Share News

ఇంటర్‌లో బాలికల హవా

ABN , Publish Date - Apr 13 , 2024 | 01:21 AM

ఇంటర్మీడియట్‌ పలితాల్లో ఈ ఏడాది కూడా బాలికల హవా కొనసాగింది.

ఇంటర్‌లో బాలికల హవా

  • బాలురు కంటే రెండు శాతం అధికంగా ఉత్తీర్ణత

  • ఫలితాల్లో రాష్ట్రస్థాయిలో జిల్లాకు నాలుగో స్థానం

  • ప్రథమ సంవత్సరం 77 శాతం,
    ద్వితీయ సంవత్సరంలో 84 శాతం పాస్‌

  • ఒకేషనల్‌...ప్రథమ ఏడాది 68 శాతం,
    ద్వితీయ ఏడాది 80 శాతం ఉత్తీర్ణత

విశాఖపట్నం/మద్దిలపాలెం, ఏప్రిల్‌ 12 (ఆంధ్రజ్యోతి):

ఇంటర్మీడియట్‌ పలితాల్లో ఈ ఏడాది కూడా బాలికల హవా కొనసాగింది. బాలురు కంటే రెండు శాతం అధికంగా బాలికలు ఉత్తీర్ణులయ్యారు. ప్రథమ సంవత్సరంలో 77 శాతం, ద్వితీయ సంవత్సరంలో 84 శాతం ఉత్తీర్ణతతో విశాఖ జిల్లా రాష్ట్రంలో నాలుగో స్థానంలో నిలిచింది. గత ఏడాది కంటే ప్రథమ సంవత్సరం ఫలితాల్లో ఒక మెట్టు (గత ఏడాది రాష్ట్రంలో ఐదో స్థానం), ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో రెండు మెట్లు (గత ఏడాది ఆరో స్థానం) ఎగబాకింది.

పునర్విభజన తరువాత తొలిసారి కొత్త జిల్లాల ప్రాతిపదికన ఈ ఏడాది ఫలితాలు వెల్లడించారు. విశాఖపట్నం జిల్లా నుంచి జనరల్‌ కేటగిరీలో ప్రథమ సంవత్సరం 38,818 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకాగా 30,050 మంది (77 శాతం) ఉత్తీర్ణులయ్యారు. వీరిలో బాలురు 20,745 మందికి 15,858 మంది (76 శాతం), బాలికలు 18,073 మందికి 14,192 మంది (79 శాతం) ఉత్తీర్ణత సాధించారు. ద్వితీయ సంవత్సరంలో 34,672 మంది పరీక్షలు రాయగా 29,258 మంది (84 శాతం) ఉత్తీర్ణులయ్యారు. బాలురు 18,436 మందికి 15,392 (83 శాతం), బాలికలు 16,236 మందికి 13,866 మంది (85 శాతం) ఉత్తీర్ణత సాఽదించారు. ఒకేషనల్‌...ప్రథమ ఏడాది 1,431 మంది పరీక్షలు రాయగా 968 మంది (68 శాతం) ఉత్తీర్ణులయ్యారు. వీరిలో బాలురు 451 మందికి 209 మంది (46 శాతం), బాలికలు 980 మందికి 759 మంది (77 శాతం) ఉత్తీర్ణత సాధించారు. ద్వితీయ ఏడాది 1,307 మంది పరీక్షలకు హాజరవ్వగా 1041 మంది (80 శాతం) ఉత్తీర్ణులయ్యారు. బాలురు 393 మందికి 263 మంది (67 శాతం), బాలికలు 914 మందికి 778 మంది (85 శాతం) ఉత్తీర్ణత సాధించారు.

ఢిల్లీ ఎయిమ్స్‌లో ఎంబిబీఎస్‌ చేస్తా

శరగడం పావని, బైపీసీ ద్వితీయ సంవత్సరం టాపర్‌

కూర్మన్నపాలెం, ఏప్రిల్‌ 12:

గాజువాక బీసీ రోడ్డులో నివాసముంటున్న శరగడం నాగ గంగారావు, లావణ్యల కుమార్తె పావని ఇంటర్మీడియట్‌ ద్వితీయ సంవత్సరం (బైపీసీ) 991/1000 మార్కులు సాధించింది. ఈమె కూర్మన్నపాలెం శ్రీచైతన్య కళాశాలలో చదువుకుంది. పావని మొదటి సంవత్సరంలో 435 మార్కులు తెచ్చుకుంది. ద్వితీయ సంవత్సరం ఇంగ్లీషులో 97, సంస్కృతంలో 99, బోటనీ, జువాలజీ, ఫిజిక్స్‌, కెమిస్టీల్లో 60/60, ప్రాక్టికల్స్‌లో 120కి 120 మార్కులు సాధించింది. కళాశాల అధ్యాపకుల నిరంతర పర్యవేక్షణ, సందేహాల నివృత్తి, సమాజంలో ఓ ప్రత్యేకమైన గుర్తింపు ఉండాలన్న తల్లిదండ్రుల మార్గనిర్దేశనంతోనే కష్టపడి చదివి ఈ స్థాయి మార్కులు సాధించినట్టు పావని తెలిపింది. భవిష్యత్తులో ఢిల్లీ ఎయిమ్స్‌లో ఎంబీబీఎస్‌ చేసి, ఉత్తమ డాక్టర్‌ కావాలన్నది తన లక్ష్యమని పేర్కొంది. పావని తండ్రి గంగారావు గంగవరం పోర్టులో పనిచేస్తున్నారు. తల్లి గృహిణి.

ఐఐటీలో ఇంజనీరింగ్‌ చేస్తా

చింటు రేవతి, ఎంపీసీ మొదటి సంవత్సరం టాపర్‌

కూర్మన్నపాలెం, ఏప్రిల్‌ 12:

బోయపాలెం శ్రీచైతన్య కళాశాలలో ఎంపీసీ మొదటి సంవత్సరం చదువుతున్న చింటు రేవతి 467/470 మార్కులు సాధించింది. రేవతి స్వస్థలం శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళి మండలం సుబ్బారావుపేట. తల్లిదండ్రులు చింటు కృష్ణమూర్తి, జయమ్మ. సాధారణ రైతు అయిన కృష్ణమూర్తి ఆర్థికంగా అంత స్థోమత లేకపోయినా తనలా తన పిల్లలు ఇబ్బందిపడకూడదన్న ఉద్దేశంతో కష్టపడి చదివిస్తున్నారు. జయమ్మ గృహిణి. చిన్నచిన్న పనులకు వెళుతుంటారు. ఇంటర్మీడియట్‌ అనంతరం జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో మంచి ర్యాంకు సాధించి ఐఐటీలో ఇంజనీరింగ్‌ చేయాలనేది తన లక్ష్యమని రేవతి చెప్పింది.

టాపర్లుగా విశాఖ విద్యార్థులు

ప్రథమ సంవత్సరం ఎంపీసీలో 467 మార్కులు

సెకండ్‌ ఇయర్‌ బైపీసీలో 991 మార్కులు...

ఇంకా అనేక మందికి 990, 989..

ఫలితాల్లో ప్రైవేటు జోరు

విశాఖపట్నం, ఏప్రిల్‌ 12 (ఆంధ్రజ్యోతి):

ఇంటర్మీడియట్‌ పరీక్షల ఫలితాల్లో విశాఖ విద్యార్థులు మంచి ప్రతిభ చూపారు. జిల్లాలో చదివిన ఇద్దరు రాష్ట్ర స్థాయిలో మొదటి స్థానంలో నిలిచారని ఆయా కళాశాలలు వెల్లడించాయి. కాగా మరికొందరు విద్యార్థులు కూడా మంచి మార్కులు సాధించారు. నగరంలోని శ్రీచైతన్య విద్యా సంస్థల్లో ఎంపీసీ ప్రథమ సంవత్సరం చదివిని విద్యార్థిని చింతు రేవతి 470కి 467 మార్కులు సాధించి రాష్ట్ర స్థాయిలో మొదటి స్థానం సాధించింది. ఇదే విద్యా సంస్థలో ద్వితీయ సంవత్సరం బైపీసీ చదివిన శరగడం పావని 991 మార్కులతో రాష్ట్రంలో ప్రథమ స్థానంలో నిలిచింది. ప్రథమ ఏడాది ఎంపీసీలో నారాయణ కళాశాలకు చెందిన వేంపాడ గణేష్‌ కార్తీక్‌, పెయ్యల ఉద్భవ్‌, ప్రణవ్‌ సాయినాగ్‌, పి. హర్షవర్దన్‌, సి.భరద్వాజ, పి.సుమన్‌, ఎల్‌.మురళి, డి.సాయి సాత్విక్‌, పి.మహాలక్ష్మి, శ్రీచైతన్య విద్యా సంస్థలకు చెందిన కె.అనిల్‌కుమార్‌, వి.బెనర్జీనాయుడు, ఎ.మేఘనా శర్మ, శ్రీవిశ్వ విద్యార్థులు జి.ఆదిశేషు, డి.పల్లవి, డి.మునీంద్ర, ఎం.జాహ్నవి, డి.పార్థు, అసెంట్‌ కళాశాలకు చెందిన సిద్ధార్థరెడ్డిలు 470కి 466 మార్కులు సాధించారు. ప్రథమ ఏడాది బైపీసీలో నారాయణ కళాశాలలకు చెందిన బి.సత్యవేణి, శ్రీచైతన్య కళాశాలలకు చెందిన బాలక హర్షవర్దనసాయి, చింతాడ రిషితలు 440కి 435 మార్కులు సాధించారు. ద్వితీయ ఏడాది ఎంపీసీలో శ్రీచైతన్య విద్యాసంస్థలకు చెందిన శెట్టి మేఘదీపక్‌, డి.ప్రేమచరణ్‌, ఎం.చరణ్‌లు 990, పి.బాలాజీ, శ్రీమయి, వెంకటపవన్‌, బి.లోకేష్‌, మెండ తరుణ్‌, అసెంట్‌ కళాశాలలో చదివిన బి.హర్షదీప్‌ 989 మార్కులు సాధించారు. బైపీసీ ద్వితీయ సంవత్సరంలో శ్రీచైతన్య కళాశాలకు చెందిన పి.దాకేశ్‌, ఆర్‌.దీపికా కీర్తిలు 989 మార్కులు సాధించారు.

చతికిలపడ్డ ప్రభుత్వ కళాశాలలు

దారుణంగా ఇంటర్‌ ఫలితాలు

  • ప్రథమ సంవత్సరంలో 32%

  • ద్వితీయ ఏడాదిలో 45 శాతం ఉత్తీర్ణత

  • కృష్ణా కళాశాలలో 35.47%

  • మహిళా కళాశాలలో 58.9 శాతం ఉత్తీర్ణ

  • హైస్కూలు ప్లస్‌లో 278 మంది విద్యార్ధులకు
    47 మంది పాస్‌

  • కేజీబీవీల్లో 184కి 113 ఉత్తీర్ణత

  • ప్రైవేటు కళాశాలల్లో 83.38 శాతం పాస్‌

విశాఖపట్నం/మద్దిలపాలెం, ఏప్రిల్‌ 12 (ఆంధ్రజ్యోతి):

ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో ఫలితాలు దారుణంగా వచ్చాయి. ప్రథమ సంవత్సరం 32 శాతం, ద్వితీయ సంవత్సరం 45 శాతం మాత్రమే ఉత్తీర్ణత సాధించాయి. పాలకుల మాటలు కోటలు దాటుతున్నాయి తప్ప ఎక్కడా పర్మనెంట్‌ అధ్యాపకుల నియామకం చేపట్టలేదు. విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు కూడా అందించలేదు. ఇక నాడు-నేడు పేరుతో ఏడాది పొడవునా కళాశాలల్లో పనులు చేపట్టడంతో బోధనపై ప్రభావం పడింది. దీంతో ఫలితాలు పేలవంగా వచ్చాయని అంటున్నారు.

జిల్లాలో పది జూనియర్‌ కళాశాలలు ఉన్నాయి. ప్రథమ సంవత్సరం 1,550 మంది పరీక్షలు రాయగా కేవలం 502 (32 శాతం) మంది మాత్రమే ఉత్తీర్ణులయ్యారు. ఇక ద్వితీయ సంవత్సరం 1,249 మంది పరీక్షలకు హాజరవ్వగా 566 మంది (45 శాతం) ఉత్తీర్ణత సాధించారు. ఒకేషనల్‌ కోర్సుల్లో కాస్త మెరుగైన ఫలితాలే కనబరిచారు. ప్రథమ సంవత్సరం 1,013 మందికి 655 (64 శాతం), ద్వితీయ సంవత్సరంలో 900 మందికి 703 మంది (78 శాతం) ఉత్తీర్ణత సాధించారు.

నగరంలోని వీఎస్‌ కృష్ణా జూనియర్‌ కళాశాలలో ప్రథమ ఏడాదిలో 481 మందికి 102 మంది (21.21 శాతం), ద్వితీయ ఏడాదిలో 406కి 144 (35.47 శాతం) ఉత్తీర్ణత సాధించారు. ప్రభుత్వ బాలికల జూనియర్‌ కళాశాలలో ప్రథమ ఏడాది 455కి 217 (47.69 శాతం), ద్వితీయ ఏడాది 399కి 235 (58.9 శాతం) మంది, ఒకేషనల్‌లో ప్రథమ ఏడాదిలో 212కి 179 (84.43 శాతం), ద్వితీయ సంవత్సరం 192కి 181 (94.27 శాతం) ఉత్తీర్ణతతో మంచి ప్రతిభ చూపారు. ఆనందపురం ప్రభుత్వ జూనియర్‌ కళాశాల పనితీరు మరీ తీసికట్టుగా మారింది. ప్రథమ సంవత్సరం 14 మందికి 12 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా ఒకరు, ద్వితీయ ఏడాది తొమ్మిది మందికిగాను ఏడుగురు పరీక్షలకు హాజరుకాగా ఒకరు మాత్రమే ఉత్తీర్ణత సాధించారు. ఆ కళాశాల నుంచి ఒక్కొక్క విద్యార్థి మాత్రమే ఉత్తీర్ణత సాధించడంతో కళాశాల జిల్లాలో అట్టడుగు స్థానంలో నిలిచింది.

హైస్కూలు ప్లస్‌ ఢమాల్‌

జిల్లాలోని ఆరు ఉన్నత పాఠశాలల్లో బాలికల కోసం ఏర్పాటుచేసిన హైస్కూలు ప్లస్‌లో ఫలితాలు నిరాశపరిచాయి. ప్రథమ, ద్వితీయ సంవత్సరాలు కలిపి 278 మంది పరీక్షలకు హాజరుకాగా కేవలం 47 మంది ఉత్తీర్ణత సాధించారు. ప్రథమ ఏడాది 167 మంది విద్యార్థులకుగాను 25 (14 శాతం) మంది, ద్వితీయ సంవత్సరం 111 మందికి 22 మంది (20 శాతం) మాత్రమే ఉత్తీర్ణత సాధించడం గమనార్హం. రాంపురం, మల్కాపురంలలో ప్రథమ ఏడాది ఒక్కొక్కరు మాత్రమే పాసయ్యారు. మిగిలిన చోట్ల కూడా ఆశించినంత ఫలితాలు రాలేదు. జిల్లాలో ఆనందపురం, పద్మనాభం, భీమిలి కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయాల్లో ఫలితాలు కొంతమేర ఫర్వాలేదనిపించాయి. మూడుచోట్ల కలిపి ప్రథమ ఏడాదిలో 94కి 60, ద్వితీయ ఏడాదిలో 90కి 53 మంది ఉత్తీర్ణత సాధించారు. సాంఘిక సంక్షేమ జూనియర్‌ కళాశాలల్లో ప్రథమ ఏడాదిలో 155కి 110 మంది (70.38), ద్వితీయ ఏడాది 173కి 135 (78.06 శాతం) మంది పాసయ్యారు. గిరిజన సంక్షేమ శాఖలో ప్రథమ ఏడాది 79కి 78 మంది (98.7శాతం), ద్వితీయ ఏడాది 81కి 78 మంది(96 శాతం), బీసీ వెల్ఫేర్‌లో ప్రథమ ఏడాది 92కి 81 మంది (88.04 శాతం), ద్వితీయ ఏడాదిలో 79కి 74కి (93.67 శాతం) మంది ఉత్తీర్ణులయ్యారు. ప్రైవేటు కళాశాలల విషయానికి వస్తే ప్రథమ సంవత్సరం 35,897 మంది పరీక్షలు రాయగా 28,778 (80.16 శాతం) మంది, ద్వితీయ సంవత్సరం 32,267కి 27,944 (86.6 శాతం) మంది పాసయ్యారు.

Updated Date - Apr 13 , 2024 | 01:21 AM