Share News

ఫెడెక్స్‌ ఫ్రాడ్స్‌

ABN , Publish Date - Oct 01 , 2024 | 01:38 AM

సైబర్‌ నేరగాళ్లు కొత్త ఎత్తుగడలతో ప్రజల సొమ్మును దోచుకుంటున్నారు.

ఫెడెక్స్‌ ఫ్రాడ్స్‌

సైబర్‌ నేరగాళ్ల కొత్త ఎత్తుగడ

పోలీస్‌/కస్టమ్స్‌ అధికారులమంటూ వాట్సాప్‌ కాల్స్‌

కొరియర్‌లో డ్రగ్స్‌ సరఫరా చేస్తున్నారంటూ బెదిరింపు

మనీ ల్యాండరింగ్‌లో కూడా ప్రమేయం ఉందంటూ... విచారణ పేరుతో హడావిడి

కేసు నుంచి తప్పించాలంటే డబ్బులు పంపాలంటూ బ్లాక్‌మెయిల్‌

అకౌంట్‌ నుంచి డబ్బులు లాక్కొని మోసం

విద్యావంతులు, వ్యాపారులే టార్గెట్‌

నగరంలో పెరుగుతున్న కేసులు

అవగాహనతోనే అడ్డుకట్ట సాధ్యమంటున్న సైబర్‌ పోలీసులు

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

సైబర్‌ నేరగాళ్లు కొత్త ఎత్తుగడలతో ప్రజల సొమ్మును దోచుకుంటున్నారు. తాజాగా ఫెడెక్స్‌ కొరియర్‌ పేరుతో బురిడీ కొట్టిస్తున్నారు. పోలీస్‌ అధికారుల ఫొటోలను డీపీలుగా పెట్టుకుని వాట్సాప్‌ కాల్స్‌ చేసి డ్రగ్స్‌ సరఫరా, మనీల్యాండరింగ్‌ కేసుల్లో ప్రమేయం ఉందంటూ బెదిరించి డబ్బులు దోచుకుంటున్నారు.

సైబర్‌ మోసాల అడ్డుకట్టకు పోలీసులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నాసరే ఫలితం ఉండడం లేదు. గతంలో నిరక్షరాస్యులు, అమాయకులను టార్గెట్‌ చేసుకున్న సైబర్‌నేరగాళ్లు ఇప్పుడు విద్యావంతులను లక్ష్యంగా చేసుకుని కొత్త తరహా మోసాలకు పాల్పడుతున్నారు. 2020 నుంచి ఇప్పటివరకూ సైబర్‌ మోసాలకు సంబంధించి నగర పోలీసులకు 14 వేలకుపైగా ఫిర్యాదులు అందాయి. ఆయా కేసుల్లో సుమారు రూ.130 కోట్లు వరకూ సైబర్‌ నేరగాళ్లు దోచుకోగా, పోలీసులు రూ.25 కోట్లు మాత్రమే రికవరీ చేయగలిగారు. సైబర్‌ మోసాలకు పాల్పడుతున్నవారంతా విదేశాల్లో ఉండడం, ఇంటర్నెట్‌ కాల్స్‌లో మాట్లాడుతుండడం, దేశవ్యాప్తంగా అమాయకుల పేర్లతో ఓపెన్‌ చేసిన బ్యాంకు ఖాతాలను వినియోగిస్తుండడంతో వారిని గుర్తించడం పోలీసులకు సవాల్‌గా మారుతోంది. ప్రస్తుతం నమోదవుతున్న కేసుల్లో ‘ఫెడెక్స్‌ కొరియర్‌ ఫ్రాడ్స్‌’ ఎక్కువగా ఉంటున్నాయి. ఫెడెక్స్‌ కొరియర్‌ పేరుతో జరిగే మోసాల్లో బాధితుడికి ముందుగా గుర్తుతెలియని ఫోన్‌ నంబర్‌ నుంచి వాట్సాప్‌ కాల్‌ వస్తుంది. ఫోన్‌ లిఫ్ట్‌ చేయగానే...అవతలి వ్యక్తి ‘నేను పోలీస్‌ అధికారి/కస్టమ్స్‌ అధికారిని మాట్లాడుతున్నానని’ పరిచయం చేసుకుంటాడు. వాట్సాప్‌ డీపీ కూడా యూనిఫారంతో ఉన్న అధికారి ఫొటో ఉండడంతో నిజంగానే పోలీస్‌/కస్టమ్స్‌ అధికారి మాట్లాడుతున్నారని ఇవతలివారు నమ్మేస్తుంటారు. ‘ఫెడెక్స్‌ కొరియర్స్‌లో మీ పేరు మీద ఒక పార్మిల్‌ ముంబై నుంచి తైవాన్‌కు వెళుతుండగా ఎయిర్‌పోర్ట్‌లో కస్టమ్స్‌ అధికారులు పట్టుకున్నారు. అందులో మాదక ద్రవ్యాలు, నకిలీ పాస్‌పోర్ట్‌లు, క్రెడిట్‌ కార్టులు, కొంత నగదు ఉంది. దీన్ని కస్టమ్స్‌ అధికారులు క్రైమ్‌ బ్రాంచ్‌కు అప్పగించారంటూ’ చెబుతారు. తాను ఎలాంటి కొరియర్‌ బుక్‌ చేయలేదని బాధితుడు చెప్పినా సరే తమదైన శైలిలో బెదిరింపులకు గురిచేస్తారు. అప్పటికే సైబర్‌ నేరగాళ్లు ఓపెన్‌ సోర్స్‌ ఇంటెలిజెన్స్‌ ద్వారా సేకరించిన బాధితుడికి సంబంధించిన పూర్తివివరాలు, చిరునామా, ఆధార్‌ కార్డు నంబర్‌ వంటి వివరాలను చెప్పడంతో నిజంగానే తన పేరు మీద ఎవరో డ్రగ్స్‌ సరఫరా చేయడమో, మనీల్యాండరింగ్‌ చేయడమో చేసి ఉంటారనే అనుమానం మొదలవుతుంది. కేసు దర్యాప్తు కోసం క్రైమ్‌బ్రాంచ్‌ అధికారులతో మాట్లాడాలని, వారు అడిగిన వివరాలన్నీ చెప్పి విచారణకు సహకరించాలని భయపెడతారు. బాధితుడికి అనుమానం రాకుండా పోలీసుల మాదిరిగా వాకీటాకీ శబ్దాలు వినిపిస్తారు. పార్శిల్‌లో వచ్చిన డ్రగ్స్‌, నకిలీ పాస్‌పోర్ట్‌లు ఇతర వస్తువుల పేర్లను చెబుతూ కేసు నమోదు చేస్తామంటూ బెదిరిస్తారు. పై అధికారుల వద్దకు కేసు ప్రస్తావన తీసుకువెళ్లినట్టు, ఆ అధికారి బాధితుడిపై కేసు నమోదుచేసి అరెస్టు చేయాలని ఆదేశిస్తున్నట్టు సీన్‌ క్రియేట్‌ చేస్తారు. కానీ క్రైమ్‌బ్రాంచి అధికారులుగా చెప్పుకుంటున్నవారు మాత్రం బాధితుడు విచారణకు సహకరిస్తున్నాడని, కేసు నమోదుచేయొద్దని ఏదోలా అతన్ని కేసు నుంచి బయటపడేలా చూడాలని ఉన్నతాధికారిని విజ్ఞప్తి చేస్తున్నట్టు నటిస్తారు. ఆ సమయంలో ఉన్నతాధికారులుగా నటించే వ్యక్తులు కూడా ‘సరే ఏదోలా చేసేయ్‌’ అని అవకాశం ఇచ్చినట్టు వదిలేస్తారు. వెంటనే బాధితుడికి స్కైప్‌ లేదా వాట్సాప్‌ వీడియోకాల్‌ చేసి కేసు విచారణ విషయాన్ని కుటుంబ సభ్యులకు కూడా చెప్పొద్దని, బయటకు పొక్కితే తాము సాయం చేయలేమని బాధితుడిని బెదిరిస్తారు. తర్వాత పోలీస్‌/కస్టమ్స్‌ విచారణలో భాగంగా బ్యాంకు ఖాతాలోని నగదును తాము చెప్పిన ఖాతాకు బదిలీ చేయాలని, విచారణ తర్వాత 20 నిమిషాల్లో తిరిగి అదే ఖాతాకు జమ అయిపోతుందని చెబుతారు. దీనికి సంబంధించి ఆర్‌బీఐ అనుమతి ఇచ్చిందంటూ నకిలీ ఆర్డర్‌ కాపీని బాధితుడికి పంపిస్తారు. నిజమేనని భావించిన బాధితుడు తన ఖాతాలోని నగదుని సైబర్‌ నేరగాళ్లు సూచించిన ఖాతాకు బదలాయించగానే సైబర్‌ నేరగాళ్లు లైన్‌లన్నీ కట్‌ చేసేస్తారు.

ఈ తరహా మోసాలు నగరంలో పెరుగుతుండడం పోలీసులను సైతం కలవరపాటుకు గురిచేస్తోంది. ఇటీవల నగరానికి చెందిన ఒక లాజిస్టిక్‌ వ్యాపారికి ఇలాంటి ఫోన్‌ కాల్‌ వచ్చింది. తాము ముంబై కస్టమ్స్‌ అధికారులమని పరిచయం చేసుకుని ‘మీ పేరు మీద తైవాన్‌కు ఫెడెక్స్‌లో ఒక కొరియర్‌ బుక్‌ చేశారని’ చెప్పారు. తాను ఎలాంటి కొరియర్‌ పంపించలేదని లాజిస్టిక్‌ వ్యాపారి చెప్పగా, అవతలి వ్యక్తులు వ్యాపారి పేరు, చిరునామా, ఫోన్‌ నంబర్‌, కార్యాలయం వివరాలతో సహా ఏకరువుపెట్టడంతో నిజమేనని భావించారు. కొరియర్‌ బుకింగ్‌ నంబర్‌ చెప్పి అందులో నిషేధిత నార్కోటిక్‌ డ్రగ్స్‌తోపాటు నకిలీ పాస్‌పోర్ట్‌లు, క్రెడిట్‌ కార్డులు ఉన్నాయని చెప్పడంతో వ్యాపారి భయపడిపోయారు. విచారణకు సహకరిస్తే కేసు లేకుండా బయటపడేలా చేస్తామంటూ సైబర్‌ నేరగాళ్లు బాధితుడికి చె ప్పారు. దీంతో వారు చెప్పినట్టే బాధితుడు తన ఖాతాలోని రూ.1.3 కోట్లను సైబర్‌ నేరగాళ్లు చెప్పిన ఖాతాకు ట్రాన్స్‌ఫర్‌ చేశారు. వెంటనే ఫోన్‌ కట్‌ అవ్వడంతో బాధితుడుఅనుమానంతో సైబర్‌క్రైమ్‌ హెల్ప్‌లైన్‌ నంబర్‌ 1930కి ఫోన్‌ చేసి విషయం చెప్పారు. సైబర్‌క్రైమ్‌ పోలీసులు అప్రమత్తమై బ్యాంకు అధికారులతో మాట్లాడి బాధితుడి ఖాతా నుంచి నగదు వెళ్లిన సైబర్‌ నేరగాళ్ల ఖాతాను ఫ్రీజ్‌ చేసి అందులో అప్పటికి ఉన్న రూ.85,70,923ని హోల్డ్‌లో పెట్టించారు. రెండు రోజుల కిందట ప్రైవేటు ఉద్యోగి ఒకరికి గుర్తుతెలియని రెండు నంబర్ల నుంచి వరుసగా వాట్సాప్‌ కాల్స్‌ వచ్చాయి. పోలీస్‌ యూనిఫామ్‌లో ఉన్న వ్యక్తుల ఫొటోలు డీపీలుగా ఉన్నాయి. కానీ ఫోన్‌ నంబర్‌ సిరీస్‌ +92తో ఉండడంతో సైబర్‌ నేరగాళ్లు అయివుంటారని అనుమానించి ఆయన ఫోన్‌ లిఫ్ట్‌చేయలేదు. దీనిపై సైబర్‌ పోలీసుల దృష్టికి తీసుకువెళ్లగా ఆ రెండు నంబర్లు కూడా సైబర్‌ నేరగాళ్లవేనని నిర్ధారించారు. ఇలాంటి కేసులు చాలా ఉంటున్నాయని పోలీసులు చెబుతున్నారు.

అవగాహనతోనే నేరాలకు అడ్డుకట్ట

కె.భవానీప్రసాద్‌, సైబర్‌క్రైమ్‌ సీఐ

సైబర్‌ నేరగాళ్లు ఎప్పటికప్పుడు ప్రజలను బురిడీ కొట్టించేందుకు కొత్త ఎత్తుగడులు వేస్తుంటారు. ప్రస్తుతం ఫెడెక్స్‌ కొరియర్‌, టాస్క్‌ బేస్డ్‌ ఫ్రాడ్స్‌, స్టాక్‌ మార్కెట్‌ ఫ్రాడ్స్‌, హనీట్రాప్‌ వంటి మోసాలు ఎక్కువగా జరుగుతున్నాయి. పోలీసులు/కస్టమ్స్‌ అధికారులు ఏదైనా కేసు ఉంటే ఫోన్‌లో విచారణ చేయరని గుర్తించాలి. ఏదైనా ఉంటే ముందుగా నోటీసు ఇచ్చి తర్వాత ప్రత్యక్షంగా విచారిస్తారు తప్పితే వాట్సాప్‌ కాల్‌ చేసి విచారణ చేయరు. అలాగే బ్యాంకు ఖాతాకు డబ్బులు ట్రాన్స్‌ఫర్‌ చేయాలని అడిగే ప్రసక్తే ఉండదు. బాధాకరమైన విషయం ఏమిటంటే సైబర్‌ నేరగాళ్ల వలలో చిక్కుకుంటున్న వారంతా విద్యావంతులు, ఉన్నతస్థానాల్లో ఉన్నవారే ఉంటున్నారు. ప్రజల్లో అవగాహన పెరిగినప్పుడు మాత్రమే సైబర్‌ నేరాలకు అడ్డుకట్ట వేయడం సాధ్యమవుతుంది.

2020 నుంచి 2024 మధ్య సైబర్‌ కేసుల వివరాలు

అందిన ఫిర్యాదులు 14,000

నేరగాళ్లు దోచుకున్న మొత్తం సుమారు రూ.130 కోట్లు

పోలీసులు రికవరీ చేసింది రూ.25 కోట్లు

Updated Date - Oct 01 , 2024 | 01:38 AM