Share News

ఆదాయంపైనే దృష్టి.. అభివృద్ధి నాస్తి

ABN , Publish Date - Feb 07 , 2024 | 12:51 AM

పాడేరు మండలంలోని వంజంగి హిల్స్‌ తక్కువ సమయంలో విశేష పర్యాటక ఆదరణ పొందింది. పొరుగు రాష్ట్రాల నుంచి కూడా అధిక సంఖ్యలో పర్యాటకులు వస్తుంటారు. అయితే దీని అభివృద్ధిపై వైసీపీ ప్రభుత్వం కనీసం దృష్టి సారించలేదు. కానీ దీని ప్రవేశ రుసుము ద్వారా వచ్చే ఆదాయంతో పరిసర ప్రాంతాల్లో పలు అభివృద్ధి పనులు చేపట్టాలని నిర్ణయించడం విమర్శలకు తావిస్తోంది.

ఆదాయంపైనే దృష్టి.. అభివృద్ధి నాస్తి
వంజంగి హిల్స్‌కు వెళ్లే రోడ్డు ఇలా..

- వంజంగి హిల్స్‌పై కనీస వసతులు కరువు

- హామీలే తప్ప నిధులు ఇవ్వని వైసీపీ ప్రభుత్వం

- కానీ ప్రవేశ రుసుము ద్వారా వచ్చే సొమ్ముతో పరిసర ప్రాంతాలు అభివృద్ధి చేయాలని నిర్ణయం

- సర్కారు నిర్ణయంపై వెల్లువెత్తుతున్న విమర్శలు

(ఆంధ్రజ్యోతి- పాడేరు)

పాడేరు మండలంలోని వంజంగి హిల్స్‌ తక్కువ సమయంలో విశేష పర్యాటక ఆదరణ పొందింది. పొరుగు రాష్ట్రాల నుంచి కూడా అధిక సంఖ్యలో పర్యాటకులు వస్తుంటారు. అయితే దీని అభివృద్ధిపై వైసీపీ ప్రభుత్వం కనీసం దృష్టి సారించలేదు. కానీ దీని ప్రవేశ రుసుము ద్వారా వచ్చే ఆదాయంతో పరిసర ప్రాంతాల్లో పలు అభివృద్ధి పనులు చేపట్టాలని నిర్ణయించడం విమర్శలకు తావిస్తోంది.

సహజ సిద్ధమైన సుందర సందర్శనీయ ప్రదేశంగా గుర్తింపు పొందిన వంజంగి హిల్స్‌ను అభివృద్ధి చేస్తామని గతంలో పర్యాటక శాఖా మంత్రిగా పని చేసిన ముత్తంశెట్టి శ్రీనివాసరావు, ప్రస్తుత ఐటీ, పరిశ్రమలు, జిల్లా ఇన్‌చార్జి మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ హామీ ఇచ్చారు. కానీ దాని అభివృద్ధికి ఎవరూ కృషి చేసిన దాఖలాలు లేవు.

రూ.25 లక్షలతో అభివృద్ధి పనులు

వంజంగి హిల్స్‌ సందర్శకుల నుంచి ప్రవేశ రుసుముగా వసూలు చేయడం ద్వారా వచ్చిన పర్యాటక నిధుల్లో రూ.25 లక్షలతో వంజంగి, లగిశపల్లి, కాడెలి పంచాయతీల పరిధిలో పలు పనులు చేపట్టాలని అధికారులు నిర్ణయించారు. వంజంగి పంచాయతీ పరిధిలోని స్కూల్‌ భవనాలకు మరమ్మతులు, గ్రామాల్లో సీసీ రోడ్లు, వంజంగిలో వీధి దీపాలు, తదితర పనులను రూ.13 లక్షల 3 వేలతో చేపట్టనున్నారు. అలాగే లగిశపల్లి పంచాయతీ పరిధిలో పారిశుధ్య నిర్వహణకు అవసరమైన సామగ్రి, కాల్వలకు మరమ్మతులు, లగిశపల్లిలో వీధి దీపాలను రూ.5 లక్షల 31 వేల వ్యయంతో ఏర్పాటు చేయనున్నారు. కాడెలి పంచాయతీ పరిధిలో స్కూల్‌ భవనాలకు మరమ్మతులు, సీసీరోడ్లు, కాడెలిలో వీధి దీపాలను రూ.6 లక్షల 66 వేలతో ఏర్పాటు చేయాలని అధికారులు నిర్ణయించారు. వాస్తవానికి ఆయా అభివృద్ధి పనులకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి నిధులు మంజూరు కావాల్సి ఉంది. అయితే ప్రభుత్వం నుంచి నిధులు వచ్చే పరిస్థితి లేదు. దీంతో పర్యాటకం ద్వారా వచ్చిన సొమ్ముతోనైనా ఆయా పనులు చేయాలని అధికారులు నిర్ణయం తీసుకున్నారు.

వంజంగి హిల్స్‌ అభివృద్ధి ఊసే లేదు

వంజంగి హిల్స్‌ అభివృద్ధిపై అధికారులు కనీస చర్యలు చేపట్టకపోవడం విమర్శలకు తావిస్తున్నది. ఇప్పటికీ వంజంగి మేఘాల కొండల వద్ద తాగునీరు, మరుగుదొడ్లు వంటి కనీస సదుపాయాలు లేవు. అలాగే వంజంగి గ్రామం నుంచి కొండపైకి వెళ్లేందుకు పక్కా రోడ్డు లేదు. వంజంగి హిల్స్‌ సహజ సిద్ధంగా ఏర్పడిందే తప్ప ప్రభుత్వపరంగా అక్కడ పర్యాటకులకు గాని, స్థానికులకు గాని ఉపయోగపడే ఒక్క పనిని ప్రభుత్వం చేయలేదు. కానీ దాని ద్వారా వచ్చే ఆదాయంపై మాత్రం ప్రత్యేక దృష్టిసారిస్తోంది. కాగా ప్రవేశ రుసుము ద్వారా వచ్చిన సొమ్మును వంజంగి హిల్స్‌ అభివృద్ధికి వెచ్చించకపోవడం విమర్శలకు తావిస్తోంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి వంజంగి హిల్స్‌ అభివృద్ధికి చర్యలు చేపట్టాలని పలువురు కోరుతున్నారు.

Updated Date - Feb 07 , 2024 | 12:51 AM