Share News

ఉచితం దుర్వినియోగం

ABN , Publish Date - Oct 26 , 2024 | 12:58 AM

కూటమి ప్రభుత్వం ప్రకటించిన ఉచిత విధానాన్ని కొంతమంది అక్రమార్కులు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. ఇళ్లు నిర్మించుకునే వారు సొంత అవసరాల నిమిత్తం స్థానికంగా వున్న నదులు, గెడ్డల్లో టైరు బండ్లు, ట్రాక్టర్ల ద్వారా ఉచితంగా ఇసుకను తీసుకెళ్లవచ్చని వెసులుబాటు కల్పించింది. అయితే ఇందుకు గ్రామ, వార్డు సచివాలయాల్లో అనుమతులు తీసుకోవాలి. కానీ ఉచితం మాటున పలువురు వ్యక్తులు దర్జాగా ఇసుక వ్యాపారం చేస్తున్నారు. నదులు, గెడ్డల్లో నుంచి టైరు బండ్లతో ఇసుకను బయటకు తీసుకువచ్చి సమీపంలో కుప్పలుగా నిల్వ చేస్తున్నారు. అనంతరం లారీల్లోకి లోడింగ్‌ చేసి ఇతర ప్రాంతాలకు రవాణా చేసి సొమ్ము చేసుకుంటున్నారు.

ఉచితం దుర్వినియోగం
శారదా నది తీరంలో ఇసుక తవ్వకాలతో ఏర్పడిన గోతులు

శారదా నదిలో మూలపేట వద్ద దర్జాగా ఇసుక అక్రమ తవ్వకాలు

టైరు బండ్లతో ఒడ్డుకు తరలింపు

లారీల్లోకి లోడింగ్‌ చేసి చుట్టుపక్కల ప్రాంతాలకు రవాణా

లోడు రూ.10-15 వేలకు విక్రయం

పట్టించుకోని మైనింగ్‌, రెవెన్యూ, పోలీస్‌, పంచాయతీ శాఖల అధికారులు

కొత్తూరు, అక్టోబరు 25 (ఆంధ్రజ్యోతి): కూటమి ప్రభుత్వం ప్రకటించిన ఉచిత విధానాన్ని కొంతమంది అక్రమార్కులు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. ఇళ్లు నిర్మించుకునే వారు సొంత అవసరాల నిమిత్తం స్థానికంగా వున్న నదులు, గెడ్డల్లో టైరు బండ్లు, ట్రాక్టర్ల ద్వారా ఉచితంగా ఇసుకను తీసుకెళ్లవచ్చని వెసులుబాటు కల్పించింది. అయితే ఇందుకు గ్రామ, వార్డు సచివాలయాల్లో అనుమతులు తీసుకోవాలి. కానీ ఉచితం మాటున పలువురు వ్యక్తులు దర్జాగా ఇసుక వ్యాపారం చేస్తున్నారు. నదులు, గెడ్డల్లో నుంచి టైరు బండ్లతో ఇసుకను బయటకు తీసుకువచ్చి సమీపంలో కుప్పలుగా నిల్వ చేస్తున్నారు. అనంతరం లారీల్లోకి లోడింగ్‌ చేసి ఇతర ప్రాంతాలకు రవాణా చేసి సొమ్ము చేసుకుంటున్నారు.

ప్రభుత్వం ఉచిత ఇసుకను సామాన్యులకు అందుబాటులోకి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. అయితే అనకాపల్లి జిల్లాలో ఎక్కడా అధికారికంగా ఇసుక రీచ్‌లు లేవు. రాజమహేంద్రవరం వద్ద గోదావరి నుంచి ఇసుకను రప్పించాల్సి వస్తున్నది. ఇసుక తవ్వకాలు, లోడింగ్‌, రవాణా చార్జీలు కలిసి తడిసి మోపెడవుతున్నది. దీనివల్ల సామాన్య భవన నిర్మాణదారులు ఇబ్బంది పడుతున్న విషయం ప్రభుత్వం దృష్టికి వచ్చింది. దీంతో స్థానికంగా వున్న నదులు, గెడ్డల్లో ఇసుక లభ్యతను అధికారులు గుర్తించి, తవ్వకాలకు సచివాలయాల ద్వారా అనుమతులు ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించింది. సొంతంగా ఇళ్లు నిర్మించుకునే వారు టైరు బండ్లు (ఎడ్ల బండ్లు) లేదా ట్రాక్టర్ల ద్వారా ఉచితంగా ఇసుకను తీసుకెళ్లవచ్చు. దూర ప్రాంతాలకు రవాణా చేయడం, విక్రయించడం చేయకూడదు. కానీ జిల్లాలోని పలుచోట్ల నదుల్లో ఇసుక అక్రమ తవ్వకాలు, రవాణా, అమ్మకాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. ఇదే తరహాలో అనకాపల్లి మండలం సత్యనారాయణపురం పంచాయతీ మూలపేట వద్ద శారదా నది తీరంలో ఇసుక తవ్వకాలు జోరుగా సాగుతున్నాయి. అక్రమార్కులు టైరు బండ్ల యాజమానులను ఇక్కడకు రప్పించి, నదిలో ఇసుక తవ్వించి, ఒడ్డున కుప్పలుగా పోయిస్తున్నారు. అనంతరం లారీల్లోకి లోడింగ్‌ చేయించి పరిసర ప్రాంతాలకు తరలిస్తున్నారు. లారీ ఇసుకను దూరాన్నిబట్టి రూ.10 వేల నుంచి రూ.15 వేల వరకు వసూలు చేస్తున్నారు. మూలపేట నుంచి రోజూ పదికిపైగా లారీల్లో ఇసుక రవాణా చేస్తున్నారు. సచివాలయాల నుంచి ఎటువంటి అనుమతులు లేకుండా పట్టపగలు ఇసుక తవ్వకాలు, రవాణా సాగుతున్నప్పటికీ మైనింగ్‌, రెవెన్యూ, పంచాయతీ, పోలీస్‌ అధికారులు పట్టించుకోవడంలేదు.

తాగునీటి పంపుహౌస్‌ ముప్పు

అనకాపల్లి పట్టణ ప్రజలకు తాగునీటిని అందించేందుకు తుమ్మపాల వద్ద శారదా నదిలో పంప్‌హౌస్‌ వుంది. దీనికి అతిచేరువలో యథేచ్ఛగా ఇసుక తవ్వకాలు జరుపుతుండడంతో భారీ గోతులు ఏర్పడుతున్నాయి. వీటి వల్ల తాగునీటి పథకం పంప్‌హౌస్‌కు ముప్పు పొంచి వుందని స్థానికులు అంటున్నారు.

కాగా సత్యనారాయణపురం పంచాయతీ మూలపేట వద్ద శారదా నదిలో ఇసుక అక్రమ తవ్వకాలపై తహసీల్దార్‌ కె.విజయ్‌కుమార్‌ను ‘ఆంధ్రజ్యోతి’ వివరణ కోరగా.. ఉచితంగా ఇసుక తీసుకువెళ్లాలంటే అనుమతి తప్పనిసరిగా ఉండాలని స్పష్టం చేశారు. గృహ నిర్మాణదారుడు, తన పరిధిలోని గ్రామ/ వార్డు సచివాలయంలో దరఖాస్తు చేసుకోవాలని చెప్పారు. దానిని ఇంజనీరింగ్‌ సిబ్బంది పరిశీలించి సంబంధిత ఇంటి నిర్మాణానికి ఎంత మేరకు ఇసుక అవసరమవుతుందో అంచనా వేసి, ఆ మేరకు సచివాలయం కార్యదర్శి అనుమతి ఇస్తారని తెలిపారు. మూలపేట వద్ద శారదా నదిలో ఇసుక తవ్వకాలకు తాము ఎవరికీ అనుమతులు ఇవ్వలేదని, సిబ్బందిని అక్కడకు పంపించి పరిశీలిస్తామని ఆయన తెలిపారు.

Updated Date - Oct 26 , 2024 | 12:58 AM