ఫిష్ ఆంధ్ర షాపు తెరవడం లేదని ఫిషరీస్ అసిస్టెంట్ సస్పెన్షన్!
ABN , Publish Date - Mar 06 , 2024 | 01:16 AM
రాష్ట్ర ప్రభుత్వం చేపల విక్రయానికి ‘ఫిష్ ఆంధ్ర’ పేరుతో అనేక ప్రాంతాల్లో దుకాణాలు ఏర్పాటుచేయించింది.

విశాఖపట్నం, మార్చి 5 (ఆంధ్రజ్యోతి):
రాష్ట్ర ప్రభుత్వం చేపల విక్రయానికి ‘ఫిష్ ఆంధ్ర’ పేరుతో అనేక ప్రాంతాల్లో దుకాణాలు ఏర్పాటుచేయించింది. ఆ దుకాణాల ఏర్పాటు, నిర్వహణ అంతా సచివాలయ సిబ్బంది చూసుకోవాల్సి ఉంటుంది. అయితే, ఒక వ్యక్తికి అప్పగించిన షాపు సక్రమంగా తీయడం లేదంటూ...అందుకు బాధ్యుడిని చేస్తూ ఫిషరీస్ అసిస్టెంట్‌ను అధికారులు సస్పెండ్ చేశారు. సీఎంను కలిసి తనకు న్యాయం చేయాల్సిందిగా కోరేందుకు సదరు ఉద్యోగి మంగళవారం పీఎం పాలెంలోని ‘వి’ కన్వెన్షన్ హాలు వద్దకు వచ్చారు. ఉద్యోగి కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి.
దాకమర్రి సచివాలయంలో వాసుపల్లి ఎల్లాజీ ఫిషరీస్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నారు. 2019లో ఆయనకు ఉద్యోగం వచ్చింది. ఏపీ ప్రభుత్వం ఫిష్ ఆంధ్ర అవుట్‌లెట్లను ఏర్పాటుచేయాలని నిర్ణయించింది. ఆ మేరకు అవుట్‌లెట్లు (షాపు) ఏర్పాటుచేసే బాధ్యతను సచివాలయంలోని ఫిషరీస్ అసిస్టెంట్లకు ఉన్నతాధికారులు అప్పగించారు. ఎల్లాజీ తన పరిధిలో షాపు కోసం అనేక ప్రాంతాలు తిరిగారు. షాపులు దొరకక, పనిచేసేందుకు ఎవరూ ముందుకు రాకపోవడంతో చాలా రోజులపాటు శ్రమించాల్సి వచ్చింది. ఎట్టకేలకు గంగవరంలో ఒక షాపు దొరకగా, దానిని అక్కడే ఉండే మరో వ్యక్తితో ఏర్పాటుచేయించారు. అయితే, అతను కుటుంబ సమస్యలతో కొద్దిరోజుల నుంచి షాపు తెరవడం లేదు. ఫిషరీస్ అసిస్టెంట్లు ప్రతిరోజు షాపు ఫొటోను తీసి ఉన్నతాధికారులకు పెట్టాల్సి ఉంటుంది. ప్రతిరోజూ క్లోజ్ చేసిన షాపు ఫొటో పెడుతుండడంతో ఉన్నతాధికారులు తీవ్రంగా దుర్భాషలాడి విధుల నుంచి గత నెలలో సస్పెండ్ చేశారు. దీనిపై సీఎంను కలిసేందుకు వచ్చిన ఆయన్ను పోలీసులు లోపలకు వెళ్లకుండా అడ్డుకున్నారు. షాపు పెట్టించడం దగ్గర నుంచి తీయించడం వరకు భారమంతా తమపై వేస్తే ఎలాగని ఎల్లాజీ ఆవేదన వ్యక్తం చేశారు.