Share News

వలంటీర్లకు వైసీపీ నేతల వల

ABN , Publish Date - Jan 11 , 2024 | 01:42 AM

సాధారణ ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో వార్డు/గ్రామ వలంటీర్లపై వైసీపీ నేతల కన్ను పడింది. వలంటీర్ల ద్వారా ఓటర్ల వివరాలు, కుటుంబాల నేపథ్యం, ఏ పార్టీకి మొగ్గు చూపుతున్నారనే సమాచారం పక్కాగా తెలుసుకోవచ్చు. అవసరమైతే ఓటర్లకు డబ్బుల పంపిణీ వంటి కార్యక్రమాలకు కూడా సహకారం తీసుకోవచ్చు. ఇలా అన్ని విధాలుగా ఉపయోగపడతారనే ఉద్దేశంతోనే వారిని మచ్చిక చేసుకోవడానికి వైసీపీ ఎమ్మెల్యేలు/సమన్వయకర్తలు అప్పుడే ప్రయత్నాలు ప్రారంభించారు.

వలంటీర్లకు  వైసీపీ నేతల వల

ఎన్నికల్లో ఉపయోగపడతారని తాయిలాలు

వలంటీర్లు, సచివాలయాల సిబ్బందికి

ముత్తంశెట్టి సంక్రాంతి కానుకలు

ఉద్యోగావకాశాలు కల్పిస్తామంటూ

‘నార్త్‌’ ఇన్‌చార్జి కేకే రాజు కార్యాలయంలో

తాజాగా ఇంటర్వ్యూలు

70 మంది హాజరు...16 మంది ‘ఐ ప్యాక్‌’కు ఎంపిక

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

సాధారణ ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో వార్డు/గ్రామ వలంటీర్లపై వైసీపీ నేతల కన్ను పడింది. వలంటీర్ల ద్వారా ఓటర్ల వివరాలు, కుటుంబాల నేపథ్యం, ఏ పార్టీకి మొగ్గు చూపుతున్నారనే సమాచారం పక్కాగా తెలుసుకోవచ్చు. అవసరమైతే ఓటర్లకు డబ్బుల పంపిణీ వంటి కార్యక్రమాలకు కూడా సహకారం తీసుకోవచ్చు. ఇలా అన్ని విధాలుగా ఉపయోగపడతారనే ఉద్దేశంతోనే వారిని మచ్చిక చేసుకోవడానికి వైసీపీ ఎమ్మెల్యేలు/సమన్వయకర్తలు అప్పుడే ప్రయత్నాలు ప్రారంభించారు. దీనికి భీమిలి ఎమ్మెల్యే ముత్తంశెట్టి శ్రీనివాసరావు మంగళవారం శ్రీకారం చుట్టారు. పీఎం పాలెంలోని కల్యాణ మండపంలో నాలుగు వార్డులకు చెందిన 800 మంది వలంటీర్లను, సచివాలయ సిబ్బందిని పిలిచి వారందరికీ సంక్రాంతి సందర్భంగా నూతన వస్త్రాలు అందించారు. వారి సేవలను కొనియాడారు. పార్టీకి నమ్మకంగా పనిచేస్తున్నారని, ఇదే అనుబంధం కొనసాగించాలని కోరారు. ఇక ఉత్తర నియోజకవర్గం విషయానికి వస్తే ఇక్కడ పార్టీ సమన్వయకర్త కేకే రాజు మరో అడుగు ముందుకు వేశారు. వలంటీర్లకు ఏకంగా ఉద్యోగాలే ఇస్తామని ఆశలు కల్పించారు. వలంటీర్లలో డిగ్రీ పాసై, కంప్యూటర్‌ పరిజ్ఞానం ఉన్నవారు ఉత్తర నియోజకవర్గం పార్టీ కార్యాలయంలో ఇంటర్వ్యూలకు హాజరు కావాలని ఆయా గ్రూపుల్లో పిలుపునిచ్చారు. దీనికి స్పందించి సుమారు 70 మంది వలంటీర్లు బుధవారం ఇంటర్వ్యూలకు హాజరయ్యారు. వారిలో సుమారు 16 మందికి తొలి విడతగా ఉద్యోగాలు అవకాశాలు కల్పించనున్నట్టు తెలిపారు. వైసీపీకి తెర వెనుక సేవలు అందిస్తున్న ఐ ప్యాక్‌కు కొంతమంది సిబ్బంది అవసరమని, వారి కోసం ఈ నియామకాలు చేస్తున్నామని, నెలకు రూ.15 వేలు ఇస్తామని వలంటీర్లకు తెలిపారు. ఇలా దశల వారీగా అవకాశం కల్పిస్తామని, ఐ ప్యాక్‌లో అవకాశాలు లేకపోతే, తామే కొందరిని తీసుకుంటామని భరోసా ఇచ్చినట్టు తెలిసింది. అసెంబ్లీ ఎన్నికలు ముగిసేంత వరకు తాము చెప్పినట్టు పనిచేయాల్సి ఉంటుందని, ఓటర్ల జాబితాల తయారీ, ఇంటింటికీ అభ్యర్థి తరపున ప్రత్యేక ప్రచారం, ఆ తరువాత ఇతరత్రా కార్యక్రమాలు చేపట్టాల్సి ఉంటుందని, ప్రస్తుతం ప్రభుత్వం ఇస్తున్న గౌరవ వేతనానికి సమానంగా తాము జీతం ఇస్తామని చెబుతున్నారు. అంటే నగరంలో వైసీపీ అభ్యర్థులు ప్రభుత్వం తరపున పనిచేస్తున్న వలంటీర్లను వారి స్వప్రయోజనాలకు ఉపయోగించుకోవడానికి సిద్ధమవుతున్నారు. ఇందుకు ఎంతవరకు నిబంధనలు అంగీకరిస్తాయనేది జిల్లా అధికారులే తేల్చాలి. ఆది నుంచి వలంటీర్లను వైసీపీ నేతలు తమ పార్టీ మనుషుల్లా చూస్తోంది. ఇప్పుడు ఎన్నికలకు ఉపయోగించుకోవడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. దీనిని ఎన్నికల సంఘం ఆమోదిస్తుందా? చర్యలు తీసుకుంటుందా? అనేది వేచి చూడాలి.

Updated Date - Jan 11 , 2024 | 01:42 AM