Share News

గ్రావెల్‌ దందా.. రాజకీయ అండ

ABN , Publish Date - Oct 21 , 2024 | 12:52 AM

మహా విశాఖ నగరపాలక సంస్థ (జీవీఎంసీ) పరిధిలోని సబ్బవరం మండలం గంగవరంలో గ్రావెల్‌ అక్రమ తవ్వకాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. జీవీఎంసీ పరిధిలోని లబ్ధిదారులకు పక్కా ఇళ్ల నిర్మాణం కోసం అభివృద్ధి చేసిన లేఅవుట్లను గ్రావెల్‌ తవ్వకాలతో గుల్ల చేస్తున్నారు. గ్రావెల్‌ అక్రమ తవ్వకందారుల్లో పలువురు గత ఎన్నికల ముందు జనసేన పార్టీలో చేరారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలో వుండడంతో తమ దందాను యథావిధిగా కొనసాగిస్తున్నారు. వీరికి కొంతమంది అధికారులు, సిబ్బంది అండదండలు వున్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

గ్రావెల్‌ దందా.. రాజకీయ అండ
గంగవరం రెవెన్యూ పరిధిలో గ్రావెల్‌ తవ్వకాలు జరుగుతున్న ఇళ్ల స్థలాల లేఅవుట్‌

గంగవరంలో ఆగని అక్రమ తవ్వకాలు

జీవీఎంసీ పేదల ఇళ్ల స్థలాల లేఅవుట్లు ధ్వంసం

10-15 అడుగుల లోతు గోతులు

వెదుళ్లరవ, కొత్తూరు ప్రాంతాల్లో స్టాక్‌ పాయింట్లు

గాజువాక, అగనంపూడి, పరవాడ పారిశ్రామిక ప్రాంతాలకు తరలింపు

గతంలో వైసీపీలో ఉన్న అక్రమార్కులు

ఎన్నికల ముందు పలువురు జనసేనలో చేరిక

కూటమి అధికారంలోకి రావడంతో తవ్వకాలు కొనసాగింపు

చోద్యం చూస్తున్న వీఎంఆర్‌డీఏ, రెవెన్యూ, మైనింగ్‌ అధికారులు

సబ్బవరం, అక్టోబరు 20 (ఆంధ్రజ్యోతి) :

మహా విశాఖ నగరపాలక సంస్థ (జీవీఎంసీ) పరిధిలోని సబ్బవరం మండలం గంగవరంలో గ్రావెల్‌ అక్రమ తవ్వకాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. జీవీఎంసీ పరిధిలోని లబ్ధిదారులకు పక్కా ఇళ్ల నిర్మాణం కోసం అభివృద్ధి చేసిన లేఅవుట్లను గ్రావెల్‌ తవ్వకాలతో గుల్ల చేస్తున్నారు. గ్రావెల్‌ అక్రమ తవ్వకందారుల్లో పలువురు గత ఎన్నికల ముందు జనసేన పార్టీలో చేరారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలో వుండడంతో తమ దందాను యథావిధిగా కొనసాగిస్తున్నారు. వీరికి కొంతమంది అధికారులు, సిబ్బంది అండదండలు వున్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

మహా విశాఖ నగరపాలక సంస్థ పరిధిలో సొంత ఇళ్లు లేని వారి కోసం గత ప్రభుత్వ హయాంలో సబ్బవరం మండలం గంగవరం, నంగినారపాడు, గొల్లలపాలెం ప్రాంతాల్లో వీఎంఆర్‌డీఏ అధికారులు లేఅవుట్లు వేసి, పట్టాలు పంపిణీ చేశారు. తరువాత లబ్ధిదారులకు పక్కా ఇళ్లు మంజూరు చేసి, నిర్మాణ పనులను కాంట్రాక్టర్లకు అప్పగించారు. అయితే లేఅవుట్లలో పలుచోట్ల ఇళ్ల నిర్మాణాలు చేపట్టలేదు. ఇక్కడ నాణ్యమైన గ్రావెల్‌ వుండడంతో స్థానికంగా వుండే కొంతమంది వ్యక్తులు రాజకీయ అండదండలతో రెండేళ్ల క్రితమే గ్రావెల్‌ తవ్వకాలు మొదలుపెట్టారు. వీఎంఆర్‌డీఏ అధికారుల పర్యవేక్షణ లేకపోవడం, స్థానికంగా వుండే రెవెన్యూ అధికారులు తమకు సంబంధం లేదన్నట్టుగా వ్యవహరించడం, మైనింగ్‌ అధికారులు ఇటువైపు కన్నెత్తి అయినా చూడకపోవడం అక్రమార్కులకు బాగా కలిసొచ్చింది. లేఅవుట్లలో పలుచోట్ల 10 నుంచి 15 అడుగుల లోతున గ్రావెల్‌ తవ్వుతున్నారు. 15 నుంచి 20 మంది వరకు అచ్చంగా గ్రావెల్‌ అక్రమ తవ్వకాలు, రవాణా, అమ్మకాలతో భారీగా సొమ్ము గడిస్తున్నారు. వీరిలో పలువురికి సొంతంగా ఎక్స్‌కవేటర్లు, టిప్పర్‌ లారీలు, డంపర్‌ లారీలు వున్నాయి. రాత్రిపూట ఇక్కడ తవ్విన గ్రావెల్‌ను సబ్బవరం మండలానికి అనుకుని వున్న వెదుళ్లరవ, కొత్తూరు, సంధ్యానగర్‌ కాలనీ, అజనగిరి తదితర ప్రాంతాల్లో ప్రైవేటు స్థలాల్ల నిల్వ చేస్తున్నారు. ఇటువంటి స్టాక్‌ పాయింట్లు 20 వరకు వున్నాయి. ఇక్కడి నుంచి పగటిపూట గాజువాక, పరవాడ, అగనంపూడి, తదితర ప్రాంతాలకు తరలించి భారీగా ఆర్జిస్తున్నారు.

ఫిర్యాదులు చేసినా..

పేదల ఇళ్ల స్థలాల లేఅవుట్లలో గ్రావెల్‌ అక్రమ తవ్వకాలపై మైనింగ్‌, రెవెన్యూ అధికారులకు ఫిర్యాదులు చేస్తున్నప్పటికీ పట్టించుకోవడంలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. పైగా ఫిర్యాదు చేసిన వారి వివరాలను.. గ్రావెల్‌ తవ్వకందారులకు తెలియపరిచి, ఫిర్యాదుదారులపై పరోక్షంగా దాడులకు ఉసిగొల్పుతున్నారు. ఇక గ్రావెల్‌ తవ్వకాలపై పత్రికల్లో వార్తలు వస్తే.. సంబంధిత అధికారులు మొక్కుబడిగా తనిఖీలు నిర్వహించి ఎక్స్‌కవేటర్లు, లారీలకు నామమాత్రంగా జరిమానాలు విధించి వదిలేస్తున్నారు. ఇళ్ల స్థలాల లేఅవుట్లలో భారీగా గ్రావెల్‌ తవ్వకాలు జరుగుతుంటే వీఎంఆర్‌డీఏ అధికారులు ఏం చేస్తున్నారని స్థానికుతోపాటు లబ్ధిదారులు ప్రశ్నిస్తున్నారు. ఇళ్ల నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేసి, వచ్చేఏడాది మార్చినాటికి లబ్ధిదారులకు అప్పగించాలని విశాఖ జిల్లా కలెక్టర్‌ హరేంధిర్‌ ప్రసాద్‌ ఇటీవల గొల్లలపాలెంలో పర్యటించిన సందర్భంగా అధికారులను ఆదేశించారు. మరి ఇళ్ల స్థలాల లేఅవుట్లలో గ్రావెల్‌ అక్రమార్కులు తవ్విన భారీ గోతులు (చిన్నపాటి చెరువులు) ఎలా పూడుస్తారని స్థానికులు ప్రశ్నిస్తున్నారు.

Updated Date - Oct 21 , 2024 | 12:52 AM