గోవాడ చెరకు రైతులకు ఊరట
ABN , Publish Date - Jun 28 , 2024 | 11:41 PM
గోవాడ షుగర్ ఫ్యాక్టరీకి గత సీజన్‌లో చెరకు సరఫరా చేసిన రైతులకు ఈనెల 29వ తేదీన మరో రూ.15.32 కోట్లు బ్యాంకు ఖాతాలకు జమ చేయనున్నట్టు గోవాడ షుగర్స్ ఎండీ వి.సన్యాసినాయుడు శుక్రవారం విలేకరులకు తెలిపారు.
చోడవరం, జూన్ 20: గోవాడ షుగర్ ఫ్యాక్టరీకి గత సీజన్‌లో చెరకు సరఫరా చేసిన రైతులకు ఈనెల 29వ తేదీన మరో రూ.15.32 కోట్లు బ్యాంకు ఖాతాలకు జమ చేయనున్నట్టు గోవాడ షుగర్స్ ఎండీ వి.సన్యాసినాయుడు శుక్రవారం విలేకరులకు తెలిపారు. గోవాడలో ఈ ఏడాది క్రషింగ్‌లో లక్షా 70 వేల 601 టన్నుల చెరకు క్రషింగ్ నిర్వహించిన సంగతి తెలిసిందే. ఫ్యాక్టరీకి చెరకు సరఫరా చేసిన రైతులకు ఇప్పటి వరకు మూడు విడతలుగా పేమెంట్లు చేశామని ఎండీ తెలిపారు. తొలివిడతలో గత ఏడాది డిసెంబరు 29 నుంచి ఈ ఏడాది జనవరి 14 వరకూ సరఫరా చేసిన 34వేల 894టన్నులకుగాను టన్నుకు రూ.2,500 చొప్పున రూ.8.72 కోట్లు, రెండో విడత కింద జనవరి 15 నుంచి జనవరి నెలాఖరు వరకూ సరఫరా చేసిన 34 వేల 747టన్నులకు మరో రూ.8.69 కోట్లు జమ చేశామన్నారు. కాగా, మూడో విడతగా ఫిబ్రవరి 1 నుంచి ఫిబ్రవరి 15 వరకూ సరఫరా చేసిన 39 వేల 691 టన్నులకు గాను రూ.9.92 కోట్లు చెల్లింపు చేపట్టామన్నారు. ఇక చివరి విడతలో ఫిబ్రవరి 16 నుంచి ఫ్యాక్టరీ క్రషింగ్ చివరి తేదీ మార్చి 12 వరకూ చెరకు సరఫరా చేసిన 6,346 మంది రైతులకు రూ.15. 32 కోట్లు పేమెంట్లు చెల్లించడానికి చర్యలు చేపట్టామని పేర్కొన్నారు. కాగా, ఈ ఏడాది చివరిలో ప్రారంభమయ్యే క్రషింగ్ సీజన్‌కు రైతులంతా చెరకు సాగు చేపట్టి ఫ్యాక్టరీ అభివృద్ధికి సహకరించాలని ఫ్యాక్టరీ ఎండీ సన్యాసినాయుడు విజ్ఞప్తి చేశారు.