సేఫ్టీ ఆఫీసర్ల నియామకంపై దృష్టి
ABN , Publish Date - Aug 24 , 2024 | 01:31 AM
పరిశ్రమల్లో ప్రమాదాలు నివారించడానికి సేఫ్టీ ఆఫీసర ్ల(భద్రత అధికారులు)ను నియమించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.
మార్గదర్శకాల తయారీకి సీఎం ఆదేశం
ఎంత మంది ఉండాలనే అంశంపై సమాలోచనలు
(విశాఖపట్నం, ఆంధ్రజ్యోతి)
పరిశ్రమల్లో ప్రమాదాలు నివారించడానికి సేఫ్టీ ఆఫీసర ్ల(భద్రత అధికారులు)ను నియమించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఎసెన్షియా ఫార్మాలో ఆవిరి మేఘాలతో పేలుడు సంభవించి 17 మంది మరణించడంతో సేఫ్టీ ఆఫీసర్ ప్రాధాన్యాన్ని ప్రభుత్వం గుర్తించింది. అక్కడ సేఫ్టీ సూపర్‌వైజర్ ఎవరూ లేకపోవడం వల్ల భారీ మూల్యం చెల్లించుకోవలసి వచ్చిందని తేలింది. వాస్తవానికి వెయ్యి మంది ఉద్యోగులున్న ప్రతి పరిశ్రమ క్వాలిఫైడ్ సేఫ్టీ ఆఫీసర్‌ని నియమించుకోవాలి. ఆ తరువాత ప్రతి రెండు వేల మందికి అదనంగా మరో సేఫ్టీ ఆఫీసర్ ఉండాలి. స్టీల్‌ప్లాంటు, హెచ్‌పీసీఎల్ వంటి సంస్థల్లో వేల సంఖ్యలో ఉద్యోగులుంటారు. ఆయా చోట్ల వీరి సంఖ్య అందుకు తగ్గట్టుగా ఉండాలి. అయితే వారికి జీతభత్యాలు ఎక్కువగా చెల్లించాల్సి ఉంటుంది. దీంతో చాలా సంస్థలు నియమించుకోవడం లేదు. ఉన్నవారిలో ఒకరిద్దరికి శిక్షణ ఇప్పించి ‘సేఫ్టీ సూపర్‌వైజర్’ హోదా ఇచ్చి పని చేయించుకుంటున్నాయి. రాష్ట్రంలో ఉద్యోగుల సంఖ్యకు, సేఫ్టీ ఆఫీసర్ల సంఖ్యకు పొంతన లేదని అధికారుల పరిశీలనలో తేలింది. ఇదే విషయాన్ని కార్మిక శాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్లడంతో ఆయన సీఎం చంద్రబాబు నాయుడుకు సమస్యను వివరించారు. దాంతో వారి నియామకంపై కసరత్తు చేయాలని ఆదేశించారు.
ఇవీ విధులు
సంస్థలో ప్రమాదాలు జరగకుండా సేఫ్టీ ఆఫీసర్ ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి. నిబంధనలకు అనుగుణంగా భద్రతా ప్రమాణాలుండేలా చూడాలి. ఫైర్ ఫైటింగ్ ఎక్విప్‌మెంట్, ఎక్సటింగ్‌విషర్స్ సిద్ధంగా ఉంచాలి. రెగ్యులర్‌గా మాక్ డ్రిల్స్ నిర్వహించాలి. ప్రమాదకరమైన విభాగాల్లో పనిచేసే ఉద్యోగులకు పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్‌మెంట్ ఇచ్చి, ఉపయోగించేలా చూడాలి. మండే స్వభావం, పేలే గుణం కలిగిన కెమికల్స్, సాల్వెంట్లు, పౌడర్లు వినియోగించే పరిశ్రమల్లో కార్మికులకు వాటిపై అవగాహన కల్పించాలి. ప్రమాదం జరిగితే ఎలా స్పందించాలో శిక్షణ ఇవ్వాలి. ఇకనుంచీ ప్రతి సంస్థలో ఈ విభాగంలో శిక్షణ పొందిన వారి పర్యవేక్షణలో పనిచేసేలా చర్యలు తీసుకుంటామని పరిశ్రమల శాఖ ఉన్నతాధికారి ‘ఆంఽధ్రజ్యోతి’కి తెలిపారు.
పరిశ్రమల భద్రతపై నేడు సమావేశం
విశాఖపట్నం, ఆగస్టు 23 (ఆంధ్రజ్యోతి): ఎసెన్షియా కర్మాగారంలో ఘోర ప్రమాదం జరిగి 17 మంది ప్రాణాలు కోల్పోయిన ఘటనతో విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల యంత్రాంగాలు అప్రమత్తమయ్యాయి. ఈ నేపథ్యంలో పరిశ్రమల భద్రతపై శనివారం ఉదయం అనకాపల్లి కలెక్టరేట్‌లో, మధ్యాహ్నం మూడుగంటలకు విశాఖ కలెక్టరేట్‌లో సమావేశం నిర్వహించనున్నారు. పరిశ్రమల్లో పాటించాల్సిన భద్రతా చర్యలు, శిక్షణ, ఇతర అంశాలపై అధికారులు, పరిశ్రమల ప్రతినిధులు చర్చించనున్నారు. ఈనేపథ్యంలో కఠినమైన నిర్ణయాలతో ప్రణాళిక రూపొందించాలని జిల్లా వాసులు కోరుతున్నారు.