Share News

ఫ్లూ పరేషాన్‌

ABN , Publish Date - Feb 27 , 2024 | 01:53 AM

నగరంలో ఫ్లూ వైరస్‌ వ్యాప్తి చెందుతోంది.

ఫ్లూ పరేషాన్‌

నగరంలో పెరుగుతున్న జ్వరాలు

దగ్గు, జలుబు, ఒళ్లునొప్పులు వంటి లక్షణాలు

గడచిన పది రోజుల నుంచి రెట్టింపు కేసులు రాక

డయేరియా కూడా...

కలుషిత నీరు, ఆహారం తీసుకోవడమే కారణం

అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్న వైద్యులు

విశాఖపట్నం, ఫిబ్రవరి 25 (ఆంధ్రజ్యోతి):

నగరంలో ఫ్లూ వైరస్‌ వ్యాప్తి చెందుతోంది. వాతావరణంలో మార్పుల కారణంగా ఫ్లూ వైరస్‌ యాక్టివ్‌ అయ్యి జ్వరాల బారినపడుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. జ్వరంతోపాటు ఎక్కువ మందిలో జలుబు, గొంతునొప్పి, గవదలు, ఒళ్లు నొప్పులు, వాంతులు, విరేచనాలు వంటివి కనిపిస్తున్నాయి. చిన్నారుల్లో గొంతునొప్పి, జ్వరం, విరేచనాల సమస్య అధికంగా ఉంటోంది. గడిచిన వారం రోజుల నుంచి ఈ తరహా లక్షణాలతో వస్తున్న రోగుల సంఖ్య పెరిగినట్టు వైద్యులు చెబుతున్నారు. కొద్దిరోజులుగా ఎండ తీవ్రత పెరిగింది. సీజన్‌ మారుతున్న క్రమంలో ఫ్లూ వైరస్‌ యాక్టివ్‌ అయ్యిందని, దీనివల్ల జ్వరాలు వస్తున్నాయని వైద్యులు చెబుతున్నారు. లక్షణాలు మూడు నుంచి ఐదు రోజులు ఉంటాయని...అంతకు మించి ఉంటే మాత్రం వైద్యులను సంప్రతించాలని సూచిస్తున్నారు.

ఇక నగరంలో డయేరియా కూడా కనిపిస్తోంది. కలుషిత ఆహారం, నీరు తీసుకోవడం కారణంగా వైద్యులు చెబుతున్నారు. ఎండ వేడిమి నుంచి ఉపశమనం పొందేందుకు బయట చల్లని పానీయాలు తీసుకోవడం వల్ల ఈ తరహా ఇబ్బందులు తలెత్తుతాయని, చిన్నారులు, వృద్ధుల విషయంలో అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. కాచి, చల్లార్చిన నీళ్లను తీసుకోవడం వల్ల ఈ సమస్యకు చెక్‌ చెప్పవచ్చునని చెబుతున్నారు. వీలైనంత వరకు బయట ఆహారానికి దూరంగా ఉంచాలని సూచిస్తున్నారు.

మరిన్ని కేసులు పెరిగే చాన్స్‌

సీజన్‌ మారుతున్న క్రమంలో ఎండ వేడి ఇప్పుడిప్పుడే పెరుగుతోంది. మరో రెండు నుంచి మూడు వారాలపాటు జ్వరాలు అధికంగా ఉండే అవకాశముందని చెబుతున్నారు. గతంతో పోలిస్తే చిన్నారుల్లో డయేరియా సమస్య ఇప్పుడు ఎక్కువగా కనిపిస్తున్నట్టు వైద్యులు చెబుతున్నారు. అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. జ్వర లక్షణాలతో సాధారణ రోజుల్లో 20 మంది వరకు వస్తే, గడిచిన పది రోజుల నుంచి ఈ సంఖ్య 40 వరకు పెరిగిందని డాక్టర్‌ జ్ఞానసుందరరాజు తెలిపారు. ఆహారం, నీటి విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన సూచించారు.

అనవసరమైన మందులు వాడొద్దు..ఐదు రోజుల్లో నయం

- డాక్టర్‌ సోమయాజులు, జనరల్‌ ఫిజీషియన్‌

ఫ్లూ వైరస్‌ కారణంగా జ్వరాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. గడచిన పది రోజుల రెండు రెట్లు అధికంగా కేసులు నమోదవుతున్నాయి. జ్వరం, దగ్గు, జలుబు, ఒళ్లు నొప్పులు వంటి లక్షణాలు ఉంటున్నాయి. ఐదు రోజుల్లో జ్వరం తగ్గుముఖం పడుతుంది. పారాసిట్మాల్‌ వేసుకుంటే సరిపోతోంది. ఐదు రోజులకు మించి లక్షణాలు ఉంటే మాత్రం వైద్యుల సలహాతో పరీక్షలు చేయించుకోవాలి. ఫ్లూయిడ్స్‌ గానీ, ఇతర మందులు గానీ వైద్యులు సూచనకు అనుగుణంగా వినియోగించడం మంచిది. వేసవి తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో ఎక్కువ నీళ్లు తాగడం మేలు. రానున్న రోజుల్లో రకరకాల వైరస్‌లు మరింత యాక్టివ్‌ అయి వ్యాధుల వ్యాప్తికి కారణమవుతాయి. తగిన జాగ్రత్తలు తీసుకోవడం ఉత్తమం.

Updated Date - Feb 27 , 2024 | 01:53 AM