మహిళలకు ఉచిత ప్రయాణం
ABN , Publish Date - Jun 09 , 2024 | 12:51 AM
మహిళా ప్రయాణికులకు ఉచిత రవాణా సౌకర్యం కల్పించేందుకు ఆర్టీసీ విశాఖ రీజియన్ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
ఆర్టీసీ ఏర్పాట్లు
విశాఖ రీజియన్‌లో 579 బస్సుల్లో అనుమతి
సిటీ ఆర్డినరీ, పల్లెవెలుగు, సిటీ ఎక్స్‌ప్రెస్, మెట్రో, జేఎన్‌ఎన్‌యూఆర్‌ఎం సిటీ సర్వీస్‌లలో అవకాశం
ప్రస్తుతం రోజుకు 80 వేల మంది ప్రయాణం
ఈ సంఖ్య లక్షకు చేరుకుంటుందని అంచనా
అందుకు అనుగుణంగా బస్సుల పెంపునకు అధికారుల సన్నాహాలు
ద్వారకా బస్‌స్టేషన్, జూన్ 8:
మహిళా ప్రయాణికులకు ఉచిత రవాణా సౌకర్యం కల్పించేందుకు ఆర్టీసీ విశాఖ రీజియన్ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందుకు అవసరమైన బస్సులు ఏర్పాటు, టికెట్ ఇష్యూ మెషీన్ (టిమ్) సాఫ్ట్‌వేర్ లోడింగ్, మహిళా ప్రయాణికుల డిమాండ్ ఉన్న రూట్ల గుర్తింపు, ఆయా రూట్లలో బస్సులు పెంపు వంటి వాటిపై దృష్టిపెట్టారు. తాము అధికారంలోకి వస్తే బస్సుల్లో మహిళలు ఉచితంగా ప్రయాణించేందుకు అవకాశం ఇస్తామని తెలుగుదేశం పార్టీ ప్రకటించింది. ఈ మేరకు చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం ఉత్తర్వులు వెలువడవచ్చునని ఆర్టీసీ అధికారులు అభిప్రాయపడుతున్నారు.
579 బస్సుల్లో అనుమతించేందుకు నిర్ణయం
విశాఖ రీజియన్‌కు సంబంధించి ఐదు రకాలకు చెందిన 579 బస్సుల్లో జీరో చార్జీ టికెట్‌తో మహిళలు ప్రయాణించేందుకు అవకాశం కల్పించాలని అధికారులు నిర్ణయించారు. సిటీ ఆర్డినరీ (285 బస్సులు), పల్లెవెలుగు (3), సిటీ ఎక్స్‌ప్రెస్ (28), మెట్రో (125), జేఎన్‌ఎన్‌యూఆర్‌ఎం సిటీ సర్వీసులు (138)లలో మహిళలు ఉచితంగా ప్రయాణించవచ్చునని ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు.
విభజిత విశాఖ జిల్లాలో మధురవాడ, వాల్తేరు, విశాఖపట్నం, మద్దిలపాలెం, వాల్తేరు, గాజువాక, సింహాచలం, స్టీల్ సిటీ డిపోల్లో 721 బస్సులు ప్రయాణికులకు రవాణా సేవలందిస్తున్నాయి. ఇందులో గరుడ, గరుడ ప్లస్, అమరావతి, నైట్ రైడర్, సూపర్ లగ్జరీ, సూపర్ డీలక్స్, ఆలా్ట్ర డీలక్స్, మెట్రో ఏసీ సర్వీసులు 142 ఉన్నాయి. వీటిలో మహిళలు జీరో టికెట్‌తో ప్రయాణించే అవకాశం లేదు. మిగిలిన 579 బస్సుల్లో మహిళలు ఉచితంగా ఎక్కడికైనా ప్రయాణించవచ్చునని అధికారులు వెల్లడించారు.
బస్సుల సంఖ్య పెంచాల్సిన అవసరం ఉంది
ఉచిత రవాణా సౌకర్యం కల్పించడం వల్ల మహిళా ప్రయాణికులు పెరిగే అవకాశం ఉందని, అందుకు తగ్గట్టుగా బస్సుల సంఖ్య పెంచుకోవాలని అధికారులు భావిస్తున్నారు. ఈ విషయాన్ని ఆర్టీసీ ప్రధాన కార్యాలయానికి నివేదించారు. విశాఖ రీజియన్ అధికారుల లెక్కల ప్రకారం రీజియన్‌లో ప్రతిరోజూ 1.8 లక్షల మంది ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణిస్తున్నారు. గరుడ, గరుడ ప్లస్, అమరావతి, నైట్ రైడర్, సూపర్ లగ్జరీ, సూపర్ డీలక్స్, ఆలా్ట్ర డీలక్స్, మెట్రో ఏసీ, వంటి సర్వీస్‌లలో 20 వేల మంది ప్రయాణిస్తున్నారు. సిటీ ఆర్డినరీ, పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్, మెట్రో, జెఎన్‌ఎన్‌యూఆర్‌ఎం సర్వీసుల్లో 1.6 లక్షల మంది ప్రయాణిస్తున్నారు. ఇందులో 80 వేల మంది వరకూ మహిళలు ఉంటారని అధికారుల అంచనా. ఐదు రకాల సర్వీస్‌లలో మహిళలకు ఉచిత ప్రయాణానికి అనుమతి ఇస్తే ఆ సంఖ్య లక్షకు పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా. అందుకు తగ్గట్టుగా బస్సుల సంఖ్యను పెంచుకోవలసిన అవసరం ఉందని అభిప్రాయపడుతున్నారు.
అన్ని రూట్లలోను బస్సులుండాలి
మహిళలు ఉచితంగా ప్రయాణించేందుకు వీలుగా అన్ని రూట్లలోను బస్సులు ఉండాలని ఆర్టీసీ ప్రధాన కార్యాలయం ఇప్పటికే అన్ని రీజియన్‌లకు ఆదేశాలు ఇవ్వడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఇప్పటివరకూ ఆదాయానికి అనుగుణంగా ఆక్యుపెన్సీ అధికంగా ఉన్న రూట్లలో ఎక్కువ బస్సులు, తక్కువగా ఉన్న రూట్లలో తక్కువ బస్సులు నడిపేవారు. కానీ ఇప్పుడు మహిళా ప్రయాణికుల కేంద్రంగా రూట్లలో డిమాండ్ మేరకు బస్సులు కేటాయిస్తూ షెడ్యూలింగ్ చేయాల్సి అవసరం ఉంటుందని అధికారులు భావిస్తున్నారు.