Share News

ప్రభుత్వ భూమి కబ్జా

ABN , Publish Date - Mar 06 , 2024 | 12:42 AM

మండల కేంద్రంలో ప్రభుత్వ భూములు కబ్జాకు గురవుతున్నాయి. పేదలు సెంటు భూమిని ఆక్రమించుకుని ఇల్లు కట్టుకుంటే ఆగమేఘాలపై పరుగులు తీసి, యంత్రాలతో నేల మట్టం చేసే రెవెన్యూ అధికారులు.. ప్రభుత్వ భూములను బడాబాబులు ఆక్రమించి పక్కా భవనాలు నిర్మిస్తున్నా పట్టించుకోవడంలేదు.

ప్రభుత్వ భూమి కబ్జా
కబ్జాకు గురైన బీసీ సంక్షేమ భవన స్థలం

మండల కేంద్రంలో 30 సెంట్లు ఆక్రమణ

టీడీపీ హయాంలో బీసీ భవనం నిర్మాణానికి కేటాయింపు

ఐదేళ్ల క్రితం నిధులు మంజూరు, శంకుస్థాపన

ప్రభుత్వం మారడంతో గాలికొదిలేసిన వైసీపీ పాలకులు

రూ.1.5 కోట్ల విలువైన స్థలం కబ్జా అవుతున్నా పట్టించుకోని రెవెన్యూ అధికారులు

సబ్బవరం, మార్చి 5 : మండల కేంద్రంలో ప్రభుత్వ భూములు కబ్జాకు గురవుతున్నాయి. పేదలు సెంటు భూమిని ఆక్రమించుకుని ఇల్లు కట్టుకుంటే ఆగమేఘాలపై పరుగులు తీసి, యంత్రాలతో నేల మట్టం చేసే రెవెన్యూ అధికారులు.. ప్రభుత్వ భూములను బడాబాబులు ఆక్రమించి పక్కా భవనాలు నిర్మిస్తున్నా పట్టించుకోవడంలేదు. తాజాగా బీసీ సంక్షేమ భవనం నిర్మాణానికి టీడీపీ హయాంలో కేటాయించిన భూమి సుమారు 30 సెంట్లు కబ్జాకు గురైంది.

సబ్బవరం సర్వే నంబరు 255లో డిగ్రీ కళాశాల, సబ్‌రిస్ట్రార్‌ కార్యాలయం, చెత్తనుంచి సంపద తయారీ కేంద్రానికి కేటాయించిన స్థలాలకు ఆనుకొని గత ప్రభుత్వం బీసీ భవనం నిర్మాణానికి 50 సెంట్లు స్థలం కేటాయించింది. భవన నిర్మాణానికి సుమారు రూ.25 లక్షలు బీసీ సంక్షేమ శాఖ నుంచి కేటాయించింది. 2019 ఫిబ్రవరి 14న అప్పటి ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి శంకుస్థాపన చేశారు. అనంతరం ఎన్నికల కోడ్‌ అమల్లోకి రావడంతో భవన నిర్మాణ పనులు ఆగిపోయాయి. అనంతరం అధికారంలోకి వచ్చిన వైసీపీ పాలకులు, బీసీ సంక్షేమ భవన నిర్మాణాన్ని అటకెక్కించారు. కాగా ఇక్కడ స్థలాలకు గిరాకీ పెరగడంతో బీసీ భవనానికి కేటాయించన స్థలంపై కొంతమంది స్థానిక పెద్దల కళ్లు పడ్డాయి. సుమారు 30 సెంట్లు కబ్జా చేశారు. ఈ స్థలం పక్కనే ప్రైవేటు లే-అవుట్‌, అప్పటికే కబ్జాకు గురైన సర్వే నంబరు 264లో ప్రభుత్వ భూమి ఉండడంతో కబ్జాదారులకు కలసి వచ్చింది. ఆక్రమించిన స్థలంలో భవనాలు నిర్మిస్తున్నారు. ఇక్కడ సెంటు రూ.5 లక్షలు పలుకుతున్నది. కబ్జాకు గురైన ప్రభుత్వ స్థలం విలువ రూ.1.5 కోట్లు చేస్తుంది. అధికారులు ఇప్పటికైనా స్పందించి బీసీ సంక్షేమ భవనం నిర్మాణానికి గత ప్రభుత్వం కేటాయించిన స్థలాన్ని కాపాడాలని స్థానికులు కోరుతున్నారు.

Updated Date - Mar 06 , 2024 | 12:42 AM