Share News

గంజాయి పట్టివేత కేసులో ఐదుగురి అరెస్టు

ABN , Publish Date - Mar 22 , 2024 | 12:52 AM

రెండు రోజుల క్రితం కొత్తపాలెంలో టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు గంజాయిని పట్టుకున్న కేసులో ఐదుగురిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ మేరకు కొత్తపాలెంలో మంగళవారం సాయంత్రం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీసీపీ-2 ఎం.సత్తిబాబు కేసు వివరాలను వెల్లడించారు.

గంజాయి పట్టివేత కేసులో ఐదుగురి అరెస్టు
వివరాలు వెల్లడిస్తున్న డీసీపీ-2 ఎం.సత్తిబాబు

ఐదు వాహనాలు సీజ్‌

మరో ఆరుగురి కోసం గాలింపు

డీసీపీ-2 సత్తిబాబు

గోపాలపట్నం, మార్చి 21: రెండు రోజుల క్రితం కొత్తపాలెంలో టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు గంజాయిని పట్టుకున్న కేసులో ఐదుగురిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ మేరకు కొత్తపాలెంలో మంగళవారం సాయంత్రం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీసీపీ-2 ఎం.సత్తిబాబు కేసు వివరాలను వెల్లడించారు. అనకాపల్లి చీడికాడ మండలం బైలపూడి గ్రామానికి చెందిన గాడి సంతోశ్‌ (32), నగరంలోని పూర్ణామార్కెట్‌కు చెందిన గుమ్మాల పైడిరాజు (40), ఎర్రా మౌళి ((36), సీతమ్మధారకు చెందిన నారికేళం గణపతి (21), కొత్తపాలేనికి చెందిన రాపేటి నూకేశ్‌ (36)లు తమకు పరిచయస్తులైన పవన్‌, ఆనంద్‌, త్రినాథ్‌ అనే వ్యక్తులతో కలిసి విశాఖ ఏజెన్సీలో ఇద్దరు వ్యక్తుల నుంచి గంజాయిని కొనుగోలు చేశారు. ఈ గంజాయిని కొత్తపాలెంలో నూకేశ్‌ బంధువు నిర్వహిస్తున్న టిఫిన్‌ షాపులో నిల్వ చేశారు. ఈ మేరకు సమాచారం అందుకున్న టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు ఆ షాపుపై దాడి చేసి సుమారు 110 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని గోపాలపట్నం పోలీసులకు అప్పగించారు. గంజాయి రవాణా చేస్తున్న సంతోశ్‌, పైడిరాజు, మౌళి, గణపతి, నూకేశ్‌లను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ కేసుతో సంబంధం ఉన్న మరో ఆరుగురి కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నట్టు డీసీపీ తెలిపారు. గంజాయి తరలించడానికి వినియోగించిన మూడు ద్విచక్ర వాహనాలు, ఒక ఆటో, ఒక కారును సీజ్‌ చేశామన్నారు. అదేవిధంగా గంజాయి నిల్వ చేసిన టిఫిన్‌ షాపును కూడా సీజ్‌ చేసినట్టు పేర్కొన్నారు. గంజాయి రవాణా, విక్రయాలు జరిపినా కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. కొరియర్‌ సర్వీసులు, పార్శిల్‌ సర్వీసుల ద్వారా గంజాయి తరలిస్తున్నట్టు తమవద్ద సమాచారం ఉందని, వాటిపై కూడా దాడులు చేసి తగిన చర్యలు చేపడతామన్నారు. విలేకరుల సమావేశంలో వెస్ట్‌ ఏసీపీ అన్నెపు నరసింహమూర్తి, గోపాలపట్నం సీఐ సురేశ్‌, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Mar 22 , 2024 | 12:52 AM