Share News

విదేశీ విద్య...మిథ్య!

ABN , Publish Date - May 08 , 2024 | 01:58 AM

విదేశీ విద్యకు జగన్‌ ఎగనామం పెట్టారు. అధికారంలోకి వచ్చిన తరువాత మూడేళ్లపాటు పథకాన్ని పూర్తిగా నిలిపివేశారు.

విదేశీ విద్య...మిథ్య!

పథకానికి జగన్‌ ఎగనామం

వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత మూడేళ్లు నిలిపివేత

తీవ్ర విమర్శల నేపథ్యంలో అమలు

కొర్రీలు, నిబంధనలతో అనర్హులైన విద్యార్థులు

రెండేళ్లలో 29 మందికి మాత్రమే అవకాశం

టీడీపీ హయాంలో జిల్లాలో 238 మందికి ఆర్థిక సాయం

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

విదేశీ విద్యకు జగన్‌ ఎగనామం పెట్టారు. అధికారంలోకి వచ్చిన తరువాత మూడేళ్లపాటు పథకాన్ని పూర్తిగా నిలిపివేశారు. ఆ తరువాత పెద్దఎత్తున విమర్శలు రావడంతో అమలుకు సిద్ధమయ్యారు. అయితే అనేక కొర్రీలు పెట్టడంతో జిల్లావ్యాప్తంగా వందలాది మంది విద్యార్థులు పథకానికి దూరమయ్యారు. లబ్ధిదారుల సంఖ్యను కుదించేందుకే ముఖ్యమంత్రి జగన్‌ అడ్డగోలు నిబంధనలు పెట్టారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించాలన్న కోరిక ఉన్న నిరుపేద విద్యార్థులకు ఆర్థికంగా సహాయాన్ని అందించేందుకు తెలుగుదేశం ప్రభుత్వం పథకాన్ని రూపొందించింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా వందలాది మంది విద్యార్థులు ఆర్థిక సహాయాన్ని పొంది అనేక దేశాలకు వెళ్లారు. 2019లో అధికారంలోకి వచ్చిన వైసీపీ ఈ పథకాన్ని పూర్తిగా నిలిపివేసింది. దీంతో విదేశాల్లో చదివే అవకాశాన్ని విద్యార్థులు కోల్పోయారు. ప్రతిపక్షాలు, విద్యార్థుల నుంచి విమర్శలు రేగడం, ఈ విషయం ప్రజల్లోకి బలంగా వెళ్లడంతో అధికార పార్టీ అప్రమత్తమైంది. 2022-23 విద్యా సంవత్సరం నుంచి పథకాన్ని అమలు చేస్తున్నట్టు ప్రకటించింది. ఈ మేరకు దరఖాస్తులను స్వీకరించింది.

కొర్రీల మీద కొర్రీలు

దరఖాస్తు చేసేందుకు వెళితేగానీ విద్యార్థులకు ప్రభుత్వ ఆలోచన బోధపడలేదు. పథకాన్ని ప్రారంభించినా విద్యార్థుల సంఖ్య పెరగకుండా అడ్డగోలు నిబంధనలు అమలుచేసింది. దీంతో అన్నిరకాల అర్హతలు ఉండీ పథకానికి అనర్హులుగా మారిపోయామన్న ఆవేదన వారిలో కనిపించింది. ఈ పథకంలో భాగంగా సాయాన్ని పొందాలనుకునే విద్యార్థులకు 2022-23 విద్యా సంవత్సరంలో క్యూఎస్‌ ర్యాకింగ్స్‌లో 100లోపు ఉన్న యూనివర్సిటీల్లో సీటు రావాలని ప్రభుత్వం నిబంధన పెట్టింది. 2023-24 విద్యా సంవత్సరానికి సంబంధించి లబ్ధి పొందాలంటే 50లోపు ర్యాంకు కలిగిన యూనివర్సిటీలో సీటు రావాలని ప్రకటించింది. ఈ నిబంధనతోనే ఎంతోమంది విద్యార్థులు పథకానికి దూరమయ్యారు.

టీడీపీ హయాంలో ఎంతో మేలు

గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో 200లోపు ర్యాంకు కలిగిన విశ్వవిద్యాలయాల్లో సీటు లభించిన ప్రతి ఒక్కరికీ ఆర్థిక సహాయాన్ని అందించారు. ఏ సబ్జక్టులో అయినా చేరేందుకు అప్పట్లో అవకాశం కల్పించగా, వైసీపీ సర్కార్‌ ప్రత్యేకంగా పేర్కొన్న 21 సబ్జక్టుల్లో మాత్రమే ఉన్నత విద్యకు అవకాశాన్ని కల్పించింది. దీనివల్ల మరింతమంది విద్యార్థులు అనర్హులుగా మారిపోయారు. విద్యార్థి పూర్తిచేసిన కోర్సులో అన్నింటా కలిపి 60 శాతం మార్కులు రావాలని, అంతకంటే తక్కువ ఉంటే పథకానికి అనర్హులుగా ప్రకటించింది. ఇది కూడా విద్యార్థుల సంఖ్యను తగ్గించే ఎత్తుగడలో భాగమేనని పలువురు పేర్కొన్నారు. విదేశాల్లో ఎంబీబీఎస్‌ చేసే విద్యార్థులు నీట్‌లో తప్పనిసరిగా అర్హత సాధించాలన్నది మరో నిబంధన. అయితే నీట్‌లో మంచి ర్యాంకు వస్తే దేశంలోనే ఎంబీబీఎస్‌ పూర్తిచేస్తామని, ఇతర దేశాలకు వెళ్లాల్సిన అవసరం ఏమిటని విద్యార్థులు ప్రశ్నిస్తున్నారు. ఈ తరహా నిబంధనలు పథకానికి దూరం చేయడానికేనని పేర్కొంటున్నారు.

రెండేళ్లలో 29 మందికే

గత రెండేళ్లుగా పథకాన్ని అమలు చేస్తుండగా జిల్లాలో కేవలం 29 మందికి మాత్రమే ప్రభుత్వం ఆర్థిక సహాయాన్ని అందించింది. 2022-23 విద్యా సంవత్సరంలో 19 మందికి, 2023-24 విద్యా సంవత్సరంలో పది మందికి మాత్రమే పథకం వర్తించింది. అదే టీడీపీ ప్రభుత్వ హయాంలో 238 మంది విద్యార్థులు విదేశీ విద్యా దీవెన పథకంలో భాగంగా రూ.22.89 కోట్ల ఆర్థిక సహాయాన్ని అందుకున్నారు.

Updated Date - May 08 , 2024 | 01:58 AM