Share News

ఫైర్‌ సేవలపై సర్కారు నిర్లక్ష్యం

ABN , Publish Date - May 26 , 2024 | 12:49 AM

తొమ్మిది మండలాలకు సేవలు అందించే నర్సీపట్నం అగ్నిమాపక కేంద్రం అవస్థల మధ్య కునారిల్లుతోంది. అరకొర సిబ్బంది, అందని ఆధునిక పరికరాలు, మౌలిక వసతుల లేమితో అవస్థలు పడుతోంది. 1981లో నర్సీపట్నంలో అగ్నిమాపక కేంద్రం ఏర్పాటు చేసి ఒక అగ్నిమాపక వాహనం, 16 మంది సిబ్బందిని మంజూరు చేశారు. పదేళ్ల క్రితం పాత భవనం స్థానంలో కొత్తది నిర్మించారు. నిధుల లేమితో ప్రహరీ నిర్మించలేదు. కాగా 45 ఏళ్లలో ఈ కేంద్రం ఎటువంటి అభివృద్ధి పనులకు నోచుకోలేదు. సత్వరమే అగ్ని ప్రమాదాలు నివారించడానికి ఉపయోగపడే హైడ్రాలిక్‌ ఆధునిక పరికరాలు కూడా ఇక్కడ అందుబాటులో లేవు.

ఫైర్‌ సేవలపై సర్కారు నిర్లక్ష్యం
నర్సీపట్నం అగ్నిమాపక కేంద్రం

- సమస్యలతో నర్సీపట్నం అగ్నిమాపక కేంద్రం సతమతం

- అల్లూరి, అనకాపల్లి జిల్లాల్లోని తొమ్మిది మండలాలకు ఇక్కడ నుంచే సేవలు

- వేధిస్తున్న సిబ్బంది కొరత

- ఆధునిక పరికరాలు లేక అవస్థలు

- హీట్‌ ప్రూఫ్‌ జాకెట్లు, మాస్కులు, గాగుల్స్‌ మంజూరు చేయని ప్రభుత్వం

నర్సీపట్నం, మే 25: తొమ్మిది మండలాలకు సేవలు అందించే నర్సీపట్నం అగ్నిమాపక కేంద్రం అవస్థల మధ్య కునారిల్లుతోంది. అరకొర సిబ్బంది, అందని ఆధునిక పరికరాలు, మౌలిక వసతుల లేమితో అవస్థలు పడుతోంది. 1981లో నర్సీపట్నంలో అగ్నిమాపక కేంద్రం ఏర్పాటు చేసి ఒక అగ్నిమాపక వాహనం, 16 మంది సిబ్బందిని మంజూరు చేశారు. పదేళ్ల క్రితం పాత భవనం స్థానంలో కొత్తది నిర్మించారు. నిధుల లేమితో ప్రహరీ నిర్మించలేదు. కాగా 45 ఏళ్లలో ఈ కేంద్రం ఎటువంటి అభివృద్ధి పనులకు నోచుకోలేదు. సత్వరమే అగ్ని ప్రమాదాలు నివారించడానికి ఉపయోగపడే హైడ్రాలిక్‌ ఆధునిక పరికరాలు కూడా ఇక్కడ అందుబాటులో లేవు.

అల్లూరి సీతారామరాజు జిల్లా పరిధిలోని జీకేవీధి, చింతపల్లి, కొయ్యూరు మండలాలు, అనకాపల్లి జిల్లాలోని నర్సీపట్నం, మాకవరపాలెం, గొలుగొండ, నాతవరం, కోటవురట్ల, రోలుగుంట మండలాల్లో ఎక్కడ అగ్ని ప్రమాదం జరిగినా నర్సీపట్నం నుంచి అగ్నిమాపక వాహనం వెళ్లి సేవలందించాల్సి ఉంటుది. చింతపల్లిలో అగ్నిమాపక కేంద్రం ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనలకు ప్రభుత్వం అనుమతి లభించలేదు. దీంతో ఏజెన్సీ మండలాల్లోనూ ఈ కేంద్రం నుంచే సేవలందించాల్సిన పరిస్థితి. ఉన్న ఒక్క వాహనం ఏజెన్సీలోకి వెళ్లిన సమయంలోనే మైదాన ప్రాంతంలో ప్రమాదం జరిగితే అంతే సంగతి. జిల్లాలు పునర్విభజన చేసినప్పటికీ అల్లూరి జిల్లాలోని కొయ్యూరు, జీకేవీధి, చింతపల్లి మండలాలకు నర్సీపట్నం అగ్నిమాపక కేంద్రం నుంచే సేవలు అందించాల్సి వస్తోంది.

ఏటా ప్రమాదాలు

ఏటా ఫిబ్రవరి నుంచి జూలై వరకు ఎక్కువగా అగ్ని ప్రమాదాలు సంభవిస్తుంటాయి. ప్రమాదవశాత్తూ బావుల్లో పడి పోయిన వారిని, వరదలు సంభవించిన సమయంలో బాధితుల రక్షణ, నేల బావులు, కాలువల్లో పడిపోయిన పశువులను రక్షించడం వంటి సమయాల్లోనూ ఇక్కడి సిబ్బందే సేవలందించాలి. 2022-23 సంవత్సరంలో ఈ అగ్నిమాపక కేంద్రం పరిధిలో 97 ప్రమాదాలు జరిగి రూ.3 కోట్లకుపైగా ఆస్తి నష్టం సంభవించింది. ఇద్దరు వ్యక్తులు మరణించారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. అగ్నిమాపక సిబ్బంది రూ.ఐదు కోట్ల వరకు ఆస్తినష్టాన్ని నివారించారు. కాగా 2022-23లో 97, ఈ ఏడాది 47 ప్రమాదాలు సంభవించాయి. నర్సీపట్నం కేంద్రాన్ని డబుల్‌ యూనిట్‌ స్థాయికి పెంచితే రెండో అగ్నిమాపక వాహనం, అదనపు సిబ్బంది అందుబాటులోకి వస్తారు. ఈ ప్రతిపాదన ఎన్నో ఏళ్లుగా కాగితాలకే పరిమితమవుతోంది.

అందుబాటులో లేని ఆధునిక పరికరాలు

అగ్నిమాపక కేంద్రం పరిధిలో రాత్రి సమయంలో ప్రమాదాలు సంభవిస్తే ఆస్తి, ప్రాణ నష్టం జరగకుండా సకాలంలో రక్షించేందుకు ఆధునిక సామగ్రిని అందుబాటులో ఉంచాల్సిన అధికారులు ఆ దిశగా చర్యలు తీసుకోలేదు. ఫైర్‌ వాహనం, నీటి పైపు మినహా మరే పరికరాలు లేవు. హెడ్‌ లైట్స్‌, డ్రాగన్‌ లైట్స్‌ ఊసే లేదు. చిన్న చిన్న చార్జింగ్‌ టార్చ్‌ లైట్లు మాత్రమే ఉన్నాయి. భవనాలలో చిక్కుకున్న బాధితులను రక్షించే సమయంలో కిటికీ, గేట్లకు ఉన్న ఐరన్‌ ఊసలు కట్‌ చేయడానికి హైడ్రాలిక్‌ కట్టర్స్‌, గ్యాస్‌ కట్టర్స్‌ అవసరం. స్లాబ్‌ శిథిలాల కింద చిక్కుకున్న వారిని రక్షించడానికి హైడ్రాలిక్‌ జాకీ ఉండాలి. మంటలు ఎగసిపడేటప్పుడు భవనం లోపలికి వెళ్లి అదుపు చేయాలంటే సిబ్బందికి హీట్‌ ప్రూఫ్‌ జాకెట్లు, కళ్లకు వేడి తగలకుండా గాగుల్స్‌, దట్టమైన పొగ నుంచి రక్షణకు మాస్కులు ఉండాలి.

వేధిస్తున్న సిబ్బంది కొరత

రాష్ట్రంలో సుమారు ఐదేళ్లుగా ఫైర్‌ సిబ్బంది నియామకాలు నిలిపివేశారు. ఈ కేంద్రంలో 16 మంది సిబ్బందికి గాను, ఉద్యోగ విరమణ చేసిన వారి స్థానంలో కొత్తవారి నియామకం జరపలేదు. దీంతో హోంగార్డులతో నెట్టుకొస్తున్నారు. కేంద్రంలో ఫైర్‌ ఆఫీసరు, ముగ్గురు లీడింగ్‌ ఫైర్‌మన్‌, తొమ్మిది మంది ఫైర్‌మన్లు, ముగ్గురు డ్రైవర్‌ ఆపరేటర్లు ఉండాలి. ఆరుగురు ఫైర్‌మన్‌లు, ఇద్దరు డ్రైవర్‌ ఆపరేటర్లు ఉద్యోగ విరమణ చేసిన తర్వాత ఆ పోస్టులు భర్తీ చేయలేదు. స్టేషన్‌ ఫైర్‌ ఆఫీసరు ఒకరు, లీడింగ్‌ ఫైర్‌మన్‌లు ఇద్దరు, ఫైర్‌మన్‌లు ముగ్గురు, నలుగురు హోంగార్డులు, ఇద్దరు డ్రైవర్లు ఉన్నారు.

Updated Date - May 26 , 2024 | 12:49 AM