గెడ్డ వాగులనూ మింగేశారు!
ABN , Publish Date - May 17 , 2024 | 12:50 AM
మండలంలో అక్రమార్కులకు అడ్డే లేకుండాపోయింది. ప్రభుత్వ భూములు, గెడ్డ వాగులను కూడా దర్జాగా కబ్జా చేసేస్తున్నారు. జీవీఎంసీ 88వ వార్డు పరిధి వెదుళ్లనరవలో గెడ్డ వాగులను కప్పేసి చదును చేసి ప్లాట్లుగా విభజించి విక్రయించేస్తున్నారు. అధికారులకు ఫిర్యాదు చేస్తున్నా పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు.
- వెదుళ్లనరవలో రెచ్చిపోతున్న అక్రమార్కులు
- జిరాయితీలో కలిపేసి ప్లాట్లు వేసి విక్రయం
- గతంలో కూల్చివేసిన కొన్ని చోట్ల మళ్లీ నిర్మాణాలు
- అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపణలు
సబ్బవరం, మే 16: మండలంలో అక్రమార్కులకు అడ్డే లేకుండాపోయింది. ప్రభుత్వ భూములు, గెడ్డ వాగులను కూడా దర్జాగా కబ్జా చేసేస్తున్నారు. జీవీఎంసీ 88వ వార్డు పరిధి వెదుళ్లనరవలో గెడ్డ వాగులను కప్పేసి చదును చేసి ప్లాట్లుగా విభజించి విక్రయించేస్తున్నారు. అధికారులకు ఫిర్యాదు చేస్తున్నా పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు.
వెదుళ్లనరవ సర్వే నంబరు 77/2లో 1.08 ఎకరాలు గెడ్డ వాగు ప్రభుత్వ భూమి ఉంది. ఆ గెడ్డ వాగును ఆనుకొని సర్వే నంబర్లు 78, 79లలో ప్రైవేటు భూమి ఉంది. దీంతో రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఆ గెడ్డ వాగును ఇటీవల కప్పేసి చదును చేసేశారు. అదే విధంగా సర్వే నంబర్లు 76, 77లను కలుపుతూ సర్వే నంబరు 98లో 2.85 ఎకరాల గెడ్డ వాగు ఉంది. గతంలో దీనిని ఆక్రమించి ప్లాట్లుగా వేసి కొంతమంది అమ్మేశారు. దీనిలో నిర్మాణాలు కూడా జరిగిపోయాయి. ఈ విషయాన్ని ‘ఆంధ్రజ్యోతి’ వెలుగులోకి తేవడంతో అధికారులు అప్పట్లో అక్కడి నిర్మాణాలను కూల్చివేశారు. కొన్ని నెలల తరువాత మళ్లీ అక్కడ నిర్మాణాలు చేపట్టేందుకు ప్రయత్నించగా స్థానికుల ఫిర్యాదు మేరకు ఇరిగేషన్ అధికారులు అడ్డుకున్నారు. అయితే ఇప్పుడు నిర్మాణాలు చేపట్టేందుకు మళ్లీ ప్రయత్నాలు జరుగుతున్నాయని స్థానికులు చెబుతున్నారు.
సర్వే నంబరు 76లో కూడా..
వెదుళ్లనరవ సర్వే నంబరు 76లో 2.2 ఎకరాల గెడ్డ వాగు ప్రభుత్వ భూమి ఉంది. ఈ సర్వే నంబరును ఆనుకొని సర్వే నంబరు 103లో ప్రైవేటు భూమి ఉంది. ఆ ప్రైవేటు భూమిని లేఅవుట్‌గా చేసి, పక్కనే ఉన్న సర్వే నంబరు 77లోని గెడ్డ వాగు స్థలం ఆక్రమించి జిరాయితీతో కలిపి లేఅవుట్ వేసి అమ్మేసుకున్నారు. దీనిని మూడేళ్ల క్రితం ‘ఆంధ్రజ్యోతి’ వెలుగులోకి తేవడంతో జీవీఎంసీ, రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు పోలీసుల సహాయంతో ఎక్స్‌కవేటర్‌తో నిర్మాణాలు కూల్చివేశారు. మళ్లీ ఇప్పుడు అక్కడ ప్రహరీ నిర్మాణాలు జరుగుతున్నాయి. అయితే ఇరిగేషన్, రెవెన్యూ శాఖల అధికారులకు ఫిర్యాదు చేసినాపట్టించుకోలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇరిగేషన్, రెవెన్యూ శాఖల్లోని కింది స్థాయి ఉద్యోగుల అండదండలతో అక్రమార్కులు రెచ్చిపోతున్నారని, ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి ప్రభుత్వ భూముల పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.