Share News

ఆర్‌కే బీచ్‌లో ఫ్లోటింగ్‌ బ్రిడ్జి

ABN , Publish Date - Feb 02 , 2024 | 01:38 AM

సముద్రంలో తేలియాడే (ఫ్లోటింగ్‌) బ్రిడ్జి ఏర్పాటు కార్యక్రమం తెన్నేటి పార్కు నుంచి ఆర్‌కే బీచ్‌కు మారింది.

ఆర్‌కే బీచ్‌లో ఫ్లోటింగ్‌ బ్రిడ్జి

తెన్నేటి పార్కు వద్ద ఏర్పాటుకు అటవీ శాఖ అనుమతి నిరాకరణ

విశాఖపట్నం, ఫిబ్రవరి 1 (ఆంధ్రజ్యోతి):

సముద్రంలో తేలియాడే (ఫ్లోటింగ్‌) బ్రిడ్జి ఏర్పాటు కార్యక్రమం తెన్నేటి పార్కు నుంచి ఆర్‌కే బీచ్‌కు మారింది. విశాఖ మహా నగర ప్రాంత అభివృద్ధి సంస్థ (వీఎంఆర్‌డీఏ) పర్యాటకుల కోసం ఈ ప్రాజెక్టును చేపట్టింది. ప్లాస్టిక్‌ బ్లాకులతో తీరం నుంచి సముద్రంలోకి కొంత దూరం వరకు ఈ బ్రిడ్జి నిర్మిస్తారు. సముద్ర అలలు వచ్చినప్పుడు ఈ బ్రిడ్జి పైకి కిందికి లేస్తుంది. వింత అనుభూతిని కలిగిస్తుంది. దీనికి వీఎంఆర్‌డీఏ ఎటువంటి నిధులు వెచ్చించదు. కాంట్రాక్టరే డిజైన్‌ చేసుకొని, నిర్మించుకొని నిర్వహించుకోవాలి. పైలట్‌ ప్రాజెక్టుగా మూడేళ్లు నిర్వహించాలి. ఏడాదికి రూ.15.3 లక్షలు వీఎంఆర్‌డీఏకు చెల్లించాలి. పైలట్‌ ప్రాజెక్టు పూర్తయిన తరువాత విధి విఽధానాలు నిర్ణయిస్తారు. పర్యాటకుల నుంచి ఫీజుల రూపంలో ఆదాయం సమకూరుతుంది. తొలుత దీనిని తెన్నేటి పార్కు సమీపాన నిర్మించాలని ప్రతిపాదించారు. ప్లాస్టిక్‌ బ్లాకులన్నీ అక్కడికి తీసుకువెళ్లారు. వాటిని చూశాక అటవీ శాఖాధికారులు తమ అనుమతి లేకుండా ఆ ప్రాజెక్టు అక్కడ పెట్టడానికి వీల్లేదని ఆంక్షలు పెట్టారు. అనుమతి కోసం ఫైల్‌ పెట్టి, దానిని మళ్లీ ఢిల్లీకి పంపాలంటే చాలా సమయం పడుతుందని అధికారులు భావించారు. కురుసుర నబ్‌మెరైన్‌ ఆవరణ మొత్తం వీఎంఆర్‌డీఏ ఆధీనంలో ఉండడం, అక్కడ దీనిని నిర్వహించుకుంటే ఎవరి అనుమతి అవసరం లేదని భావించి...తెన్నేటి పార్కు నుంచి ఆర్‌కే బీచ్‌కు మార్చేశారు. ప్రస్తుతం పనులు మొదలయ్యాయి. వారం, పది రోజుల్లో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.

Updated Date - Feb 02 , 2024 | 01:38 AM