Share News

గంగవరంలో గ్రావెల్‌ దోపిడీ

ABN , Publish Date - Jan 17 , 2024 | 11:41 PM

జీవీఎంసీ 88వ వార్డు గంగవరంలో గ్రావెల్‌ అక్రమ తవ్వకాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. ఇక్కడి జగనన్న కాలనీ లేఅవుట్‌ను ఆనుకుని ఉన్న కొండవాలు ప్రాంతంలో గ్రావెల్‌ను గత పదిహేను రోజులుగా రేయింబవళ్లు తవ్వుకుపోతున్నారు. దీని వెనుక వైసీపీ నాయకులు ఉండడంతో మైన్స్‌, విజిలెన్స్‌, రెవెన్యూ శాఖలు పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

గంగవరంలో గ్రావెల్‌ దోపిడీ
పట్టపగలు గ్రావెల్‌ తవ్వేస్తున్న దృశ్యం

అక్రమార్కుల బరి తెగింపు

రేయింబవళ్లు దర్జాగా తవ్వి తరలింపు

జగనన్న కాలనీ లేఅవుట్‌లో మట్టినీ వదలని వైనం

వైసీపీ నేతల ప్రమేయం ఉండడంతో అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపణలు

గతంలో తహసీల్దార్‌ ఫిర్యాదు చేసినా కేసు నమోదు చేయని పోలీసులు

సబ్బవరం, జనవరి 17: జీవీఎంసీ 88వ వార్డు గంగవరంలో గ్రావెల్‌ అక్రమ తవ్వకాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. ఇక్కడి జగనన్న కాలనీ లేఅవుట్‌ను ఆనుకుని ఉన్న కొండవాలు ప్రాంతంలో గ్రావెల్‌ను గత పదిహేను రోజులుగా రేయింబవళ్లు తవ్వుకుపోతున్నారు. దీని వెనుక వైసీపీ నాయకులు ఉండడంతో మైన్స్‌, విజిలెన్స్‌, రెవెన్యూ శాఖలు పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

గంగవరంలో గత రెండేళ్లుగా వీఎంఆర్‌డీఏ ఆధ్వర్యంలో జగనన్న కాలనీ లేఅవుట్‌, రైతుల పరిహారం ప్లాట్ల(ఆర్‌సీ ప్లాట్లు) అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. దీనికి కాంట్రాక్టర్లు కొంత మంది సూపర్‌వైజర్లను నియమించారు. స్థానికులు కొంత మంది లారీలు, ఎక్స్‌కవేటర్లను లేఅవుట్‌ అభివృద్ధి పనులకు లీజుకు ఇచ్చారు. ఆ వాహనాలన్నీ లేఅవుట్‌లోనే ఉంటున్నాయి. కొందరు వైసీపీ నాయకులు ఇక్కడి గ్రావెల్‌ తరలించుకుపోయేందుకు ప్రణాళిక వేశారు. సూపర్‌వైజర్లను మచ్చిక చేసుకుని పట్టపగలే కొండవాలు ప్రాంతంలోని గ్రావెల్‌, లేఅవుట్‌లోని మట్టిని దర్జాగా తరలించుకుపోతున్నారు. స్థానికులు ప్రశ్నిస్తే లేఅవుట్‌ అభివృద్ధికి తరలిస్తున్నామని చెబుతున్నారు. రాత్రి వేళల్లో అయితే ఇక అడ్డూ అదుపు లేకుండా తవ్వి తరలించేస్తున్నారు. ఇప్పటి వరకు ఒక్కరిపై కూడా మైనింగ్‌, విజిలెన్స్‌, రెవెన్యూ అధికారులు కేసు పెట్టలేదంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. కాగా గ్రావెల్‌ అక్రమ తవ్వకాలపై సంబంధిత శాఖల అధికారులకు సమాచారం ఇస్తే తమపైనే చిందులు తొక్కుతున్నారని గంగవరం గ్రామస్థులు వాపోతున్నారు.

ప్లాట్ల యజమానుల పాట్లు

గోపాలపట్నం, గాజువాక, విశాఖపట్నం సిటీ, పోతినమల్లయ్యపాలెం తదితర ప్రాంతాలకు చెందిన పేదవారిని గుర్తించి ప్రభుత్వం గంగవరంలో ఇళ్ల స్థలాలు మంజూరు చేసి పట్టాలు కూడా ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే లేఅవుట్‌ ధ్వంసం చేసి గ్రావెల్‌, మట్టిని అక్రమార్కులు తరలించుకుపోవడంతో వారి ప్లాట్‌ నంబర్‌ ఎక్కడ ఉందో తెలియక లబ్ధిదారులు పాట్లు పడుతున్నారు. ఎవరికి చెప్పుకోవాలని తెలియక ఆందోళన చెందుతున్నారు.

తహసీల్దార్‌ ఫిర్యాదు చేసినా...

గంగవరంలో గ్రావెల్‌ అక్రమ తవ్వకాలు జరుగుతున్నట్టు తెలుసుకుని గత ఏడాది ఆగస్టులో తహసీల్దార్‌ బి.సత్యనారాయణ విచారణ జరిపారు. వలంటీర్‌తో పాటు మరో ఎనిమిది మంది వైసీపీ నాయకులు ఈ తవ్వకాల వెనుక ఉన్నట్టు గుర్తించి అప్పట్లో పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే వారిలో ఒక్కరిపై కూడా పోలీసులు కేసు పెట్టకపోవడం గమనార్హం. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి గ్రావెల్‌ అక్రమ తవ్వకాలను ఆపాలని, అక్రమార్కులపై కఠిన చర్యలు తీసుకోవాలని గంగవరం గ్రామస్థులు కోరతున్నారు.

Updated Date - Jan 17 , 2024 | 11:41 PM