Share News

వైసీపీకి దాడి గుడ్‌బై

ABN , Publish Date - Jan 03 , 2024 | 01:33 AM

అధికార పార్టీ వైఎస్సార్‌ కాంగ్రెస్‌కు షాక్‌ల మీద షాక్‌లు తగులుతున్నాయి. ఎన్నికల ముంగిట పలువురు సీనియర్‌ నేతలు పార్టీని విడిచిపెడుతున్నారు. సుమారు ఏడాదిపాటు విశాఖ జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా పనిచేసిన పంచకర్ల రమేశ్‌బాబు మూడు, నాలుగు నెలల క్రితం పార్టీకి రాజీనామా చేసి జనసేనలో చేరిన విషయం తెలిసిందే. ఇక ఇటీవల వైసీపీ సీనియర్‌ నేత, ఎమ్మెల్సీ వంశీకృష్ణ యాదవ్‌, బ్రాహ్మణ కార్పొరేషన్‌ మాజీ చైర్మన్‌ సీతంరాజు సుధాకర్‌ వైసీపీకి గుడ్‌బై చెప్పారు. వీరిలో వంశీకృష్ణ జనసేనలో చేరగా, సుధాకర్‌ టీడీపీలో చేరనున్నట్టు చెబుతున్నారు. తాజాగా అనకాపల్లి జిల్లాలో వైసీపీకి మరో గట్టి దెబ్బ తగిలింది. సీనియర్‌ రాజకీయవేత్త, మాజీ మంత్రి, వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దాడి వీరభద్రరావు, ఆయన తనయుడు, అనకాపల్లి పార్లమెంట్‌ నియోజకవర్గ పరిశీలకుడు దాడి రత్నాకర్‌, మరో కుమారుడు జయవీర్‌ మంగళవారం మధ్యాహ్నం వైసీపీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ పరిణామం రాజకీయ వర్గాల్లో కలకలం రేపగా, వైసీపీలో ప్రకంపనలు సృష్టిస్తున్నది.

వైసీపీకి దాడి గుడ్‌బై

అధికార పార్టీకి వరుస షాక్‌లు

పార్టీని వీడుతున్న సీనియర్లు

ఇప్పటికే ఉమ్మడి జిల్లాలో పంచకర్ల రమేశ్‌బాబు, ఎమ్మెల్సీ వంశీకృష్ణ శ్రీనివాస్‌,

రాష్ట్ర బ్రాహ్మణ కార్పొరేషన్‌ మాజీ చైర్మన్‌ సీతంరాజు సుధాకర్‌ల రాజీనామా

ఇప్పుడు వీరభద్రరావు కుటుంబం...

నేడు అమరావతిలో చంద్రబాబునాయుడు సమక్షంలో టీడీపీలో చేరిక

(అనకాపల్లి-ఆంధ్రజ్యోతి)

అధికార పార్టీ వైఎస్సార్‌ కాంగ్రెస్‌కు షాక్‌ల మీద షాక్‌లు తగులుతున్నాయి. ఎన్నికల ముంగిట పలువురు సీనియర్‌ నేతలు పార్టీని విడిచిపెడుతున్నారు. సుమారు ఏడాదిపాటు విశాఖ జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా పనిచేసిన పంచకర్ల రమేశ్‌బాబు మూడు, నాలుగు నెలల క్రితం పార్టీకి రాజీనామా చేసి జనసేనలో చేరిన విషయం తెలిసిందే. ఇక ఇటీవల వైసీపీ సీనియర్‌ నేత, ఎమ్మెల్సీ వంశీకృష్ణ యాదవ్‌, బ్రాహ్మణ కార్పొరేషన్‌ మాజీ చైర్మన్‌ సీతంరాజు సుధాకర్‌ వైసీపీకి గుడ్‌బై చెప్పారు. వీరిలో వంశీకృష్ణ జనసేనలో చేరగా, సుధాకర్‌ టీడీపీలో చేరనున్నట్టు చెబుతున్నారు. తాజాగా అనకాపల్లి జిల్లాలో వైసీపీకి మరో గట్టి దెబ్బ తగిలింది. సీనియర్‌ రాజకీయవేత్త, మాజీ మంత్రి, వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దాడి వీరభద్రరావు, ఆయన తనయుడు, అనకాపల్లి పార్లమెంట్‌ నియోజకవర్గ పరిశీలకుడు దాడి రత్నాకర్‌, మరో కుమారుడు జయవీర్‌ మంగళవారం మధ్యాహ్నం వైసీపీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ పరిణామం రాజకీయ వర్గాల్లో కలకలం రేపగా, వైసీపీలో ప్రకంపనలు సృష్టిస్తున్నది.

మాజీ మంత్రి దాడి వీరభద్రరావు సుదీర్ఘకాలంపాటు తెలుగుదేశం పార్టీలో ఉండి, 2013లో ఆ పార్టీకి రాజీనామా చేసి వైసీపీలో చేరారు. 2014 ఎన్నికల్లో ఆయన కుమారుడు దాడి రత్నాకర్‌ విశాఖ పశ్చిమ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమి చెందారు. అనంతరం దాడి వీరభద్రరావు కుటుంబం వైసీపీ నుంచి బయటకు వచ్చింది. కొంతకాలంపాటు రాజకీయాలకు దూరంగా ఉన్నారు. తిరిగి తెలుగుదేశం పార్టీలో చేరతారన్న ఊహాగానాలు వినిపించాయి. అయితే ఏం జరిగిందో తెలియదుగానీ..2019 సార్వత్రిక ఎన్నికల ముందు మళ్లీ వైసీపీలో చేరారు. అనకాపల్లి అసెంబ్లీ టికెట్‌ రాకపోవడంతో ఒకింత నిరాశ చెందారు. అయినప్పటికీ వైసీపీ విజయం కోసం కష్టపడి పనిచేశారు. పార్టీ అధికారంలోకి రావడంతో తగిన ప్రాధాన్యం లభిస్తుందని భావించారు. ఎమ్మెల్సీ ఎన్నికలు/ఎంపికలు జరిగినప్పుడు, నామినేటెడ్‌ పదవుల భర్తీ సమయంలో దాడి వీరభద్రరావు కుటుంబ సభ్యుల పేర్లు తెరపైకి రావడం, పార్టీ అధిష్ఠానం మొండి చేయి చూపడం జరుగుతూ వస్తోంది. గత ఎన్నికల్లో అమర్‌ గెలుపునకు కృషి చేసినప్పటికీ పార్టీ పెద్దలు గుర్తించకపోవడం, ఎమ్మెల్సీ సీటు హామీని జగన్‌ నిలుపుకోలేకపోవడం, సొంత పార్టీ నేతలే తమపై విమర్శలు చేస్తుంటే ఎవరూ ఖండించకపోవడం తదితర పరిణామాలు దాడి వీరభద్రరావు కుటుంబాన్ని బాధించాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో మలసాల కుటుంబానికి ఎమ్మెల్యే టికెట్‌ కోసం మంత్రి అమర్‌, జిల్లా పార్టీ అధ్యక్షుడు బొడ్డేడ ప్రసాద్‌ సిఫారసు చేయడం, అధిష్ఠానం సానుకూలంగా స్పందించడాన్ని ‘దాడి’ కుటుంబం తట్టుకోలేకపోయింది. పార్టీ కోసం పనిచేస్తూ సొంత సొమ్ము ఖర్చు చేస్తున్నప్పటికీ పెద్దల కరుణ లేకపోవడం, వచ్చే ఎన్నికల్లో అనకాపల్లి టికెట్‌పై భరోసా లభించకపోవడంతో తీవ్ర మనస్తాపం చెందినట్టు తెలిసింది. ఆత్మవంచన చేసుకుంటూ ఇటువంటి పార్టీలో ఉండలేమన్న ఉద్దేశంతో మంగళవారం రాజీనామా చేశారు. ఈ మేరకు వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్‌రెడ్డికి ఏకవాక్యంతో లేఖ రాసి పంపారు.

నేడు టీడీపీలోకి ‘దాడి’ కుటుంబం

వైసీపీకి రాజీనామా చేసిన దాడి వీరభద్రరావు, ఆయన కుమారులు, అనుచరులు బుధవారం అమరావతిలో టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు, జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ సమక్షంలో ఆ పార్టీలో చేరనున్నారు. దాడి వీరభద్రరావు తన రాజకీయ జీవితాన్ని తెలుగుదేశం పార్టీతోనే మొదలుపెట్టారు. 1985లో తొలిసారి అనకాపల్లి నుంచి ఎమ్మెల్యేగా పోటీచేసి గెలుపొందారు. 1987లో రాష్ట్ర సమాచార శాఖ మంత్రిగా, 1989 జనవరిలో ఆర్టీసీ రీజియన్‌ చైర్మన్‌గా బాధ్యతలు నిర్వహించారు. 1989, 1994, 1999 ఎన్నికల్లో కూడా ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1994లో ఎన్టీఆర్‌ క్యాబినెట్‌లో సమాచార పౌర సంబంధాల శాఖా మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. 2004, 2009 ఎన్నికల్లో ఓటమి చెందారు. ఆ తరువాత టీడీపీ తరపున శాసనమండలి సభ్యుడిగా ఎన్నియ్యారు. శాసన మండలిలో ప్రతిపక్ష నేతగా, టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడిగా పనిచేశారు. వీరభద్రరావు చిన్న కుమారుడు దాడి రత్నాకర్‌ 2012-13 మధ్య కాలంలో ఉమ్మడి విశాఖపట్నం జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా పనిచేశారు.

Updated Date - Jan 03 , 2024 | 01:33 AM