ఫణిగిరి ప్రదక్షిణ
ABN , Publish Date - Nov 13 , 2024 | 12:40 AM
కార్తీక పౌర్ణమి రోజున ఉమాధర్మలింగేశ్వరస్వామి కొలువుదీరిన పంచదార్ల ఫణిగిరి ప్రదక్షిణకు ఆలయ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా తొలిసారి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ నెల 15వ తేదీన మూడు మండలాల పరిధిలో సుమారు 24 కిలోమీటర్లు సాగే గిరి ప్రదక్షిణ కారక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొంటారని దేవదాయ శాఖ అధికారులు భావిస్తున్నారు.

పంచదార్ల పుణ్యక్షేత్రంలో తొలిసారి నిర్వహణ
కార్తీక పౌర్ణమి రోజున 24 కిలోమీటర్ల మేర భక్తులు ప్రదక్షిణ
మూడు మండలాల్లో 18 గ్రామాల మీదుగా సాగనున్న పాదయాత్ర
రాంబిల్లి, నంబరు 12 (ఆంధ్రజ్యోతి): కార్తీక పౌర్ణమి రోజున ఉమాధర్మలింగేశ్వరస్వామి కొలువుదీరిన పంచదార్ల ఫణిగిరి ప్రదక్షిణకు ఆలయ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా తొలిసారి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ నెల 15వ తేదీన మూడు మండలాల పరిధిలో సుమారు 24 కిలోమీటర్లు సాగే గిరి ప్రదక్షిణ కారక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొంటారని దేవదాయ శాఖ అధికారులు భావిస్తున్నారు.
రాష్ట్రంలో ప్రసిద్ధి చెందిన శైవక్షేత్రాల్లో పంచదార్ల పుణ్యక్షేత్రం ఒకటి. కొండ దిగువున వున్న రాధామాధవస్వామి ఆలయ గర్భం నుంచి నిరంతరం ఐదు ధారలుగా నీరు ప్రవహిస్తుండడంతో దీనిని ‘పంచదార్ల’ క్షేత్రంగా పిలుస్తుంటారు. భక్తులు ఇక్కడ (పంచ ధారలు) పుణ్య స్నానమాచరించి, ఫణిగిరిపై కొలువుదీరిన ఉమాధర్మలింగేశ్వరస్వామిని దర్శించుకుని పూజలు చేస్తుంటారు. పంచదార్ల క్షేత్రానికి మూడువైపులా ఎత్తైన కొండలు వున్నాయి. అరుణాచలం, సింహాచలం మాదిరిగా ఇక్కడ కూడా గిరి ప్రదక్షిణ చేపట్టాలని దేవదాయ శాఖ అధికారులు భావించారు. మిగిలిన నెలలతో పోలిస్తే కార్తీక మాసంలో పంచదార్ల క్షేత్రానికి భక్తులు అధిక సంఖ్యలో వస్తుంటారు. దీంతో కార్తీక పౌర్ణమి నాడు గిరి ప్రదక్షిణ చేపట్టాలని నిర్ణయించారు. ఈ కార్యక్రమంలో భక్తులు ఉత్సాహంగా పాల్గొనేలా ఏర్పాట్లు చేస్తున్నారు.
గిరిప్రదక్షిణ సాగేదిలా...
పంచదార్ల పుణ్య క్షేత్రం చుట్టూ 24 కిలోమీటర్ల మేర గిరిప్రదక్షిణం చేయాల్సి ఉంటుంది. పంచదార్ల నుంచి బయలుదేరి ధారపాలెం, ధారభోగాపురం, వెంకటాపురం జంక్షన్, గొర్లెధర్మవరం, వెదురువాడ, అచ్యుతాపురం, చోడపల్లి, కొండకర్ల, యర్రవరం, ఉప్పవరం, మల్లవరం, నరేంద్రపురం, చెర్లోపాలెం, మడకపాలెం, మూలజంప, గోకివాడ, కొత్తూరు మీదుగా తిరిగి పంచదార్లకు చేరుకుంటుంది.
భక్తులు పాటించాల్సిన నియమాలు
గిరి ప్రదక్షిణ పారంభించే ముందు భక్తులు రాగి లేదా మట్టి పాత్రలో ఆలయం వద్ద ప్రవహిస్తున్న పంచదార్ల నుంచి జలాలను సేకరించి, అందులో తులసి లేదా మారేడు పత్రం వేయాలి. గిరి ప్రదక్షిణ పూర్తయిన తరువాత ఆలయ ప్రాంగణంలో వున్న ఏ శివలింగం మీద అయిన నీటిని అభిషేకించి తీర్థంగా స్వీకరించాలి.