విశాఖ డెయిరీపై పాడిరైతుల ఆగ్రహం
ABN , Publish Date - Oct 20 , 2024 | 01:01 AM
విశాఖ డెయిరీ పాల సేకరణ ధరను తగ్గిస్తూ తీసుకున్న నిర్ణయంపై పాడిరైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పశువుల దాణా, ఇతర ఖర్చులు పెరిగిపోయిన నేపథ్యంలో పాల సేకరణ ధరను పెంచి రైతులను ఆదుకోవలసిందిపోయి ధరను తగ్గిస్తూ విశాఖ డెయిరీ యాజమాన్యం నిర్ణయం తీసుకోవడంపై మండిపడుతున్నారు.
పాల సేకరణ ధర తగ్గింపుపై మండిపాటు
దాణా, పశుగ్రాసం ఖర్చులు పెరిగిన నేపథ్యంలో ఆదుకోవలసిందిపోయి ధర తగ్గింపుపై నిరసన
ఇప్పటికే బోనస్‌లు, ఇతర రాయితీలు తగ్గించేయడంపై గరంగరం
సేకరణ ధర యథాతథంగా కొనసాగించాలని డిమాండ్
పలు పాల కేంద్రాల వద్ద ఆందోళన
చోడవరం, అక్టోబరు 19(ఆంధ్రజ్యోతి): విశాఖ డెయిరీ పాల సేకరణ ధరను తగ్గిస్తూ తీసుకున్న నిర్ణయంపై పాడిరైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పశువుల దాణా, ఇతర ఖర్చులు పెరిగిపోయిన నేపథ్యంలో పాల సేకరణ ధరను పెంచి రైతులను ఆదుకోవలసిందిపోయి ధరను తగ్గిస్తూ విశాఖ డెయిరీ యాజమాన్యం నిర్ణయం తీసుకోవడంపై మండిపడుతున్నారు.
విశాఖ డెయిరీకి రైతులు సరఫరా చేసే ఆవుపాలను లీటరుకు సుమారుగా రూ.4 నుంచి రూ.5ల వరకు తగ్గిస్తూ విశాఖ డెయిరీ యాజమాన్యం నిర్ణయం తీసుకోవడాన్ని పాడి రైతులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ప్రస్తుతం విశాఖ డెయిరీ ఇస్తున్న ధరలే తమకు గిట్టుబాటు కావడం లేదని, ఈ పరిస్థితుల్లో ధర పెంచాల్సిందిపోయి ఉన్న ధరలను కూడా తగ్గించడాన్ని రైతులు నిలదీస్తున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే తాము ప్రైవేటు డెయిరీలకు వెళ్లిపోతామని హెచ్చరిస్తున్నారు. డెయిరీ తీసుకున్న పాల సేకరణ ధర నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ పాల సంఘాల వద్ద పాలు పోయడానికి నిరాకరిస్తూ ఆందోళనలకు దిగుతున్నారు. పలు చోట్ల విశాఖ డెయిరీ పాల సేకరణ కేంద్రాల వద్ద పాడి రైతులు ఆందోళనలకు దిగుతున్నారు. ఇప్పటికే విశాఖ డెయిరీ పాడి రైతులకు ఇచ్చే బోనస్‌లు తగ్గించేసిందని, చనిపోయిన రైతులకు ఇచ్చే రాయితీలను కూడా కుదించేసిందని, ఇప్పుడు పాల సేకరణ ధర కూడా తగ్గించడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే పశువుల దాణా రేట్లు, పశుగ్రాసం రేట్లు పెరిగిపోయి పశువుల పెంపకం భారంగా మారిందని, ఈ పరిస్థితుల్లో పాల సేకరణ ధర పెంచాల్సిందిపోయి తగ్గించడమేమిటంటూ రైతులు ప్రశ్నిస్తున్నారు. ఆవుపాలకు ధర ఇవ్వలేమని, గేదె పాలే సరఫరా చేయాలని యాజమాన్యం చెబుతున్నదని, ప్రస్తుతం గేదెల రేట్లు రైతులకు అందుబాటులో లేవని రైతులు అంటున్నారు. ఈ ఆవులను ఇచ్చేసి లక్ష, లక్షా 50వేల రూపాయలు వెచ్చించి గేదెలు ఎక్కడ నుంచి తేగలమని రైతులు వాపోతున్నారు. గేదెలు కొనడానికి ఇప్పుడు ఎక్కడ నుంచి డబ్బులు తేగలమని రైతులు వాపోతున్నారు. దాణాల రేట్లు గతంలో కంటే ఎక్కువగా పెరిగిపోయాయని, నూకల బస్తా రూ.1300 పైబడి ఉందని, ఇతర దాణాల రేట్లు కూడా ఎక్కువగానే ఉన్నాయని, ఇలాగైతే ఎక్కడ నుంచి తెచ్చి తాము పశువులను మేపగలమని రైతులు వాపోతు న్నారు. నీటి సౌలభ్యం, అన్ని రకాల సౌకర్యాలతో పాటు దాణాకు కూడా భారీగా వెచ్చిస్తే తప్ప గేదెల పెంపకం చేయలేమేని, అందువల్లే ఆవులను పెంచుతున్నామని, హఠాత్తుగా ఇలా ఆవుపాల సేకరణ ధర తగ్గిస్తే తాము మరింత నష్టపోతామని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విశాఖ డెయిరీ యాజమాన్యం తీసుకున్న ఈ పాలసేకరణ ధర తగ్గింపు నిర్ణయాన్ని సభ్య రైతులు తీవ్రంగా తప్పుపడుతున్నారు. రెక్కలు ముక్కలు చేసుకుని కష్టపడి పశువులను మేపినా, తమకు గిట్టుబాటు కావడం లేదని, ఎంతోకొంత డెయిరీ సహకారం అందించాల్సిందిపోయి, ఇచ్చే రేట్లను తగ్గించడమేమిటంటూ రైతులు ప్రశ్నిస్తున్నారు. తాము సరఫరా చేసిన పాలకు తక్కువ ధర ఇచ్చి, విశాఖ డెయిరీ అనేక వ్యాపారాలు చేస్తూ లాభాలు గడిస్తున్నదని, కానీ తమకు మాత్రం మొండిచెయ్యి చూపిస్తున్నదని, తమ కష్టాన్ని విశాఖ డెయిరీ దోచుకుంటున్నదని విమర్శిస్తున్నారు. పాల సేకరణ కేంద్రాల వద్ద రైతులనుంచి లీటరుకు రూ.35 తీసుకుంటున్న డెయిరీ, అదే కేంద్రంలో ఇతరులకు లీటరు రూ.80కి అమ్ముతున్నదని, దీనిని బట్టి రైతులు ఎంత నష్టపోతున్నారో అర్థం చేసుకోవాలని పాడిరైతులు అంటున్నారు. విశాఖ డెయిరీ పాల సేకరణ ధర తగ్గించడంతో పాటు ఇతర రాయితీలకు కూడా కోతలు అమలు చేయడాన్ని పాడి రైతులు తీవ్రంగా విమర్శిస్తున్నారు. ఇదే వైఖరి కొనసాగితే తాము ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోకతప్పదని, ప్రైవేటు డెయిరీలకు మళ్లిపోతామని హెచ్చరిస్తున్నారు.