తూకంలో గోల్‌మాల్
ABN , Publish Date - Jun 17 , 2024 | 01:42 AM
అంగన్‌వాడీ కేంద్రాల్లో చిన్నపిల్లలకు ఇచ్చే కందిపప్పు, బియ్యం, నూనె, ఇతర సరుకుల తూకంలో తేడాలున్నాయని పౌరసరఫరాల శాఖా మంత్రి నాదెండ్ల మనోహర్ గుర్తించడంతో రాష్ట్ట్ట్రవ్యాప్తంగా ఆదివారం నుంచి అధికారులు గోదాముల్లో తనిఖీలు ప్రారంభించారు.

గోదాముల్లోనే మతలబులు
రేషన్ సరకుల తూకం
పంచదార, గోధుమపిండి, రాగిపిండి, కందిపప్పు ప్యాకెట్లలో తరుగు
గోదాముల్లో తూకం లేకుండా డీలర్లకు పంపిణీ
ఎక్కువ శాతం బినామీలు కావడంతో అధికారుల ఇష్టారాజ్యం
పౌరసరఫరాల శాఖ మంత్రి దృష్టిసారించాలని వినతి
విశాఖపట్నం, జూన్ 12 (ఆంధ్రజ్యోతి):
అంగన్‌వాడీ కేంద్రాల్లో చిన్నపిల్లలకు ఇచ్చే కందిపప్పు, బియ్యం, నూనె, ఇతర సరుకుల తూకంలో తేడాలున్నాయని పౌరసరఫరాల శాఖా మంత్రి నాదెండ్ల మనోహర్ గుర్తించడంతో రాష్ట్ట్ట్రవ్యాప్తంగా ఆదివారం నుంచి అధికారులు గోదాముల్లో తనిఖీలు ప్రారంభించారు. అయితే పౌరసరఫరాల సంస్థ నిర్వహించే గోదాముల నుంచి రేషన్ డీలర్లకు ప్రతినెలా పంపిణీచేసే బియ్యం, ఇతర సరకుల తూకంలో తేడాల మాటేమిటన్న ప్రశ్న ఉదయిస్తోంది.
కార్డుదారులకు ప్రతినెలా గోధుమపిండి, రాగిపిండి, కందిపప్పు (నాలుగు నెలలుగా సరఫరా కావడం లేదు), పంచదార ప్యాకెట్ల రూపంలో సరఫరా చేస్తున్నారు. గోదాముల్లో వీటిని బస్తాల్లో లెక్కకట్టి డీలర్లకు సరఫరా చేస్తారు. రేషన్ డిపోల నుంచి ఎండీయూలు తీసుకుని పంపిణీ చేస్తున్నారు. కానీ వాటిని ఏ స్థాయిలోనూ తూకం వేయడంలేదు. కిలో, అరకిలో అని చెబితే తీసుకోవడమే. ఈ ప్యాకెట్లలో కిలోకు 50 గ్రాములు తక్కువగా ఉన్నా ఎవరూ ప్రశ్నించడం లేదు. ఇదంతా ఒక ఎత్తైతే.. బియ్యం సరఫరాలో భారీ అవినీతి జరుగుతోంది. ఉదాహరణకు మర్రిపాలెంలోని గోదాము-1లో డీలర్లకు ఇచ్చే బియ్యం చాలావరకు తూకం వేయరనే ఆరోపణలున్నాయి. 50 కిలోల బస్తాలో ఒకటిలేదా రెండు కిలోలు తక్కువగా ఉన్నా డీలర్లు ప్రశ్నించిన సందర్భాలు తక్కువే. ఉదాహరణకు ఒక డీలరుకు ఆరున్నర టన్నుల 20 కిలోల బియ్యం ఇవ్వాలి. అయితే మర్రిపాలెం గోదాము-1లో ఆరున్నర టన్నులే ఇస్తారు.... ఇదేమిటని అడిగినా సమాధానం చెప్పే వారు లేరు. డిపో పరిధిలో కార్డుల సంఖ్యలో ఉన్న కుటుంబ సభ్యుల వివరాల మేరకు బియ్యం డీలర్లకు సరఫరా చేసినపుడు కచ్చితమైన బరువు తూచివ్వాలి. బియ్యం బస్తా తూకంవేసే సమయంలో గోనె బరువు మినహాయించి ఇవ్వాల్సి ఉన్నా అవేవి పట్టించుకోవడంలేదని డీలర్లు చెబుతున్నారు. మర్రిపాలెం గోదాము-1లో మాత్రం చాలావరకు తూకం వేసి ఇవ్వడంలేని డీలర్లు ఆరోపిస్తున్నారు. బియ్యం సరఫరా సమయంలో గోదాము ఇన్‌చార్జి అందుబాటులో ఉండడంలేదని, ఆయన తరఫున చిరుద్యోగి మాత్రమే ఉంటున్నారని ఉన్నతాఽధికారులకు డీలర్లు గతంలోనే ఫిర్యాదుచేశారు. పౌరసరఫరాల సంస్థ జిల్లా కార్యాలయంలో ఎక్కువ సమయం ఉంటూ అప్పుడప్పుడూ గోదాముకు వస్తారని చెబుతున్నారు.
అన్ని గోదాముల్లో తేడాలే...
జిల్లాలో మొత్తం ఆరు గోదాములు ఉండగా, మిగిలిన చోట్ల కూడా తూకంలో తేడాలొస్తున్నాయి. దీంతో కార్డుదారులకు బియ్యం పంపిణీచేసినపుడు కిలోకు 10 నుంచి 20 గ్రాముల వరకు తక్కువగా తూచి ఇస్తున్నారన్న ఆరోపణలున్నాయి. ప్రతినెల జిల్లాలో 5.26 లక్షల కార్డుదారులకు 1900 టన్నుల బియ్యం సరఫరా చేస్తారు. అయితే తూకం వేయడంలో చేతివాటం ప్రదర్శించడంతో రూ.లక్షల అవినీతి జరుగుతోందని పలువురు డీలర్లు ఆరోపిస్తున్నారు. ప్రతినెలా మూడోవారం తరువాత డీలర్లకు సరకులు పంపిణీ ప్రారంభమయ్యే సమయంలో జిల్లా అధికారులు నిఘా వేసి ఇవ్వాల్సిన సరకుల తూకంలో తేడాలు లేకుండా చూడాలని కోరుతున్నారు.
బినామీ డీలర్లే ఎక్కువ...
ఇదిలావుండగా జిల్లాలో 650 మంది వరకు రేషన్ డీలర్లు ఉండగా 70 శాతం వరకు నగర పరిధిలో ఉన్నారు. వీరిలో ఎక్కువ మంది బినామీలు ఉండడంతో అధికారులు గోదాముల వద్ద ఇష్టానుసారం వ్యవహరించినా ప్రశ్నించడంలేదు. గట్టిగా మాట్లాడితే చర్యలు తీసుకునే అవకాశం ఉందని వాదన వినిపిస్తోంది. తూకం పక్కాగా ఉండాలంటే పౌరసరఫరాల సంస్థను ప్రక్షాళన చేయాలని పలువురు డీలర్లు కోరుతున్నారు. గోదాముల వద్ద తక్కువగా సరకులు ఇవ్వడం వల్ల కార్డుదారులకు ఇచ్చే బియ్యంలో కోత పడుతోందని చెబుతున్నారు. నగరంలో రేషన్ డీలర్లకు ఇచ్చే సరకుల పంపిణీపై మంత్రి దృష్టిసారించాలని వినియోగదారుల ఫోరం సభ్యులు కోరుతున్నారు.