాలను అక్కడి నుంచి తీసుకుపోయారు. అప్పటికే సుమారు 50 ట్రాక్టర్ల గ్రావెల్‌ను తరలించుకుపోయారు. దీనిని మల్లవరం సాయిబాబా ఆలయం ముందు నిర్మిస్తున్న షాపింగ్‌ పునాదుల్లో వేశారు. ట్రాక్టర్‌ గ్రావెల్‌ వెయ్యి రూపాయల చొప్పున అమ్ముకుంటున్నారని స్థానికంగా చెప్పుకుంటున్నారు. ఇందులో రూ.600 ట్రాక్టర్‌ యజమానికి, రూ.200 ఎక్సకవేటర్‌ కిరాయికి, మిగిలిన రూ.200 వైసీపీ నాయకుల జేబుల్లోకి వెళుతున్నట్టు తెలిసింది. గ్రావెల్‌ అక్రమ తవ్వకాలకు పాల్పడుతున్నది వైసీపీ నాయకులు కావడంతో పంచాయతీ కార్యదర్శులు, వీఆర్వోలు భయంతో చర్యలు తీసుకోవడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

Updated Date - Mar 26 , 2024 | 12:52 AM