Share News

ఒడ్డిమెట్ట వద్ద దాబాలో గో మాంసం వంటకాలు!

ABN , Publish Date - Dec 28 , 2024 | 12:49 AM

మండలంలోని ఒడ్డిమెట్ట వద్ద జాతీయ రహదారి పక్కనున్న ఒక దాబాలో గో మాంసంతో తయారు చేసిన వంటకాలను వడ్డిస్తున్నట్టు హిందూ ధార్మిక సంస్థ ప్రతినిధుల తనిఖీల్లో బయటపడింది. ఇందుకు సంబంధించి వివరాలిలా వున్నాయి. పాయకరావుపేట మండలం నామవరం గ్రామానికి చెందిన కొంతమంది యువకులు శుక్రవారం రాత్రి ఒడ్డిమెట్ట వద్ద పెట్రోల్‌ బంకు పక్కన వున్న దాబాకు వెళ్లి బిర్యానీ ఆర్డర్‌ చేశారు.

ఒడ్డిమెట్ట వద్ద దాబాలో గో మాంసం వంటకాలు!
ఒడ్డిమెట్ట వద్ద దాబాలో మాంసం వంటకాన్ని పరిశీలిస్తున్న రాష్ట్ర ధార్మిక పరిషత్‌ ప్రతినిధి కరాటే కల్యాణి, ఇతర సభ్యులు

రాష్ట్ర ధార్మిక పరిషత్‌ ప్రతినిధి కరాటే కల్యాణి తనిఖీ

పోలీసులకు సమాచారం

మాంసం కూరను సీజ్‌ చేసిన ఎస్‌ఐ

నక్కపల్లి, డిసెంబరు 27 (ఆంధ్రజ్యోతి): మండలంలోని ఒడ్డిమెట్ట వద్ద జాతీయ రహదారి పక్కనున్న ఒక దాబాలో గో మాంసంతో తయారు చేసిన వంటకాలను వడ్డిస్తున్నట్టు హిందూ ధార్మిక సంస్థ ప్రతినిధుల తనిఖీల్లో బయటపడింది. ఇందుకు సంబంధించి వివరాలిలా వున్నాయి. పాయకరావుపేట మండలం నామవరం గ్రామానికి చెందిన కొంతమంది యువకులు శుక్రవారం రాత్రి ఒడ్డిమెట్ట వద్ద పెట్రోల్‌ బంకు పక్కన వున్న దాబాకు వెళ్లి బిర్యానీ ఆర్డర్‌ చేశారు. బిర్యానీలో మాంసం ముక్కలు పెద్దవిగా వుండడంతో అనుమానం వచ్చి, ఇతర జంతువులమాంసం ఏమైనా కలిపారా అని సిబ్బందిని ప్రశ్నించారు. అటువంటిది ఏమీ లేదని వాళ్లు బదులిచ్చారు. అయినప్పటికీ యువకులు అనుమానం చెందుతూ పాయకరావుపేటకు చెందిన హిందూ ధార్మిక సంస్థ ప్రతినిధి ఎన్‌.శ్రీనుకు ఫోన్‌ చేసి చెప్పారు. ఆయన వెంటనే రాష్ట్ర ధార్మిక పరిషత్‌ ప్రతినిధి కరాటే కల్యాణి, ఇతర ప్రతినిధులకు ఫోన్‌లో సమాచారం అందజేశారు. కొద్దిసేపకి వారంతా దాబాకు చేరుకున్నారు. కిచెన్‌లో వండిన మాంసం కూరను పరిశీలించారు. ఇది ముమ్మాటికీగో మాంసమేనని స్పష్టం చేశారు. ఈ విషయాన్ని నక్కపల్లి ఎస్‌ఐ సన్నిబాబుకు ఫోన్‌ చేసి చెప్పారు. ఆయన వచ్చి మాంసాన్ని పరిశీలించారు. సుమారు మూడు కిలోల మాంసాన్ని సీజ్‌ చేశారు. శనివారం ఫుడ్‌ ఇన్‌స్పెక్టర్‌ వచ్చి పరిశీలించిన తరువాత గో మాంసమేనని తేలితే చర్యలు తీసుకుంటామని ఎస్‌ఐ చెప్పారు.

అపార్టుమెంట్‌ పైనుంచి పడి కార్మికుడి మృతి

పరవాడ, డిసెంబరు 27 (ఆంధ్రజ్యోతి): నిర్మాణంలో ఉన్న అపార్టుమెంట్‌ పైనుంచి కాలు జారి కింద పడడంతో కార్మికుడు మృతిచెందాడు. దేశపాత్రునిపాలెం శివారు శేషాద్రినగర్‌లో శుక్రవారం జరిగిన ఈ సంఘటనకు సంబంధించి సీఐ జి.మల్లికార్జునరావు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. శేషాద్రినగర్‌లో జీఎస్‌ఆర్‌ కన్‌స్ట్రక్షన్‌ కంపెనీ ఆధ్వర్యంలో అపార్టుమెంట్‌ నిర్మాణ పనులు జరుగుతున్నాయి. కూర్మన్నపాలేనికి చెందిన చోడి నాగరాజు(46) ఇక్కడ కార్మికుడిగా పనిచేస్తున్నాడు. శుక్రవారం ఉదయం తొమ్మిదిన్నర గంటల సమయంలో నాలుగో అంతస్థు పరంజిపై నిలబడి పని చేస్తున్నాడు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తూ కాలు జారడంతో కింద పడి తీవ్రంగా గాయపడ్డాడు. తోటి కార్మికులు కేజీహెచ్‌కు తరలించారు. నాగరాజును పరిశీలించిన వైద్యులు అప్పటికే మృతిచెందినట్లు నిర్ధారించారు. మృతునికి భార్య అప్పలనర్సమ్మ, కుమారుడు ధనుంజయ్‌, కుమార్తె నందిత ఉన్నారు. ఇతని స్వస్థలం పార్వతీపురం మన్యం జిల్లా వీరఘట్టం మండలం కడకెల్లా గ్రామం. కొంతకాలం నుంచి కుటుంబంతోసహా కూర్మన్నపాలెంలో నివాసం ఉంటున్నాడు. శనివారం పోస్టుమార్టం నిర్వహించి మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగిస్తామని, నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ తెలిపారు.

కుక్కను తప్పించబోయి ప్రమాదం.. ఒకరి మృతి

కొత్తూరు, డిసెంబరు (ఆంధ్రజ్యోతి): అనకాపల్లి మండలం చింతనిప్పుల అగ్రహారం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి మృతిచెందగా భార్య, పిల్లలు స్వల్పంగా గాయపడ్డారు. అనకాపల్లి రూరల్‌ ఎస్‌ఐ జి.రవికుమార్‌ తెలిపిన వివరాల ప్రకారం... విశాఖలోని వేపగుంటకు చెందిన ముద్దాడ రాజేంద్ర(35)భార్య, కుమారుడు, కుమార్తె కలిసి ద్విచక్రవాహనంపై ఒంపోలు వెళుతున్నాడు. దారిలో సీహెచ్‌ఎన్‌ అగ్రహారం వద్ద జాతీయ రహదారిపై ఆకస్మికంగా కుక్క అడ్డురావడంతో అదుపుతప్పి కిందపడిపోయారు. రాజేంద్ర తలకు తీవ్రగాయమై అక్కడికక్కడే మృతిచెందాడు. భార్య, పిల్లలకు స్వల్పంగా గాయాలయ్యాయి. వీరు విశాఖపట్నంలోని ఒక ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

కుక్కలు దాడి.. 15 గొర్రెలు మృతి

రాంబిల్లి, డిసెంబరు 27 (ఆంధ్రజ్యోతి): మండలంలోని గోవిందపాలెం గ్రామంలో శుక్రవారం వీధి కుక్కలు దాడిచేయడంతో 15 గొర్రెలు మృతి చెందాయి. గ్రామానికి చెందిన ఇసరపు రమణ తన గొర్రెల మందను గురువారం రాత్రి స్థానికంగా ఉన్న ఒక కొబ్బరి తోటలో ఉంచి, చుట్టూ ఇనుప కంచె వేశాడు. శుక్రవారం ఉదయం ఎవరూలేని సమయంలో కుక్కల గుంపు కొబ్బరి తోటలోకి ప్రవేశించి గొర్రెలపై విచక్షణారహితంగా దాడి చేశాయి. సుమారు 30 గొర్రెలు తప్పించుకుని తలోదిక్కుకు పారిపోగా, 15 గొర్రెలు కుక్కలబారినపడి మృతిచెందాయి. కొద్దిసేపటి తరువాత విషయం తెలుసుకున్న రమణ అక్కడకు వచ్చి తీవ్ర ఆవేదన చెందాడు. గొర్రెలు, మేకల పెంపకందారుల సంఘం జిల్లా డైరెక్టర్‌ జి.దేముడునాయుడు వచ్చి మృతిచెందిన గొర్రెలను పరిశీలించారు. కుక్కల దాడిలో గొర్రెలను కోల్పోయిన రమణను ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకోవాలని కోరారు.

బైక్‌ను ఢీకొన్న కారు, ఇద్దరికి తీవ్రగాయాలు

పరవాడ, డిసెంబరు 27 (ఆంధ్రజ్యోతి): మండలంలోని గొర్లివానిపాలెం వద్ద శుక్రవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు గాయపడ్డారు. ఇందుకు సంబంధించిన పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. మునగపాక మండలం తోటాడ పంచాయతీ పరిధి సిరసపల్లి గ్రామానికి చెందిన కోరుబిల్లి వెంకట జగ్గఅప్పారావు, అతని స్నేహితుడు ఎస్‌కే రహీమ్‌ ద్విచక్ర వాహనంపై దేశపాత్రునిపాలెం నుంచి స్వగ్రామానికి బయలుదేరారు. గొర్లివానిపాలెం వద్దకు వచ్చేసరికి అదే రహదారిలో వస్తున్న కారు వీరిని బలంగా ఢీకొన్నది. దీంతో ఇరువురికి బలమైన గాయాలయ్యాయి. స్థానికులు ఇక్కడ ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. ప్రమాదానికి కారణమైన కారు డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - Dec 28 , 2024 | 12:49 AM