Share News

తొలిగా పశ్చిమ ఫలితం

ABN , Publish Date - May 25 , 2024 | 01:01 AM

వచ్చే నెల నాలుగో తేదీన ఆంధ్ర విశ్వవిద్యాలయంలో నిర్వహించనున్న ఓట్ల లెక్కింపునకు జిల్లా యంత్రాంగం భారీ కసరత్తు చేస్తోంది.

తొలిగా పశ్చిమ ఫలితం

చివరిగా భీమిలి

ఓట్ల లెక్కింపుపై అధికారుల అంచనా

నాలుగో తేదీ ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్‌ ప్రారంభం

ఒక్కో సెగ్మెంట్‌లో పార్లమెంట్‌, అసెంబ్లీ అభ్యర్థులకు లభించిన ఓట్ల లెక్కింపునకు 14 టేబుళ్లు చొప్పున ఏర్పాటు

16 రౌండ్లలో పూర్తికానున్న పశ్చిమ నియోజకవర్గ ఓట్ల లెక్కింపు

మధ్యాహ్నం 3.15 గంటలకల్లా ఫలితం

భీమిలికి 26 రౌండ్లు

ఒక్కొక్క రౌండ్‌ లెక్కింపునకు 20 నిమిషాల నుంచి అరగంట పట్టే అవకాశం

సిబ్బంది ఉదయం నాలుగు గంటలకే రిపోర్టు చేయాలి

విశాఖపట్నం, మే 24 (ఆంధ్రజ్యోతి):

వచ్చే నెల నాలుగో తేదీన ఆంధ్ర విశ్వవిద్యాలయంలో నిర్వహించనున్న ఓట్ల లెక్కింపునకు జిల్లా యంత్రాంగం భారీ కసరత్తు చేస్తోంది. ఒక పార్లమెంటు, ఏడు అసెంబ్లీ సెగ్మెంట్‌ల ఓట్ల లెక్కింపునకు అవసరమైన సిబ్బంది నియామకం నుంచి టేబుళ్లు ఏర్పాటు వరకూ ఇప్పటికే పక్కాగా ప్రణాళిక రూపొందించుకుంది. జిల్లాలో అతి తక్కువ ఓట్లు పోలైన విశాఖ పశ్చిమ నియోజకవర్గ ఫలితం మొదట (సాయంత్రానికి) వెలువడే అవకాశం ఉంది. ఇక ఎక్కువ ఓట్లు పోలైన భీమిలి నియోజకవర్గ ఫలితం రాత్రి పొద్దుపోయిన తరువాత వస్తోందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఓట్ల లెక్కింపు కోసం అతి తక్కువగా విశాఖ పశ్చిమ నియోజక వర్గంలో 16, అత్యధికంగా భీమిలిలో 26 టేబుళ్లు ఏర్పాటుచేస్తున్నారు. ప్రతి నియోజకవర్గంలో ఓట్ల లెక్కింపు 14 రౌండ్లలో చేపడతారు. విశాఖ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని 1,962 పోలింగ్‌ కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు 140 రౌండ్లు, విశాఖ జిల్లాలో 1,991 పోలింగ్‌ కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు 142 రౌండ్లలో పూర్తికానున్నది.

పోస్టల్‌ బ్యాలెట్‌ లెక్కింపునకు ప్రత్యేకించి నియోజకవర్గంలో పోలైన ఓట్లను పరిగణనలోకి తీసుకుని రెండు నుంచి మూడు టేబుళ్లు ఏర్పాటుచేస్తారు. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు నాలుగో తేదీ ఉదయం ఎనిమిది గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభిస్తారు. లెక్కింపు మొత్తం పూర్తయ్యేసరికి రాత్రి పొద్దుపోతుందంటున్నారు. అంటే 12 నుంచి 14 గంటల సమయం పడుతుందని అంచనా వేస్తున్నారు. ఉద్యోగులు, అధికారులు నాలుగో తేదీ తెల్లవారుజామున నాలుగు గంటలకు ఏయూ ఇంజనీరింగ్‌ కళాశాలలో రిపోర్టు చేయాల్సి ఉంటుంది. అభ్యర్థుల తరపున ఏజెంట్లు 5.30 గంటలకు రావల్సి ఉంటుంది. ఏజెంట్లు వచ్చిన తరువాతే స్ట్రాంగ్‌ రూమ్‌ సీళ్లు ఓపెన్‌ చేస్తారు.

- భీమిలి నియోజకవర్గంలో పోలింగ్‌ కేంద్రాలు 359. 3,63,013 మందికి గాను 2,75,747 మంది ఓటు వేశారు. మొత్తం 14 టేబుళ్లపై 26 రౌండ్లలో లెక్కింపు చేపడతారు. అధికారుల అంచనా ప్రకారం నాలుగో తేదీ రాత్రి 7.30 గంటలకు లెక్కింపు పూర్తవుతుంది. అయితే పోస్టల్‌ బ్యాలెట్ల లెక్కింపు ముగిసేసరికి అర్ధరాత్రి దాటుతుందని అంచనా వేస్తున్నారు.

- విశాఖ తూర్పు నియోజకవర్గంలోని 292 పోలింగ్‌ కేంద్రాలు ఉన్నాయి. 2,92,206కి 2,00,563 ఓట్లు పోలయ్యాయి. ఇక్కడ 21 రౌండ్లలో లెక్కింపు పూర్తికానున్నది. సాయంత్రం 5.30 గంటలకు కౌంటింగ్‌ పూర్తవుతుందని అంచనా వేస్తున్నారు

- విశాఖ దక్షిణ నియోజకవర్గంలో 237 పోలింగ్‌ కేంద్రాల్లో 2,16,770కి గాను 1,37,474 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. మొత్తం 17 రౌండ్లలో లెక్కింపు మధ్యాహ్నం 3.30 గంటలకు పూర్తికానున్నది.

- విశాఖ ఉత్తర నియోజకవర్గంలో 275 పోలింగ్‌ కేంద్రాల్లో 2,85,789 మందికి 1,84,703 మంది ఓటుహక్కు వినియోగించుకోగా 20 రౌండ్లలో లెక్కింపు చేపడతారు. సాయంత్రం ఐదు గంటలకు పూర్తవుతుందని అంచనా వేశారు.

- విశాఖ పశ్చిమ నియోజకవర్గంలో 222 పోలింగ్‌ కేంద్రాలు ఉన్నాయి. 2,13,439కి 1,48,942 మంది ఓటు వేయగా 16 రౌండ్లలో లెక్కింపు పూర్తికానున్నది. మధ్యాహ్నం 3.15 గంటలకల్లా ఫలితం వెలువడుతుందని అంచనా వేస్తున్నారు.

- గాజువాక నియోజకవర్గంలో 306 పోలింగ్‌ కేంద్రాల్లో 3,33,611కి 2,32,949 మంది ఓటేయగా 22 రౌండ్లలో లెక్కింపు పూర్తికానున్నది. మొత్తం ప్రక్రియ ముగిసేసరికి సాయంత్రం 5.45 గంటలవుతుందని అంచనా వేశారు.

- పెందుర్తి నియోజకవర్గంలో 299 పోలింగ్‌ కేంద్రాలు ఉన్నాయి. మొత్తం 3,07,545కి 2,28,740 మంది ఓటేయగా 21 రౌండ్లలో లెక్కింపు పూర్తికానున్నది. తుది ఫలితం వెలువడేసరికి సాయంత్రం 5.30 గంటలవుతుందని అంచనా వేస్తున్నారు.

- విశాఖ పార్లమెంటు నియోజకవర్గ పరిధి ఎస్‌.కోట నియోజకవర్గంలో 270 పోలింగ్‌ కేంద్రాల్లో 2,22,475 మందికిగాను 1,90,106 మంది ఓటు హక్కు వినియోగించుకోగా 19 రౌండ్లలో లెక్కింపు పూర్తికానున్నది. సాయంత్రం 4.30 గంటలకు తుది ఫలితం వస్తుందని అధికారులు అంచనావేశారు.

- జిల్లాలో సుమారు 23 వేల పోస్టల్‌ బ్యాలెట్లు లెక్కించాల్సి ఉంటుంది. ఈవీఎంల కంటే పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్ల లెక్కింపు ఆలస్యమవుతుంది. ప్రతి సెగ్మెంట్‌కు రెండు నుంచి టేబుళ్లు ఏర్పాటుచేస్తున్నారు.

- ఒక్కో రౌండ్‌ ఓట్ల లెక్కింపునకు సుమారు ఇరవై నిమిషాల నుంచి 30 నిమిషాల వరకూ సమయం పట్టవచ్చని భావిస్తున్నారు.

Updated Date - May 25 , 2024 | 01:01 AM