Share News

హైవే భూముల్లో గ్రావెల్‌ దందా

ABN , Publish Date - Mar 01 , 2024 | 12:42 AM

ప్రభుత్వ భూములు ఖాళీగా వుంటే చాలు మట్టి, గ్రావెల్‌ గ్యాంగ్‌ బరి తెగిస్తున్నది. తమ సొంత భూములుగా భావిస్తూ యంత్రాలతో తవ్వకాలు జరుపుతున్నారు. ట్రాక్టర్లు, టిప్పర్‌ లారీల్లోకి లోడింగ్‌ చేసి చుట్టుపక్కల ప్రాంతాలకు రవాణా చేస్తున్నారు. ట్రాక్టర్‌ లోడ్‌ రూ. 1,000, లారీ అయితే రూ.3 వేలు, డంపర్‌ లారీ రూ.6 వేలకు అమ్ముకొని సొమ్ము చేసుకుంటున్నారు.

హైవే భూముల్లో గ్రావెల్‌ దందా
అమృతపురం వద్ద ఎన్‌హెచ్‌ఏఐ భూముల్లో చేపట్టిన మట్టి, గ్రావెల్‌ తవ్వకాలు

సాగరమాల రోడ్డు నిర్మాణానికి సేకరించిన భూముల్లో అక్రమ తవ్వకాలు

ఎన్‌హెచ్‌ఏఐ పరిధి కావడంతో పట్టించుకోని స్థానిక అధికారులు

వంగలి ఎంఐటీ భూముల్లో సైతం గ్రావెల్‌ తవ్వకాలు

సబ్బవరం, ఫిబ్రవరి 29:

ప్రభుత్వ భూములు ఖాళీగా వుంటే చాలు మట్టి, గ్రావెల్‌ గ్యాంగ్‌ బరి తెగిస్తున్నది. తమ సొంత భూములుగా భావిస్తూ యంత్రాలతో తవ్వకాలు జరుపుతున్నారు. ట్రాక్టర్లు, టిప్పర్‌ లారీల్లోకి లోడింగ్‌ చేసి చుట్టుపక్కల ప్రాంతాలకు రవాణా చేస్తున్నారు. ట్రాక్టర్‌ లోడ్‌ రూ. 1,000, లారీ అయితే రూ.3 వేలు, డంపర్‌ లారీ రూ.6 వేలకు అమ్ముకొని సొమ్ము చేసుకుంటున్నారు.

కేంద్ర ప్రభుత్వం సాగర మాల పథకం కింద సబ్బవరం మండలం అమృతపురం రెవెన్యూ పరిధి సూరెడ్డిపాలెం నుంచి చింతగట్లఅగ్రహారం, పెందుర్తి మండలం చింతగట్ల, జెర్రిపోతులపాలెం నరవ తదితర గ్రామాల మీదుగా షీలానగర్‌ వరకు ఆరు వరుసల జాతీయ రహదారి నిర్మించాలని పదేళ్ల క్రితం ప్రణాళికను తయారు చేసింది. ఇందుకోసం రైతు నుంచి జిరాయితీ భూములతోపాటు ప్రభుత్వ భూములను కూడా అధికారులు సేకరించారు. అయితే సాంకేతిక కారణాల వల్ల రోడ్డు నిర్మాణ పనులు ఆరంభంలోనే ఆగిపోయాయి. అప్పటి నుంచి భూములు ఖాళీగా వున్నాయి. ఈ నేపథ్యంలో జాతీయ రహదారి నిర్మాణానికి సేకరించిన భూములపై అక్రమార్కుల కళ్లు పడ్డాయి. యంత్రాలతో ఇష్టానుసారంగా మట్టి, గ్రావెల్‌ తవ్వేస్తున్నారు. దీంతో పెద్ద పెద్ద గోతులు ఏర్పడుతున్నాయి. ఈ భూములు ఎన్‌హెచ్‌ఏఐ ఆధీనంలో వుండడంతో స్థానికంగా వుండే రెవెన్యూ, పోలీసు, మైనింగ్‌ అధికారులు తమకు సంబంధం లేదని పట్టించుకోవడంలేదు. దీంతో అక్రమార్కులకు అడ్డూఅదుపూ లేకుండా పోయింది. అమృతపురం, చింతగట్లఅగ్రహారం, చింతగట్ల, జెర్రిపోతులపాలెం, నరవ తదితర గ్రామాల వద్ద జాతీయ రహదారి భూముల్లో గ్రావెల్‌, మట్టి అక్రమ తవ్వకాలు యథేచ్ఛగా సాగుతున్నాయి.

ఎంఐటీ భూముల్లోనూ తవ్వకాలు

మండలంలోని వంగలి గ్రామంలో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఎంఐటీ (మద్రాసు ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ) సంస్థ ఏర్పాటుకు ఐఐపీఈ (ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ పెట్రోలియం అండ్‌ ఎనర్జీ) విశ్వవిద్యాలయానికి అనుకొని 200 ఎకరాలు కేటాయించారు. ప్రస్తుతం ఈ భూములన్నీ ఖాళీగా ఉన్నాయి. ఇక్కడ కూడా కొన్ని రోజులుగా గ్రావెల్‌ తవ్వేస్తున్నారు. చుట్టుపక్కల ప్రాంతాల్లో రియల్‌ ఎస్టేట్‌ వెంచర్లకు, ఇళ్లనిర్మాణంలో పునాదులు ఎత్తు చేయడానికి, ఖాళీ స్థలాల్లో నింపడానికి గ్రావెల్‌ తరలిస్తున్నారు. ట్రాక్టర్‌ లోడు రూ.1,000 నుంచి రూ.1,200, లారీ లోడు రూ.3 వేల నుంచి రూ.3,500కు, డంపర్‌ లారీ అయితే రూ.5-6 వేలకు విక్రయిస్తున్నారు. పగలు, రాత్రి అన్న తేడా లేకుండా గ్రావెల్‌ తవ్వకాలు, రవాణా జరుగుతున్నప్పటికీ రెవెన్యూ, మైనింగ్‌, విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌, పోలీస్‌ శాఖల అధికారులు పట్టించుకున్న దాఖలాలు లేవు.

Updated Date - Mar 01 , 2024 | 12:42 AM