Share News

అడవుల్లో అగ్నిప్రమాదాల నివారణకు కార్యాచరణ

ABN , Publish Date - Mar 01 , 2024 | 12:39 AM

అడవుల్లో అగ్నిప్రమాదాలు సంభవించకుండా ప్రత్యేక కార్యాచరణ ప్రారంభించామని డివిజనల్‌ ఫారెస్టు అధికారి(డీఎఫ్‌వో) చిట్టపుల్లి సూర్యనారాయణ తెలిపారు. గురువారం డివిజన్‌ స్థాయి అటవీశాఖ ఉద్యోగులతో ఆయన సమావేశమయ్యారు.

అడవుల్లో అగ్నిప్రమాదాల నివారణకు కార్యాచరణ
మాట్లాడుతున్న డీఎఫ్‌వో సూర్యనారాయణ

డీఎఫ్‌వో సూర్యనారాయణ

చింతపల్లి, ఫిబ్రవరి 29: అడవుల్లో అగ్నిప్రమాదాలు సంభవించకుండా ప్రత్యేక కార్యాచరణ ప్రారంభించామని డివిజనల్‌ ఫారెస్టు అధికారి(డీఎఫ్‌వో) చిట్టపుల్లి సూర్యనారాయణ తెలిపారు. గురువారం డివిజన్‌ స్థాయి అటవీశాఖ ఉద్యోగులతో ఆయన సమావేశమయ్యారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ చింతపల్లి డివిజన్‌ పరిధి రిజర్వుడ్‌ ఫారెస్టు భూముల్లో 788 ప్రాంతాల్లో అగ్నిప్రమాదాలు సంభవిస్తున్నట్టు భారత ప్రభుత్వం నివేదిక ఇచ్చిందన్నారు. గత ఏడాది 769 ప్రాంతాల్లో అగ్నిప్రమాదాలు సంభవించాయన్నారు. భారత ప్రభుత్వం శాటిలైట్‌ ద్వారా అగ్నిప్రమాదాలను గుర్తించి ఏపీ ప్రభుత్వానికి వెంటనే నివేదిక పంపిస్తుందని, ఏపీ ప్రభుత్వం సంబంధిత డివిజన్‌ పరిధి అటవీశాఖ అధికారులకు సమాచారం పంపిస్తుందన్నారు. దీంతో వెంటనే అటవీశాఖ అధికారులు సంఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపుచేసేందుకు చర్యలు తీసుకుంటారన్నారు. గత ఏడాది ఫిబ్రవరి వరకు 200 ప్రాంతాల్లో అగ్నిప్రమాదాలు సంభవించగా, ఈ ఏడాది కేవలం 28 ప్రాంతాల్లో మాత్రమే అగ్నిప్రమాదాలు సంభవించాయన్నారు. అగ్నిప్రమాదాలను నియంత్రించేందుకు అటవీశాఖ ఉద్యోగులు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారని చెప్పారు. ప్రస్తుత సీజన్‌లో చెట్ల నుంచి ఆకులు రాలిపోతాయని, వేట, బొడ్డెంగుల కోసం అడవికి వెళ్లిన ఆదివాసీలు అగ్గి పెట్టుకుని ఆర్పివేయకుండా వచ్చేయడం వల్ల అడవులు తగలబడుతున్నాయన్నారు. ప్రధానంగా వెదురు మొక్కలు కలిగిన ప్రాంతంలో అగ్నిప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. డివిజన్‌లోని సీలేరు, ఆర్‌వీనగర్‌, చింతపల్లి, మర్రిపాకలు(డౌనూరు) రేంజ్‌ల పరిధిలో అగ్నిప్రమాద ప్రాంతాలు అధికంగా ఉండడంతో సంబంధిత పరిధి అటవీశాఖ ఉద్యోగులను అప్రమత్తం చేశామని తెలిపారు. అటవీశాఖ ఉద్యోగులు గిరిజన గ్రామాల్లో అవగాహన సదస్సులు, శిబిరాలు ఏర్పాటు చేస్తున్నారన్నారు. ప్రత్యేకంగా రూపొందించిన కరపత్రాలను విస్తృతంగా పంపిణీ చేస్తున్నామన్నారు. అడవిలోకి వెళ్లిన సమయంలో ఎక్కడా మంట పెట్టరాదని, ఈ విధంగా చేయడం వల్ల అడవులు తగలబడిపోతున్నాయని చైతన్యం కల్పిస్తున్నట్టు చెప్పారు. అడవుల్లో అటవీశాఖ ఉద్యోగులు ఫైర్‌లైన్‌ క్లియరెన్స్‌ పనులు ప్రారంభించాలని ఆదేశాలు జారీ చేశామన్నారు. ఈ కార్యక్రమంలో చింతపల్లి, పెదవలస రేంజ్‌ అధికారులు పాత్రుడు, జగదీశ్వరరావు పాల్గొన్నారు.

Updated Date - Mar 01 , 2024 | 12:39 AM