Share News

గ్రావెల్‌ దోపిడీకి అడ్డేది?

ABN , Publish Date - Mar 24 , 2024 | 12:44 AM

జీవీఎంసీ 88వ వార్డు పరిధిలో గ్రావెల్‌ దోపిడీ యథేచ్ఛగా సాగుతోంది. అధికార పార్టీ నేతల అండదండలతో అక్రమార్కులు రెచ్చిపోతున్నారు. జగనన్న కాలనీ లేఅవుట్‌లోనే దర్జాగా తవ్వకాలు సాగిస్తున్నారు. పట్టపగలే తవ్వకాలు జరిపి తరలిస్తున్నా రెవెన్యూ, గనులశాఖ అధికారులు పట్టించుకోకపోవడం అనుమానాలకు తావిస్తోంది.

గ్రావెల్‌ దోపిడీకి అడ్డేది?
గంగవరంలో జగనన్న లేఅవుట్‌ వద్ద తవ్వకాలు జరపడంతో ఏర్పడిన గొయ్యి

- గంగవరంలో యథేచ్ఛగా తవ్వకాలు

- పట్టపగలే దర్జాగా తరలింపు

- అధికార పార్టీ నేతల అండదండలతో రెచ్చిపోతున్న అక్రమార్కులు

- వలంటీర్‌ ప్రమేయం ఉందని ఆరోపణలు

- ధ్వంసమవుతున్న జగనన్న లేఅవుట్‌

- పట్టించుకోని రెవెన్యూ, గనులశాఖ అధికారులు

సబ్బవరం, మార్చి 23: జీవీఎంసీ 88వ వార్డు పరిధిలో గ్రావెల్‌ దోపిడీ యథేచ్ఛగా సాగుతోంది. అధికార పార్టీ నేతల అండదండలతో అక్రమార్కులు రెచ్చిపోతున్నారు. జగనన్న కాలనీ లేఅవుట్‌లోనే దర్జాగా తవ్వకాలు సాగిస్తున్నారు. పట్టపగలే తవ్వకాలు జరిపి తరలిస్తున్నా రెవెన్యూ, గనులశాఖ అధికారులు పట్టించుకోకపోవడం అనుమానాలకు తావిస్తోంది.

జీవీఎంసీ 88వ వార్డు గంగవరంలోని కొండవాలు ప్రాంతంలో పేదలందరికీ ఇళ్లు పథకంలో భాగంగా గతంలో జగనన్న లేఅవుట్‌ వేశారు. అయితే ఈ లేఅవుట్‌లో గ్రావెల్‌ను కొందరు అక్రమార్కులు యథేచ్ఛగా తవ్వుకుపోతున్నారు. ఆఖరికి మట్టిని కూడా వదలడం లేదు. అధికార పార్టీ నేతల అండదండలు ఉండడంతో పగలు కూడా తవ్వకాలు జరుపుతున్నారు. కొందరు డిమాండ్‌ను బట్టి గ్రావెల్‌ తవ్వి నేరుగా తరలించుకుపోయి సొమ్ము చేసుకుంటుండగా, మరికొందరు వెదుళ్లునరవ, కొత్తూరు, దువ్వాడ సమీపంలో సంధ్యానగర్‌ తదితర ప్రాంతాల్లో నిల్వ చేస్తున్నారు. కొన్ని నెలలుగా ఈ వ్యవహారం జరుగుతున్నా రెవెన్యూ, మైనింగ్‌, విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఫిర్యాదులు చేసిన వారి సమాచారాన్ని అక్రమార్కులకు అధికారులు ఇస్తున్నారని వాపోతున్నారు. తవ్వకాలను అడ్డుకునే ప్రయత్నం చేస్తే దాడులు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గంగవరానికి చెందిన అధికార పార్టీ నేతలు, అక్కడి వలంటీర్‌కు ఇందులో ప్రమేయం ఉందనే ప్రచారం జరుగుతోంది. గత తహసీల్దార్‌ వీరిపై ఫిర్యాదు చేసినా అప్పటి సీఐ కనీసం కేసు కూడా నమోదు చేయలేదని తెలిసింది. జగనన్న లేఅవుట్‌లో బేస్‌మెంట్‌ ఫిల్లింగ్‌కు అనుమతి పొందిన అక్రమార్కులు.. లేఅవుట్‌ సూపర్‌వైజర్లు, సిబ్బందితో కుమ్మక్కై గ్రావెల్‌ దోపిడీకి పాల్పడుతున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. సంధ్యానగర్‌ కాలనీ ఆర్చి వద్ద చెక్‌పోస్టు ఏర్పాటు చేసి అక్రమార్కుల ఆగడాలను అరికట్టాలని కోరుతున్నారు.

Updated Date - Mar 24 , 2024 | 12:44 AM