Share News

గెడ్డ భూమి కబ్జా

ABN , Publish Date - Feb 17 , 2024 | 01:13 AM

ఆనందపురం మండలం వేములవలస పంచాయతీ పరిధిలో సుమారు రూ.120 కోట్ల విలువైన పది ఎకరాలకుపైగా ప్రభుత్వ భూమిని కబ్జా చేసేందుకు అధికార పార్టీ అండదండలతో ఒక ముఠా రంగంలోకి దిగింది.

గెడ్డ భూమి కబ్జా

పక్కనే ఉన్న డి.పట్టా భూములు కూడా...

విలువ రూ.120 కోట్లు

తెర వెనుక వైకాపా నేతలు

చోద్యం చూస్తున్న రెవెన్యూ అధికారులు

ఆనందపురం ఫిబ్రవరి 16:

ఆనందపురం మండలం వేములవలస పంచాయతీ పరిధిలో సుమారు రూ.120 కోట్ల విలువైన పది ఎకరాలకుపైగా ప్రభుత్వ భూమిని కబ్జా చేసేందుకు అధికార పార్టీ అండదండలతో ఒక ముఠా రంగంలోకి దిగింది. మూడు రోజులుగా భూములు చదును చేసే కార్యక్రమం సాగుతున్నా రెవెన్యూ యంత్రాంగం చోద్యం చూస్తోంది.

వేములవలస రెవెన్యూ గ్రామం సర్వే నంబర్లు 123, 128, 129ల్లో గెడ్డ వాగు ఉంది. 129లో వాగుతో పాటు చెరువు ఉండేది. వర్షం కురిసినప్పుడు చుట్టుపక్కల గల కొండల పైనుంచి నీరు ఈ గెడ్డ ద్వారా గంభీరం జలాశయంలో చేరుతుంది. జాతీయ రహదారి పక్కనే గల ఈ గెడ్డ భూమిపై ల్యాండ్‌ మాఫియూ కన్ను పడింది. మంచి రేటు వస్తుందని యంత్రాలను ఉపయోగించి చదును చేయిస్తుంది. ఈ గెడ్డ గనుక లేకుంటే ఆనందపురం, వేములవలస, గంభీరం ప్రాంతాలు గట్టి వర్షం కురిసినప్పుడు ముంపునకు గురయ్యే ప్రమాదముంది. ఇంత ప్రమాదముందని తెలిసినా ఇరిగేషన్‌, రెవెన్యూ అధికారులు పట్టించుకోవడం లేదు. ఆక్రమణదారులు భారీ యంత్రాలతో చకచకా గెడ్డ వాగును కప్పేసి చుట్టూ ప్రహరీ గోడ నిర్మాణానికి సిద్ధమవుతున్నారు. ప్రభుత్వ భూమితో పాటు పక్కనే ఉన్న 307 సర్వే నంబరులో పేదలకు ఇచ్చిన చెందిన 15 ఎకరాల డి.పట్టా భూములను కూడా ఆక్రమించుకుంటున్నారు. ఆ భూమికి సంబంధించిన వారు ప్రశ్నిస్తే...దిక్కున్న చోట చెప్పుకోవాలని నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారు. దీంతో బాధితులు కొందరు జిల్లా కలెక్టర్‌, పోలీసులకు ఫిర్యాదు చేసినా ఎవరూ పట్టించుకోలేదు. ఈ ఆక్రమణల వెనుక వైసీపీ నేతలు ఉన్నారంటున్నారు. జేసీబీలు, లారీలను ఉపయోగించి భారీగా పనులు జరుగుతున్నా అధికారుల నుంచి కనీస స్పందన లేకపోవడానికి అదే కారణమని స్థానికులు పేర్కొంటున్నారు.

అది ప్రభుత్వ భూమి

తహసీల్దార్‌ హేమంత్‌కుమార్‌

భూముల ఆక్రమణపై ఆనందపురం తహసీల్దార్‌ హేమంతకుమార్‌ను వివరణ కోరగా...సర్వే నంబరు 129లో ఉన్నది వాగు పోరంబోకు భూమి అని తెలిపారు. భూములను చదును చేస్తున్నారని తెలిసి అక్కడకు వెళ్లి పనులు నిలుపుదల చేయించి, హెచ్చరిక బోర్డులు పెట్టామన్నారు. హెచ్చరిక బోర్డులు పెట్టినా అక్కడ నిర్మాణ పనులు జరుగుతున్నాయని చెప్పగా జేసీబీని పంపించి వాటిని కొట్టించి వేస్తామని చెప్పారు.

Updated Date - Feb 17 , 2024 | 01:13 AM