Share News

ఐదు రోజులు మంటలే..

ABN , Publish Date - Apr 27 , 2024 | 01:31 AM

మునుపెన్నడూ లేనంతగా ఎండ వేడి, తీవ్ర వడగాడ్పులతో దేశంలోని అనేక ప్రాంతాలు ఉడుకుతున్నాయి.

ఐదు రోజులు మంటలే..

  • తూర్పు, దక్షిణ భారతంలో తీవ్ర వడగాడ్పులు

  • రాయలసీమ, తెలంగాణలోనూ గాల్పుల తీవ్రత

  • వచ్చే నెలలో మరింత వేడిగాలులు...

  • 45 డిగ్రీలు దాటి నమోదయ్యే అవకాశం

  • వాతావరణ నిపుణుల హెచ్చరిక

  • గత ఏడాది రికార్డు దాటొచ్చని అంచనా

విశాఖపట్నం, అమరావతి, ఏప్రిల్‌ 26 (ఆంధ్రజ్యోతి):

మునుపెన్నడూ లేనంతగా ఎండ వేడి, తీవ్ర వడగాడ్పులతో దేశంలోని అనేక ప్రాంతాలు ఉడుకుతున్నాయి. రోహిణి కార్తెకు మరో నెల రోజుల సమయం ఉండగానే రోళ్లు బద్ధలయ్యేలా కాస్తున్న ఎండలతో ప్రజలు ఠారెత్తిపోతున్నారు. అయితే ఈ ఏడాది వేసవి తీవ్రంగా ఉంటుందని వాతావరణ నిపుణులు, భారత వాతావరణ శాఖ (ఐఎండీ) అధికారులు ముందే హెచ్చరించారు. కానీ, అంతకు మించి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. నెల రోజుల నుంచి నమోదవుతున్న ఉష్ణోగ్రతలు, ఎండలు, గాడ్పుల తీవ్రతను పరిగణనలోకి తీసుకుని గతేడాదికంటే ప్రస్తుత ఏడాది రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదు కావొచ్చని ఐఎండీ సీనియర్‌ అధికారి డీఎస్‌ పాయ్‌ శుక్రవారం పేర్కొన్నారు. ఇప్పటివరకు 2023 అత్యంత వేడి సంవత్సరంగా నమోదైందని, అయితే ఈ ఏడాది ఆ రికార్డును అధిగమిస్తుందని అంచనా వేశారు. ఆంధ్రప్రదేశ్‌, ఒడిశా, జార్ఖండ్‌, పశ్చిమ బెంగాల్‌లో తీవ్రమైన వడగాడ్పులు వీయడంతో కొద్దిరోజులుగా పగటి ఉష్ణోగ్రతలు 42 నుంచి 44 డిగ్రీలు, అక్కడక్కడా అంతకుమించి నమోదుకావడం ఆందోళన కలిగిస్తోందన్నారు. కాగా, రానున్న ఐదు రోజుల్లో దక్షిణాదిలో ఏపీ, తమిళనాడు, తెలంగాణ, కర్ణాటక, వీటికి ఆనుకుని ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌, మధ్యప్రదేశ్‌, విదర్భ, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్‌లలోని అనేక ప్రాంతాల్లో వేడి వాతావరణం కొనసాగడమే కాకుండా వడగాడ్పులు వీస్తాయని ఐఎండీ శుక్రవారం హెచ్చరించింది. ఈ నెల 28 నుంచి 30 వరకు ఈశాన్య భారతంలో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఒడిశాలో తొమ్మిది జిల్లాలకు వడగాడ్పుల హెచ్చరికలను ఆ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ జారీచేసింది. అలాగే 26-28వ తేదీల మధ్య కేరళలో, 27-29 మధ్య కొంకణ్‌ ప్రాంతంలో, 28-30 మధ్య పశ్చిమ ఉత్తరప్రదేశ్‌, కోస్తాంధ్ర, యానాం ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని ఐఎండీ ప్రకటించింది. శుక్ర, శనివారాల్లో పంజాబ్‌ హరియాణాల్లో వడగళ్ల వాన కురిసే అవకాశం ఉందని తెలిపింది.

ఎన్నికల ప్రచారంపై ప్రభావం

ఇదిలావుండగా ఎల్‌నినో బలహీనపడినా ఇంకా దాని అవశేషాల ప్రభావంతో పసిఫిక్‌ మహాసముద్రం నుంచి వస్తున్న వేడి గాలులు భారత ఉపఖండంలో మరింత వేడిని పెంచుతున్నాయని సీనియర్‌ వాతావరణ శాస్త్రవేత్త ఒకరు పేర్కొన్నారు. దీని ప్రభావంతో దేశం మొత్తం నిప్పుల కుంపటిలా మారిందని, వచ్చేనెలలో మరింత వేడిగాలులు వీస్తాయని, పగటి ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలు దాటతాయని హెచ్చరించారు. వడగాడ్పుల ప్రభావం ఎన్నికల ప్రచారం, పోలింగ్‌పై పడనుందన్నారు.

నంద్యాలలో 45.5 డిగ్రీలు

రాష్ట్రవ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. గరిష్ఠ ఉష్ణోగ్రతలు 45.5 డిగ్రీలకు చేరాయి. శుక్రవారం నంద్యాల జిల్లా చాగలమర్రిలో 45.5 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. విజయనగరం జిల్లా కొత్తవలసలో 44.2, మన్యం జిల్లా సాలూరులో 43.8 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అలాగే 41 మండలాల్లో తీవ్రంగా, 116 మండలాల్లో మోస్తరు వడగాడ్పులు వీచాయి. రానున్న రెండు రోజులు ఉష్ణోగ్రత 46 డిగ్రీలకు చేరనుంది. శనివారం..శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, అనకాపల్లి, కాకినాడ, తూర్పుగోదావరి, ఏలూరు జిల్లాల్లోని 64 మండలాల్లో తీవ్ర వడగాడ్పులు వీస్తాయని, రాష్ట్రవ్యాప్తంగా 183 మండలాల్లో మోస్తరు వడగాడ్పులు వీస్తాయని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. ఉష్ణోగ్రతలు, వడగాడ్పులు పెరిగిన నేపథ్యంలో గర్భిణిలు, బాలింతలు, చిన్నారులు, వృద్ధులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ కూర్మనాథ్‌ సూచించారు.

Updated Date - Apr 27 , 2024 | 01:31 AM