Share News

విశాఖ భూ దందాపై ప్రభుత్వం ఫోకస్‌!

ABN , Publish Date - Jul 15 , 2024 | 12:46 AM

విశాఖ కేంద్రంగా గత ప్రభుత్వ పాలకులు, వైసీపీ అనుచరులు సాగించిన భూ దందాలపై ప్రభుత్వం దృష్టిసారించింది.

విశాఖ భూ దందాపై ప్రభుత్వం ఫోకస్‌!

  • నేడు అమరావతిలో శ్వేతపత్రం విడుదల

  • ఉమ్మడి జిల్లాలో సాగిన వ్యవహారాలపై ఆరా

  • ఎయిర్‌పోర్టులో నిర్వహించిన సమీక్షలో వివరాలు తెలుసుకున్న సీఎం

  • అడ్డగోలు వ్యవహారాలపై ముఖ్యమంత్రికి నివేదించిన టీడీపీ నేతలు

  • విశాఖ ఫైల్స్‌ పేరుతో నివేదిక సిద్ధం చేస్తున్నామన్న ఎమ్మెల్యే గంటా

విశాఖపట్నం, జూలై 14 (ఆంధ్రజ్యోతి):

విశాఖ కేంద్రంగా గత ప్రభుత్వ పాలకులు, వైసీపీ అనుచరులు సాగించిన భూ దందాలపై ప్రభుత్వం దృష్టిసారించింది. రాష్ట్రంలో అన్ని ప్రాంతాలకు భిన్నంగా విశాఖలో వేల కోట్ల ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులు దోపిడీకి గురయ్యాయని కొత్త ప్రభుత్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలో సోమవారం అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గత ప్రభుత్వ హయాంలో జరిగిన భూ దందాలు, గనుల దోపిడీపై శ్వేతపత్రం విడుదల చేయనున్నారు. ఇందులో ప్రధానంగా విశాఖలో భూదోపిడీపై పలు అంశాలను ప్రత్యేకంగా ప్రస్తావించనున్నారని సమాచారం.

వైసీపీ అధికారంలో ఉన్న ఐదేళ్లలో ఉమ్మడి విశాఖ జిల్లాతోపాటు నగరంలోని ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులను కబ్జా చేయడం, బలవంతంగా లాక్కోవడం లాంటి అనేక దారుణ సంఘటనలు చోటుచేసుకున్నాయి. వాటన్నింటి వివరాలను ప్రభుత్వం పూర్తిస్థాయిలో సేకరించింది. నగరానికి చెందిన తెలుగుదేశం నేతలు, జిల్లా యంత్రాంగం నుంచి వేర్వేరుగా సమాచారం తీసుకున్నట్టు తెలిసింది. నగరంలో భూ కబ్జాలపై గతంలో పనిచేసిన ఒక ఐఏఎస్‌ అధికారి నుంచి కూడా వివరాలతో నివేదిక కూడా తీసుకున్నారని సమాచారం. కొత్తగా వచ్చిన జిల్లా కలెక్టర్‌ హరేంధిర్‌ ప్రసాద్‌ మరో నివేదిక ఇచ్చినట్టు తెలిసింది. ఇంకా తెలుగుదేశం నుంచి రాష్ట్ట్ర అఽద్యక్షుడు పల్లా శ్రీనివాసరావు నివేదిక అందజేశారు. భూ కబ్జాలపై విశాఖ నుంచి సమగ్ర వివరాల సేకరించడంలో రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్‌ కీలకభూమి పోషించారని సమాచారం. నాలుగు రోజుల క్రితం జిల్లా పర్యటనకు వచ్చిన సీఎం చంద్రబాబునాయుడు విశాఖలో భూ కబ్జాలపై చర్యలు తీసుకుంటామని ప్రకటించిన నేపథ్యంలో జిల్లా యంత్రాంగం నివేదిక రూపొందించినట్టు తెలిసింది.

బే పార్కుతో ప్రారంభం

విశాఖలో బేపార్కు నుంచి భూ దందాల పంచాయితీ ప్రారంభమయింది. ఇది వైసీపీ ఐదేళ్ల పాలన ముగిసేవరకు కొనసాగింది. కార్తీకవనం చేజిక్కించుకుని రాడిసిన్‌ బ్లూ హోటల్‌ నిర్మాణం, భీమిలిలో భూ యజమానులను బెదిరించి భారీఎత్తున భూములు కారుచౌకగా లాక్కోవడం, దసపల్లా భూములను 22(ఎ) నుంచి తొలగించి ఎంపీ విజయసాయిరెడ్డి కుమార్తెకు చెందిన కంపెనీతో డెవలప్‌మెంట్‌ అగ్రిమెంట్‌ చేసుకోవడం వరకు కొనసాగింది. ఈ వ్యవహారంలో అప్పటి ప్రభుత్వంలో కీలక పెద్దల పాత్ర ఉందనేది బహిరంగ రహస్యం. రుషికొండ ప్రాంతంలోని పనోరమ హిల్స్‌ పరిసరాల్లో పలువురి నుంచి బలవంతంగా ప్లాట్లు తీసుకుని భారీ కట్టడాలు నిర్మిస్తున్నారు. మధురవాడ ఐటీ హిల్స్‌ సమీపంలో ఎన్‌సీసీకి చెందిన 100 ఎకరాల భూమిని బెదిరింపులకు పాల్పడి టేకోవర్‌ చేసుకుని, గత ప్రభుత్వంలో పనిచేసిన మంత్రి తమ్ముడికి అప్పగించారు. రుషికొండ తారకరామా లేఅవుట్‌లో రేడియంట్‌ కంపెనీకి చెందిన 50 ఎకరాలను కూడా లాక్కున్నారు. నగరంలో పలుచోట్ల అడ్డగోలుగా టీడీఆర్‌లు కొట్టేశారు.

అసైన్డ్‌భూములపైనా కన్ను

ఇదిలావుండగా గ్రామీణ మండలాలైన ఆనందపురం, భీమిలి, పద్మనాభం, పెందుర్తిలో అసైన్డ్‌ భూములను చేజిక్కించుకునేందుకు జీవో 596 జీవో తీసుకువచ్చారు. గత ప్రభుత్వంలో ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన కేఎస్‌ జవహర్‌రెడ్డి బినామీలు త్రిలోక్‌తో పాటు మరికొందరు వందల ఎకరాలకు ఫ్రీహోల్డ్‌ సర్టిఫికెట్లు పొంది రిజిస్ట్రేషన్లు చేసుకున్నారు. ఇలా సుమారు 2,500 ఎకరాలకు ఒప్పందాలు చేసుకుని, అడ్వాన్స్‌లు ఇచ్చి 500 నుంచి 600 ఎకరాలను రిజిస్టర్‌ చేసుకున్నారు. భోగాపురం ఎయిర్‌పోర్టు పరిసరాల్లోని భీమిలి మండలంలో పలువురు రైతులను బెదిరించి భూములు కొట్టేశారు. ఈ వ్యవహారంపై ముఖ్యమంత్రి దృష్టి సారించడంతో విశాఖలో భూదందాలపై విశాఖ ఫైల్స్‌ పేరిట నివేదిక విడుదల చేస్తామని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ఆదివారం ప్రకటించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇప్పటికే భీమిలి నియోజకవర్గంలో పలు ఆక్రమణలు, కబ్జాలపై ఆయన కొంత సమాచారం సేకరించారు.

అనకాపల్లి జిల్లా కశింకోట మండలం విస్సన్నపేటలో సుమారు 600 ఎకరాల భూ దందాపై ఇప్పటికే జిల్లా టీడీపీ నేతలు ముఖ్యమంత్రికి నివేదించారు. మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ ఆధ్వర్యంలో కొందరు అనుచరులు విస్సన్నపేట భూములు చేజిక్కించుకున్నారన్నది ప్రధాన అభియోగం. ఈ భూముల్లో కొంతవరకు ప్రభుత్వ, అసైన్డ్‌, మిగులు భూములతోపాటు గెడ్డలు, వాగులు, రహదారులు ఉన్నాయి. దీనికితోడు విస్సన్నపేటలో భారీగా వనరుల విధ్వంసం జరిగింది. కాగా అనకాపల్లిలోని నాతవరం మండలం భమిడికలొద్దిలో లక్షల క్యూబిక్‌ మీటర్ల లేటరైట్‌ తవ్వేశారు. అటవీ భూములు స్వాధీనం చేసుకుని చెట్లు కొట్టేసి, రోడ్లు వేసి లోపలకు ఎవరినీ అనుమతించకుండా ఒక మాఫియాను నడిపించారు. భమిడికలొద్దిలో తవ్వింది బాక్సైట్‌ గనులే అయినా లేటరైట్‌ పేరుతో తవ్వుకుని సొమ్ము చేసుకున్నారు. ఇక అనకాపల్లి మండలంలో మెటల్‌ క్వారీలను లీజుదారుల నుంచి బలవంతంగా స్వాధీనం చేసుకుని వేల క్యూబిక్‌ మీటర్లు తవ్వేశారు. ఈ భూ దందాలు, గనుల దోపిడీకి సంబంధించి వివరాలను అనకాపల్లి జిల్లా పార్టీ నాయకులు ముఖ్యమంత్రికి నివేదించారు.

Updated Date - Jul 15 , 2024 | 12:46 AM