Share News

ఉచిత విద్య...మిథ్యేనా?

ABN , Publish Date - Mar 12 , 2024 | 01:33 AM

ప్రైవేటు పాఠశాలల్లో ఉచిత ప్రవేశాలకు ప్రభుత్వం విధించిన నిబంధనలపై తల్లిదండ్రులు మండిపడుతున్నారు.

ఉచిత విద్య...మిథ్యేనా?

పేద విద్యార్థులకు ప్రైవేటు పాఠశాలల్లో ఉచిత ప్రవేశాలపై కఠిన ఆంక్షలు

కిలోమీటరు పరిధిలో ఉన్న వారికే ప్రాధాన్యం

నిబంధనలు సవరించాలంటున్న విద్యార్థుల తల్లిదండ్రులు

విశాఖపట్నం, మార్చి 11 (ఆంధ్రజ్యోతి):

ప్రైవేటు పాఠశాలల్లో ఉచిత ప్రవేశాలకు ప్రభుత్వం విధించిన నిబంధనలపై తల్లిదండ్రులు మండిపడుతున్నారు. పాఠశాలకు కిలోమీటరు పరిధిలో గల వారి దరఖాస్తులను మాత్రమే ముందుగా పరిగణనలోకి తీసుకోవాలన్న నిర్ణయాన్ని వారంతా తప్పుబడుతున్నారు. ఒకవేళ కిలోమీటరు పరిధిలో తగినన్ని దరఖాస్తులు రాకపోతే, అప్పుడు మూడు కిలోమీటర్ల పరిధిలో నివసిస్తున్న పిల్లల దరఖాస్తులు పరిగణనలోకి తీసుకుంటామనడం అన్యాయమంటున్నారు. ఈ విధంగా అయితే సీబీఎస్‌ఈ/ఐసీఎస్‌ఈ సిలబస్‌ బోధించే విశాఖ వ్యాలీ, సత్యసాయి, లిటిల్‌ ఏంజిల్స్‌, టింపనీతోపాటు నగరంలోని ప్రముఖ పాఠశాలల్లో సీట్లు పొందాలంటే శివారు ప్రాంతాల పిల్లలకు అవకాశం ఉండదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

కేంద్ర ప్రభుత్వం 2009లో తీసుకువచ్చిన విద్యా హక్కు చట్టం ప్రకారం ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటున్న, బలహీన వర్గాల పిల్లలకు ప్రైవేటు పాఠశాలల్లో ఒకటో తరగతిలో ఉచితంగా 25 శాతం సీట్లు ఇవ్వాల్సి ఉంది. ఈ చట్టం కింద సీట్లు ఇచ్చేందుకు అన్ని ప్రైవేటు పాఠశాలలు రిజిస్టర్‌ అయ్యాయి. అంతవరకు బాగానే ఉన్నా ఉచితంగా సీట్లు పొందేందుకు నిబంధనలు కఠినంగా రూపొందించారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేనంతగా ఏపీలో ప్రభుత్వ బడులు గొప్పగా ఉన్నాయని పాలకులు చెప్పుకుంటున్నప్పటికీ... ప్రైవేటు పాఠశాలల్లో పిల్లలను చేర్పించే తల్లిదండ్రుల సంఖ్య ఏటా పెరుగుతోంది. పేద వర్గాలకు చెందిన తల్లిదండ్రులు తమ పిల్లలను మంచి ప్రైవేటు పాఠశాలలో చదివించాలని భావిస్తారు. ఈ క్రమంలోనే ప్రైవేటు పాఠశాలల్లో (ఒకటో తరగతిలో) 25 శాతం సీట్లు ఉచితంగా కేటాయించాలన్న ప్రభుత్వ ప్రకటన రావడంతో ఎంతో సంతోషించారు. అయితే దరఖాస్తు చేసుకునేందుకు కఠిన నిబంధనలు విధించడంతో వారి ఆశలపై నీళ్లు చల్లినట్టయ్యింది.

రాష్ట్రంలోని విద్యార్థులంతా అంతర్జాతీయ స్థాయిలో పోటీ పడాలని పదేపదే చెబుతున్న పాలకులు, ఐబీ/సీబీఎస్‌ఈ/ ఐసీఎస్‌సీ సిలబస్‌లో బోధనకు నిర్ణయించారు. అయితే చిన్న చిన్న ప్రైవేటు పాఠశాలలు కేంద్ర ప్రభుత్వం అమలుచేసే సిలబస్‌ను బోధించడం లేదు. జాతీయ సిలబస్‌ను అమలు చేసుకోవాలని ప్రభుత్వం చెబుతున్నా నగరంలో ఇప్పటికీ మెజారిటీ ప్రైవేటు పాఠశాలల్లో రాష్ట్ర సిలబస్‌లోనే బోధన సాగుతోంది. ప్రముఖ పాఠశాలల్లోనే సీబీఎస్‌ఈ, ఐసీఎస్‌ఈ సిలబస్‌లో బోధన అందుతుంది. ఆయా పాఠశాలల్లో ఉచితంగా ప్రవేశం పొందడానికి నిబంధనలు అవరోధంగా మారాయి. అందుకు పాఠశాలకు కిలోమీటరు లేదా మూడు కిలోమీటర్ల పరిధిలో నివాసం ఉండాలని షరతు విధించింది. అది కూడా తొలుత కిలోమీటరు, ఆ తరువాత మూడు కిలోమీటర్ల పరిధిలో ఉన్న పిల్లలకు సీట్లు కేటాయిస్తారు. అంతకంటే ఎక్కువ దూరంలో ఉన్నవారు ఆయా పాఠశాలల్లో సీట్లు పొందేందుకు వీలుపడడం లేదు. ఈ నేపథ్యంలో పాఠశాలకు ఒకటి/మూడు కిలోమీటర్ల పరిధిలో ఉండాలనే నిబంధనను రద్దు చేయాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. ప్రముఖ పాఠశాలల్లో సీట్ల కోసం పోటీ పెరిగినా లాటరీ విధానం ఉంటుందని, దానివల్ల సమస్య ఉండదని భావిస్తున్నారు.

Updated Date - Mar 12 , 2024 | 01:33 AM