Share News

బాలికలదే పైచేయి

ABN , Publish Date - Apr 13 , 2024 | 01:18 AM

జిల్లాలో ఇంటర్మీడియట్‌ ఫలితాలు నిరాశాజనకంగా ఉన్నాయి. శుక్రవారం ప్రకటించిన ఇంటర్మీడియల్‌ ప్రథమ, ద్వితీయ సంవత్సరాల ఫలితాలను పరిశీలిస్తే ఈ ఏడాది జిల్లాలో బాలికలే పైచేయిగా నిలిచారు.

బాలికలదే పైచేయి

- జిల్లాలో నిరాశాజనకంగా ఇంటర్మీడియట్‌ ఫలితాలు

- ప్రథమ సంవత్సరంలో 52 శాతం మంది ఉత్తీర్ణత

- బాలురు 39, బాలికలు 61 శాతం

- ద్వితీయ సంవత్సరంలో 66 శాతం మంది ఉత్తీర్ణత

- బాలురు 56, బాలికలు 73 శాతం

- కేజీబీవీల్లో ఫలితాలు భేష్‌

అనకాపల్లి, ఏప్రిల్‌ 12 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో ఇంటర్మీడియట్‌ ఫలితాలు నిరాశాజనకంగా ఉన్నాయి. శుక్రవారం ప్రకటించిన ఇంటర్మీడియల్‌ ప్రథమ, ద్వితీయ సంవత్సరాల ఫలితాలను పరిశీలిస్తే ఈ ఏడాది జిల్లాలో బాలికలే పైచేయిగా నిలిచారు.

జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలల నుంచి ప్రథమ సంవత్సరం ఇంటర్మీడియట్‌ పరీక్షలకు 10,443 మంది హాజరుకాగా 5,442 మంది ఉత్తీర్ణులయ్యారు. ఉత్తీర్ణత శాతం 52గా నమోదైంది. ఇందులో బాలురు 4,381 మంది హాజరు కాగా 1,729 మంది ఉత్తీర్ణులయ్యారు. అంటే 39 శాతం, అలాగే బాలికలు 6,062 మంది పరీక్షలు రాయగా 3,713 మంది ఉత్తీర్ణత సాధించారు. వీరి ఉత్తీర్ణత శాతం 61గా నమోదైంది. జిల్లాలో మొత్తంగా ప్రథమ సంవత్సరం ఫలితాలు 52 శాతంగా నమోదయ్యాయి. బాలుర కంటే బాలికలే పైచేయిగా నిలిచారు.

ద్వితీయ సంవత్సర ఫలితాలు

జిల్లాలో ఈ ఏడాది ఇంటర్మీడియట్‌ ద్వితీయ సంవత్సరం విద్యార్థులు 9,248 మంది పరీక్షలు రాయగా వారిలో 6,119 మంది ఉత్తీర్ణత సాధించారు. ఇందులో బాలురు 3,756 మంది పరీక్షలు రాయగా 2,112 మంది ఉత్తీర్ణత సాధించారు. 56 శాతం ఉత్తీర్ణత నమోదైంది. బాలికలు 5,492 మంది పరీక్షలకు హాజరుకాగా 4,007 మంది ఉత్తీర్ణులయ్యారు. ఉత్తీర్ణత శాతం 73 గా నమోదైంది. జిల్లాలో ద్వితీయ ఇంటర్‌ ఫలితాలు మొత్తం 66 శాతంగా నమోదైంది. మొత్తంగా చూసుకుంటే ద్వితీయ సంవత్సర ఫలితాల్లోనూ బాలికలే అధికంగా ఉత్తీర్ణులయ్యారు.

ఒకేషనల్‌ కోర్సుల ఫలితాలు

జిల్లాలో ఈ ఏడాది ఒకేషనల్‌ ఇంటర్మీడియట్‌ కోర్సుల్లో ప్రథమ సంవత్సర విద్యార్థులు 2,353 మంది పరీక్షలకు హాజరు కాగా 1,483 మంది ఉత్తీర్ణతతో 63 శాతం నమోదైంది. ఇందులో 763 మంది బాలురు పరీక్షలు రాయగా 358 మంది ఉత్తీర్ణతతో 47 శాతం నమోదైంది. బాలికలు 1,590 మంది పరీక్షలు రాయగా, 1,129 మంది ఉత్తీర్ణతతో 71 శాతం నమోదైంది. అలాగే ద్వితీయ సంవత్సర విద్యార్థులు 2,100 మంది పరీక్షలు రాయగా 1,483 మంది ఉత్తీర్ణతతో 71 శాతం నమోదైంది. ఇందులో 671 మంది బాలురు పరీక్షలు రాయగా 341 మంది ఉత్తీర్ణతతో 51 శాతం నమోదైంది. బాలికలు 1,429 మంది పరీక్షలు రాయగా 1,142 మంది ఉత్తీర్ణతతో 80 శాతం నమోదైంది. జిల్లాలో ద్వితీయ సంవత్సర ఒకేషనల్‌ కోర్సుల్లో మొత్తంగా 71 శాతం ఉత్తీర్ణత సాధించారు.

గత ఏడాదితో పోలిస్తే కాస్త మెరుగు

జిల్లాలో గత ఏడాదితో పోలిస్తే ఇంటర్మీడియట్‌ ప్రథమ, ద్వితీయ సంవత్సర ఫలితాలు ఈ ఏడాది కాస్త మెరుగ్గానే ఉన్నాయి. గత ఏడాది జిల్లాలో ఇంటర్‌ ప్రథమ సంవత్సర పరీక్షలకు 2,501 మంది విద్యార్థులు హాజరయ్యారు. వీరిలో కేవలం 644 మంది మాత్రమే ఉత్తీర్ణులయ్యారు. కేవలం 25.75 శాతం నమోదైంది. ఈ ఏడాది ప్రథమ సంవత్సర ఫలితాలు 52 శాతానికి పెరిగింది. అదేవిధంగా గత ఏడాది జిల్లాలో ఇంటర్‌ ద్వితీయ సంవత్సర పరీక్షలకు 3,125 మంది హాజరుకగా 1,132 మంది ఉత్తీర్ణులయ్యారు. 36.22 శాతం ఉత్తీర్ణత నమోదైంది. ఈ ఏడాది 66 శాతానికి పెరిగింది.

కేజీబీవీల్లో ఆశాజనకంగా ఫలితాలు

జిల్లాలో 20 కస్తూర్బా గాంధీ బాలికల జూనియర్‌ కళాశాలు ఉన్నాయి. ఆయా విద్యాలయాల నుంచి ఈ ఏడాది ఇంటర్‌ ప్రథమ సంవత్సర పరీక్షలకు 619 మంది బాలికలు హాజరు కాగా, వారిలో 452 మంది ఉత్తీర్ణులయ్యారు. 73 శాతం ఫలితాలు సాధించారు. 170 మంది ఉత్తీర్ణులు కాలేకపోయారు. కశింకోట కేజీబీవీ నుంచి ప్రథమ సంవత్సర బైపీసీ బాలికలు 29 మంది పరీక్షలకు హాజరు కాగా, అందరూ ఉత్తీర్ణులయ్యారు. ద్వితీయ సంవత్సర బాలికలు 467 మంది పరీక్షలు రాయగా, వారిలో 388 మంది ఉత్తీర్ణత సాధించి 79 శాతం నమోదు చేశారు. గొలుగొండ, కోటవురట్ల కేజీబీవీల్ల్లో నూటికి నూరు శాతం బాలికలు ఉత్తీర్ణత సాధించారు.

ప్రభుత్వ కళాశాలల్లో ఫలితాలు ఢమాల్‌

జిల్లాలో 20 ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలు ఉన్నాయి. ఈ ఏడాది ప్రభుత్వ కళాశాలల్లో ఇంటర్‌ ప్రథమ సంవత్సరం విద్యార్థులు 2,397 మంది పరీక్షలకు హాజరుకాగా, కేవలం 700 మంది మాత్రమే ఉత్తీర్ణులయ్యారు. కేవలం 30 శాతం ఉత్తీర్ణత నమోదైంది. ద్వితీయ సంవత్సరం విద్యార్థులు 2,023 మంది పరీక్షలు రాయగా, వారిలో 1,070 మంది ఉత్తీర్ణులయ్యారు. 53 శాతం నమోదైంది. ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో అధ్యాపకుల పోస్టుల ఖాళీలను భర్తీ చేయకుండా కాంట్రాక్టు అధ్యాపకులతో నెట్టుకొస్తున్నారు. సబ్జెక్టు టీచర్లు లేకపోవడం, పరీక్షలు కేవలం రెండు మూడు నెలలు ఉందనగా కాంట్రాక్టు ప్రాతిపదికన అధ్యాపకుల నియామకాలు చేపట్టడం, ఏడాది పొడవునా ఇంటర్‌ విద్యార్థులకు ప్రభుత్వం ఉచితంగా అందిస్తామన్న పాఠ్యపుస్తకాలు పంపిణీ జరగకపోవడం వంటి కారణాలతో ఇంటర్‌ ఫలితాలు ఆశించిన స్థాయిలో రావడం లేదని చెబుతున్నారు.

హైస్కూళ్లలోని ప్లస్‌-2 కళాశాలల్లో...

జిల్లాలో అనకాపల్లి మండలం కూండ్రం, పరవాడ, పాయకరావుపేట, ఎలమంచిలి జడ్పీ హైస్కూళ్లలో ప్లస్‌-2 కళాశాలలు ఉన్నాయి. కూండ్రంలో ప్రథమ సంవత్సర పరీక్షలు 19 మంది రాయగా ఆరుగురు, ద్వితీయ సంవత్సరం 10 మంది పరీక్షలు రాయగా నలుగురు ఉత్తీర్ణత సాధించారు. పరవాడ జడ్పీ హెచ్‌ఎస్‌లో 26 మందికి 8 మంది ఉత్తీర్ణులయ్యారు. ద్వితీయ ఇంటర్‌ పరీక్షకు 19 మందికి ఏడుగురు ఉత్తీర్ణులయ్యారు. పాయకరావుపేట జడ్పీలో ద్వితీయ సంవత్సరం విద్యార్థులు 20 మంది పరీక్షలు రాస్తే ఐదుగురు ఉత్తీర్ణులయ్యారు. ఎలమంచిలి జడ్పీలో 35 మంది పరీక్షలు రాయగా, 10 మంది ఉత్తీర్ణులయ్యారు. ద్వితీయ సంవత్సరంలో 13 మంది పరీక్షలకు హాజరు కాగా 9 మంది ఉత్తీర్ణులయ్యారు.

మోడల్‌ హైస్కూళ్లలో మెరుగైన ఫలితాలు

జిల్లాలో చీడికాడ, నర్సీపట్నం మండలం వేములపూడి, రావికమతం మండలం మురపాక, మునగపాక మండలం పాటిపల్లి, కశింకోట మండలం తేగాడల్లో ఏపీ మోడల్‌ స్కూళ్లు ఉన్నాయి. ఈ ఏడాది ఆయా స్కూళ్లలో ప్రథమ సంవత్సర ఇంటర్‌ పరీక్షలకు 345 మంది హాజరు కాగా 271 మంది ఉత్తీర్ణులయ్యారు. ద్వితీయ సంవత్సర విద్యార్థులు 395 మంది పరీక్షలు రాయగా 320 మంది ఉత్తీర్ణులయ్యారు.

Updated Date - Apr 13 , 2024 | 01:18 AM