Share News

గంటా ఆస్తులు రూ.23.37 కోట్లు

ABN , Publish Date - Apr 19 , 2024 | 01:39 AM

మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు భీమిలి నియోజకవర్గం నుంచి తెలుగుదేశం అభ్యర్థిగా గురువారం నామినేషన్‌ సమర్పించారు.

గంటా ఆస్తులు రూ.23.37 కోట్లు

ఆయన పేరుతో రూ.16.31 కోట్లు

భార్య పేరిట రూ.7.06 కోట్లు

అప్పులు రూ.1.16 కోట్లు

విశాఖపట్నం, ఏప్రిల్‌ 18 (ఆంధ్రజ్యోతి):

మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు భీమిలి నియోజకవర్గం నుంచి తెలుగుదేశం అభ్యర్థిగా గురువారం నామినేషన్‌ సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన సమర్పించిన అఫిడవిట్‌లో భార్యాభర్తల పేరు మీద ఉన్న ఆస్తులు, అప్పుల వివరాలు సమర్పించారు. ఆయన పేరిట చరాస్తులు రూ.8,39,87,421 ఉండగా, స్థిరాస్తులు రూ.7,90,66,359 చూపించారు. రెండూ కలిపి రూ.16,30,53,780. ఇకపోతే ఆయన భార్య శారద పేరుతో చరాస్తులు రూ.2,96,84,154, స్థిరాస్తులు రూ.4,09,49,512 చూపించారు. రెండూ కలిపి రూ.7,06,33,666. ఇద్దరి ఆస్తులు కలిపి రూ.23,36,87,446.

రుణాలు

అప్పుల విషయానికి వస్తే గంటా శ్రీనివాసరావు ప్రకాశం జిల్లా కామేపల్లిలో పంట రుణం కింద యుబీఐ నుంచి రూ.29,97,62 తీసుకున్నారు. భార్య శారదా తన బంగారు ఆభరణాలు తనఖా పెట్టి ఎంవీపీ కాలనీలోని ఐసీఐసీఐ బ్యాంకు నుంచి రూ.85,80,571 రుణం తీసుకున్నారు. ఇద్దరికీ కలిపి రూ.1,15,78,195 అప్పులు ఉన్నాయి.

ఇవీ ఆస్తుల వివరాలు

గంటా శ్రీనివాసరావు చరాస్తుల కింద బ్యాంకుల్లో డిపాజిట్లు, షేర్లు, ఎల్‌ఐసీ బాండ్లు చూపించారు. భార్య తన వద్ద ఉన్న హారాలు, నెక్లెస్లు, వడ్డాణం తదితర బంగారు ఆభరణాలన్నీ కలిపి 2,258 గ్రాములుగా పేర్కొన్నారు. వాటి విలువ రూ.1.13 కోట్లుగా చూపించారు.

- వ్యవసాయ భూమి, నివాస భూమి, భవనాల వివరాలు వెల్లడించారు. ఎంవీపీ కాలనీలో ఇల్లు, బాలయ్యశాస్త్రి లేఅవుట్‌లో ఫ్లాటు, కృష్ణా జిల్లాలో ఇంటి స్థలం, ప్రకాశం జిల్లాలో వ్యవసాయ భూములు చూపించారు.

కేఏ పాల్‌పై ఆరు క్రిమినల్‌ కేసులు

తన వద్ద రూ.1.86 లక్షల నగదు ఉన్నట్టు పేర్కొన్న ప్రజా శాంతి అధ్యక్షుడు

విశాఖపట్నం, ఏప్రిల్‌ 18 (ఆంధ్రజ్యోతి):

విశాఖ లోక్‌సభ స్థానానికి గురువారం నామినేషన్‌ దాఖలు చేసిన ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కిలారి ఆనంద్‌పాల్‌ (కేఏ పాల్‌)...తనపై ఆరు క్రిమినల్‌ కేసులు ఉన్నట్టు అఫిడవిట్‌లో పేర్కొన్నారు. ప్రకాశం జిల్లా ఒంగోలు పోలీస్‌ స్టేషన్‌ (క్రైమ్‌ నంబరు 229/2012), విజయనగరం జిల్లా ఎల్‌.కోట (ఎఫ్‌ఐఆర్‌ నంబరు 59/2024), తెలంగాణలోని మహబూబ్‌నగర్‌ జిల్లా అడ్డకల్‌ (ఎఫ్‌ఐఆర్‌ నంబర్‌ 10/2010), రాజన్న సిరిసిల్లా జిల్లా తంగళ్లపల్లి (ఎఫ్‌ఐఆర్‌ నంబరు 99/2022), నల్లగొండ జిల్లా మునుగోడు (ఎఫ్‌ఐఆర్‌ నంబరు 122(2022), సిద్ధిపేట స్టేషన్‌ (ఎఫ్‌ఐఆర్‌ నంబరు 166/2022)లలో ఒక్కొక్క కేసు ఉంది. ఇదిలావుండగా తన వద్ద రూ.49 వేలు, హెడ్‌సీఎఫ్‌సి బ్యాంకు అక్కయ్యపాలెం బ్రాంచి, ఫెడరల్‌ బ్యాంకు విశాఖ, సికింద్రాబాద్‌ బ్రాంచీల్లో గల ఖాతాల్లో రూ.1,37,071...మొత్తం రూ.1,86,071 నగదు ఉన్నట్టు అఫిడవిట్‌లో పేర్కొన్నారు. తనకు స్థిరాస్తులు, వాహనాలు లేవని పేర్కొన్నారు. కాగా 1981లో ఇంటర్‌ పాసైన పాల్‌...అనకాపల్లి ఏఎంఎఎల్‌ కళాశాలలో డిగ్రీలో చేరి చదువుకు స్వస్తి పలికారు.

Updated Date - Apr 19 , 2024 | 07:12 AM