Share News

వైసీపీ నేతల గుప్పిట్లో ఫిల్మ్‌నగర్‌ క్లబ్‌!

ABN , Publish Date - Feb 27 , 2024 | 01:51 AM

వైజాగ్‌ ఫిల్మ్‌నగర్‌ కల్చరల్‌ సెంటర్‌ ఎన్నికను వారు అనుకున్నట్టుగానే నిర్వహించారు.

వైసీపీ నేతల గుప్పిట్లో ఫిల్మ్‌నగర్‌ క్లబ్‌!

వారనుకున్నట్టుగానే కార్యవర్గం ఎన్నిక

19 నుంచి నామినేషన్ల శ్రీకారం

25వ తేదీతో ముగిసిన గడువు

అధికార పార్టీకి చెందిన వారు కావడంతో ప్రస్తుత కార్యవర్గంపై పోటీ చేసేందుకు ఎవరూ ముందుకురాని వైనం

దాంతో ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు ప్రకటన

చైర్మన్‌గా కాయల వెంకటరెడ్డి

కోశాధికారిగా ఎస్‌ఆర్‌ గోపీనాథరెడ్డి

సినిమాలతో సంబంధం లేని వారికి కమిటీలో స్థానం కల్పించడంపై విమర్శల వెల్లువ

విశాఖపట్నం, ఫిబ్రవరి 26 (ఆంధ్రజ్యోతి):

వైజాగ్‌ ఫిల్మ్‌నగర్‌ కల్చరల్‌ సెంటర్‌ ఎన్నికను వారు అనుకున్నట్టుగానే నిర్వహించారు. మార్చి 5వ తేదీన పోలింగ్‌ నిర్వహిస్తామంటూ...ఈ నెల 19న నామినేషన్ల ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. పరిశీలన, ఉపసంహరణల గడువు ఫిబ్రవరి 25వ తేదీతో ముగిసిపోయింది. అధికార పార్టీకి చెందిన నాయకులపై పోటీకి ఎవరూ ముందుకురాలేదు. దీంతో చైర్మన్‌గా కాయల వెంకటరెడ్డి, సెక్రటరీగా సీహెచ్‌ శ్రీనివాసరాజు, సంయుక్త కార్యదర్శిగా ఎంఎస్‌ఎన్‌ రాజు, ఉపాధ్యక్షునిగా ఆర్‌వీ చంద్రమౌళి, కోశాధికారిగా ఎస్‌ఆర్‌ గోపీనాథ్‌రెడ్డి ఎన్నికైనట్టు ప్రకటించారు. మేనేజింగ్‌ కమిటీలో ప్రధాన కార్యవర్గం అంతా ఏకగ్రీవం కావడంతో పోలింగ్‌ తేదీ వరకూ వేచి ఉండకుండానే వారు గెలిచినట్టు ప్రకటించారు. సభ్యులను కూడా ఏకగ్రీవంగానే ఎన్నుకున్నట్టు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు.

సినిమాలతో సంబంధం లేని వారికే పగ్గాలు

ఈ క్లబ్‌ను సినిమా అభివృద్ధి కోసం ఉపయోగించుకోవాలని సంబంధిత రంగాలకు చెందిన వారికి సభ్యత్వం కల్పించి ప్రారంభించారు. సాంస్కృతిక సంస్థలకు చెందిన వారికి కూడా సభ్యత్వం ఇవ్వాలని నిర్ణయించారు. సినిమా రంగంతో అనుబంధం లేని వారికి సభ్యత్వం ఇచ్చినా వారికి మేనేజ్‌మెంట్‌ కమిటీతో స్థానం ఉండకూడదు. ఏ క్లబ్‌ అయినా అంతే. కానీ ఇక్కడ మూడేళ్ల క్రితం వైసీపీ నాయకులు అడ్డగోలుగా క్లబ్‌ను హస్తగతం చేసుకున్నారు. క్లబ్‌కు అవసరమైన భూమిని ప్రభుత్వం నుంచి ఇప్పిస్తామనే భరోసాతో అడుగుపెట్టారు. అధికారంలో ఉన్నది వారే అయినప్పటికీ గజం స్థలం కూడా ఇప్పించలేకపోయారు. సభ్యత్వ రుసుములు ద్వారా కోట్లాది రూపాయలు వసూలైంది. దానిపై కొందరు కన్నేశారు. భీమిలి సమీపాన ఏడు ఎకరాల భూమిని రూ.25 కోట్లకు కొనుగోలు చేయాలని ఇటీవల నిర్ణయించారు. దీనిని చాలామంది వ్యతిరేకించారు. ప్రభుత్వం నుంచి రాయితీ ధరకు భూమిని ఇప్పించకుండా మొత్తం సొమ్ము వెచ్చించి భూమి కొనడం ఏమిటని ప్రశ్నించారు. దాంతో కమిటీ పెద్దలు తాత్కాలికంగా ఒక అడుగు వెనక్కి తగ్గినా...ఇప్పుడు మరో రెండేళ్లు అధికారం చేతికి రావడంతో భీమిలిలో భూమి కొనుగోలుకు ప్రయత్నించే అవకాశం ఉందని సభ్యులు ఆరోపిస్తున్నారు. కొనాలనుకుంటున్న భూమికి సంబంధించి వివాదాలు ఉన్నాయని, సరైన మార్గం కూడా లేదని అంటురు. ముందు రూ.10 కోట్లు అడ్వాన్స్‌ ఇచ్చి, పొజిషన్‌ తీసుకున్నాక తీరుబడిగా మిగిలిన మొత్తం చెల్లించవచ్చునని కమిటీ పెద్దలు చెబుతున్నారు. కానీ, పూర్తి మొత్తం తీసుకోకుండా ఏడు ఎకరాల భూమి ఎలా అప్పగిస్తారని కొందరు సందేహం వ్యక్తంచేస్తున్నారు. అయితే సభ్యులు ఏమి మాట్లాడినా అధికార పార్టీ టార్గెట్‌ చేస్తుందనే భయంతో ఎవరూ నోరు విప్పడం లేదు. కొత్త కార్యవర్గం విశాఖను ఫిల్మ్‌ మేకింగ్‌, స్టూడియోలకు హబ్‌గా మార్చేందుకు కృషిచేస్తామని ప్రకటించింది. అయితే సినిమా రంగానికి చెందిన వారెవరికీ ఇందులో కీలక స్థానం కల్పించలేదు. అధికార పార్టీ నాయకులకు అనుయాయులుగా సమాజంలో ముద్రపడిన వారే పీఠం దక్కించుకున్నారు. వీరు సినిమా రంగాన్ని ఎలా అభివృద్ధి చేస్తారని, ఈ రెండేళ్లు ఏమి చేశారని సభ్యులు ప్రశ్నిస్తున్నారు. రాజకీయాలకు అతీతంగా ఉండే పరిశ్రమను సైతం కలుషితం చేశారని కొందరు వాపోతున్నారు. నగరంలో కొందరు ప్రముఖులు చిత్ర పరిశ్రమతో సంబంఽధం ఉన్నవారు రెండేళ్ల క్రితమే సభ్యత్వం కోసం డబ్బులు చెల్లిస్తే వారికి ఇప్పటికి కూడా కార్డులు ఇవ్వలేదు. వారికి ఎన్నికల్లో భాగస్వామ్యం కల్పించలేదు. ఈ క్లబ్‌లో ఏదీ నిబంధనల ప్రకారం జరగడం లేదని, ఇది కమిటీ క్లబ్బే తప్ప సభ్యులది కాదని పలువురు విమర్శలు గుప్పిస్తున్నారు. కమిటీకి అనుకూలంగా బైలాను మార్పు చేసుకున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి.

Updated Date - Feb 27 , 2024 | 01:51 AM