అమాంతం పెరిగిన పూల రేట్లు
ABN , Publish Date - Aug 16 , 2024 | 01:09 AM
నగరంలో వర్తకులు కొందరు...భక్తులను దోచుకుంటున్నారు.
కిలో చామంతులు రూ.600
పండ్ల ధరలకూ రెక్కలు
శ్రావణ శుక్రవారం నేపథ్యంలో వ్యాపారుల ఇష్టారాజ్యం
విశాఖపట్నం, ఆగస్టు 15 (ఆంధ్రజ్యోతి):
నగరంలో వర్తకులు కొందరు...భక్తులను దోచుకుంటున్నారు. శ్రావణ మాసంలో రెండో శుక్రవారం అత్యధికులు వరలక్ష్మి వ్రతం చేసుకుంటారు. ఈ పూజకు అమ్మవారిని పూలతో అలంకరించి అన్ని రకాల పండ్లను నైవేద్యంగా పెడతారు. స్థోమతకు తగ్గట్టు కొత్త బంగారు నగలు కొని అలంకరిస్తారు. ఈ నేపథ్యంలో గురువారం వ్యాపారులు పూజా సామగ్రి ధరలు అమాంతం పెంచేశారు. రైతుబజార్లలో చామంతులు కిలో రూ.400 ధర పెట్టినా ఎవరూ ఆ రేటుకు ఇవ్వలేదు. గిట్టుబాటు కాదంటూ రూ.600 చొప్పున విక్రయించారు. అలాగే యాపిల్స్ వంద రూపాయలకు మూడు, దానిమ్మ వందకు రెండు, సీతాఫలాలు వందకు నాలుగు చొప్పున విక్రయించారు. అరటి పండ్ల వ్యాపారులైతే మరీ దారుణంగా రేటు పెంచేశారు. డజను చిన్న అరటిపండ్లు రూ.100కు అమ్మారు. రైతుబజార్లలో రూ.70 పెట్టినా ఎవరూ ఆ ధరకు విక్రయించలేదు. ధరలు ఎక్కువైనా మార్కెట్లు కొనుగోలుదారులతో కిటకిటలాడాయి.
కాసు బంగారం బాగా ఖరీదు
బంగారం ధర గురువారం 22 క్యారెట్లు రూ.6,555గా నిర్ణయించారు. ఒక గ్రాము బరువు కలిగిన కాసు తీసుకుంటే దానికి రూ.7,350 తీసుకున్నారు. దీనికి కూడా తరుగు అంటూ 9 శాతం వసూలు చేశారు. జీఎస్‌టీ అంటూ మరో రూ.300 వేశారు. మొత్తంగా ఒక గ్రాము కాసుకు 7,350 బిల్లు వేశారు. ఇక ఆభరణాలు కొనేవారి గురించి చెప్పనక్కర్లేదు. అన్ని జ్యువెలరీ దుకాణాలు కిటకిటలాడాయి. బిల్లు చెల్లించడానికే చాలామందికి అరగంట సమయం పట్టింది.